సోషల్ మీడియా దూకుడు.. రాజకీయాల బూమరాంగ్!

“తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పోరు కేవలం అసెంబ్లీలోనో, సభల్లోనో జరగడం లేదు. ప్రతి మొబైల్‌ ఫోన్‌ ఒక చిన్న రాజకీయ వేదికగా మారింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు తమ తమ డిజిటల్‌ బలగాలు ఉన్నాయి. కార్యకర్తలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, మీమ్‌ క్రియేటర్లు, రాజకీయ వ్యాఖ్యాతలు కలిసి ఒక నిరంతర ప్రచార యంత్రాంగాన్ని నడుపుతున్నారు..”

హ్యాష్‌ట్యాగ్‌ గెలిచింది.. కానీ ఎన్నిక ఓడిపోయింది!
వైరల్‌ వీడియో దూసుకుపోయింది.. కానీ వోటరు మాత్రం మరో తీర్పు ఇచ్చాడు!

 పెండ్యాల కొండల్

తెలంగాణ రాజకీయాల్లో సోషల్‌ మీడియా సృష్టిస్తున్న కొత్త భ్రమ ఇదే. మొబైల్‌ తెరపై కనిపించే రాజకీయ ఉత్కంఠకు, నేలమీద ప్రజల మనసులో ఉన్న రాజకీయ వాస్తవానికి మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోంది. ఒక నాయకుడి ప్రసంగం కంటే పది సెకన్ల క్లిప్‌ ముఖ్యం అవుతోంది. విధానంపై చర్చ కంటే ప్రత్యర్థిని ఎగతాళి చేసే మీమ్‌ ఎక్కువగా వైరల్‌ అవుతోంది. వాస్తవాల కంటే ప్రచారం వేగంగా పరుగెడుతోంది. ఈ డిజిటల్‌ దూకుడులో రాజకీయ పార్టీలు ప్రత్యర్థిని ఓడిస్తున్నామనుకుంటున్నాయి. కానీ తెలియకుండానే తమ రాజకీయ విశ్వసనీయతను కూడా పణంగా పెడుతున్నాయా?

తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పోరు కేవలం అసెంబ్లీలోనో, సభల్లోనో జరగడం లేదు. ప్రతి మొబైల్‌ ఫోన్‌ ఒక చిన్న రాజకీయ వేదికగా మారింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు తమ తమ డిజిటల్‌ బలగాలు ఉన్నాయి. కార్యకర్తలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, మీమ్‌ క్రియేటర్లు, రాజకీయ వ్యాఖ్యాతలు కలిసి ఒక నిరంతర ప్రచార యంత్రాంగాన్ని నడుపుతున్నారు. నాయకుడు మాట్లాడిన క్షణాల్లోనే అనుకూల వీడియోలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థిపై దాడులు వరుసగా మొదలవుతున్నాయి. ఒకే ఘటనకు గంటల వ్యవధిలో రెండు, మూడు ‘నిజాలు’ పుట్టుకొస్తున్నాయి. ఇదే సోషల్‌ మీడియా రాజకీయాల అసలు ప్రమాదం—ప్రజలకు ఏం జరిగిందో చెప్పడం కంటే, ఏం జరిగిందని ప్రజలు నమ్మాలో నిర్ణయించే పోటీ మొదలవడం.

తెలంగాణ రాజకీయాల్లో ఈ ధోరణి మరింత ఆందోళన కలిగించేది. రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికే వ్యక్తికేంద్రీకృతమై ఉన్నాయి. కేసీఆర్‌, కేటీఆర్‌, రేవంత్‌రెడ్డి వంటి నాయకుల చుట్టూనే రాజకీయ చర్చ ఎక్కువగా తిరుగుతోంది. ఇప్పుడు సోషల్‌ మీడియా ఆ వ్యక్తికేంద్రీకృత రాజకీయానికి మరింత మంట పెడుతోంది. విధానంపై విమర్శ వ్యక్తిగత దాడిగా మారుతోంది. నాయకుడిపై విమర్శ పార్టీపై దాడిగా చిత్రీకరించబడుతోంది. ప్రత్యర్థి ఇక రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కాదు.. డిజిటల్‌ శత్రువుగా మారుతున్నాడు.

ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతోంది.
నాయకులు ప్రజల స్పందనను వినడం మానేసి..తమ సోషల్‌ మీడియా గోడల ప్రతిధ్వనినే ప్రజాభిప్రాయంగా భావించే ప్రమాదం. వేలాది మంది ప్రతి పోస్టును ప్రశంసిస్తారు. ప్రతి ప్రసంగాన్ని చరిత్రాత్మకమంటారు. ప్రతి విమర్శను కుట్ర అంటారు. ప్రతి ఎదురుదెబ్బను ప్రత్యర్థి భయంగా అభివర్ణిస్తారు. అలా ఒక నాయకుడి చుట్టూ వాస్తవ ప్రపంచానికి కనిపించని డిజిటల్‌ కోట నిర్మితమవుతుంది. కానీ ఎన్నికల రోజు ఆ కోటకు తలుపులు ఉండవు. వోటరు నేరుగా తన తీర్పు చెబుతాడు. 2023 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణకు ఇదే పాఠం చెప్పాయి. సోషల్‌ మీడియాలో కనిపించే బలం, ఎన్నికల బలం ఒకటి కాదని అవి గుర్తుచేశాయి. ఫాలోవర్లు వోటర్లు కాదు. వ్యూస్‌ వోట్లు కావు. ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌ ప్రజాభిప్రాయానికి కొలమానం కాదు. సోషల్‌ మీడియా శబ్దం ఎంత పెద్దదైనా.. బ్యాలెట్‌ బాక్స్‌ తీర్పు మాత్రం నిశ్శబ్దంగానే వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *