– అమ్మవార్ల కరుణాకటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురవాలి
– దేవాదాయ శాఖ మంత్రి సురేఖ
– నేటినుంచి బోనాల ఉత్సవాలు షురూ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : శతాబ్దాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే మహోత్సవం ఆషాఢ బోనాల ఉత్సవాలు అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రేపు(ఈనెల 16న) గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ప్రారంభమై ఆగస్టు 13న హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణకు వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆషాఢ బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ఎంతో సమన్వయంతో పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలకు అభినందనలు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ బోనాల ఉత్సవాలు తెలంగాణకు ప్రత్యేకమైన శక్తి ఆరాధనా పండుగ అని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం కాదు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక మహోత్సవం అని మంత్రి సురేఖ అన్నారు. బోనాలను కనుల పండువగా నిర్వహించేందుకు రూ.20 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు మÖడువేలకు పైగా దేవాలయాల్లో ఈ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి సురేఖ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు బోనాల ఉత్సవాల్లో పాల్గొననున్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. అమ్మవార్ల దయతో ఈ యేడాది వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా పంటలు పండేలా పరిస్థితులు నెలకొనాలని మంత్రి ఆకాంక్షించారు. భక్తులు సంతోషంగా అమ్మవార్లను దర్శించుకుని బోనాలు సమర్పించి, తిరిగి సంతోషంగా ఇండ్లకు చేరుకునేలా అన్ని శాఖలు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





