– సీతారామ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలపై సుదీర్ఘ చర్చ
-మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు (ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్) వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీతారామ ఎత్తిపోతల పథకంతోపాటు సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌అండ్‌సీసీ) అనుసరిస్తున్న ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ)కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉండటంతో మార్చి 2023 నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన సంగతిని గుర్తుచేశారు. ఈ న్యాయపరమైన చిక్కులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా, పర్యావరణ అనుమతులు మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో సమన్వయంతో పనిచేస్తూ, కేంద్ర మంత్రులు, శాఖలు, అధికారుల వద్ద అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనుమతులు లభించిన వెంటనే పనులు పునఃప్రారంభమై, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి సాగునీటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానిక రైతాంగానికి పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దోమల వాగు నిల్వ సామర్థ్యం పెంపు ప్రతిపాదన
సీతారామ ఎత్తిపోతల పథకంలో పంప్‌హౌస్-1, పంప్‌హౌస్-2 మధ్య దోమలవాగుపై ప్రస్తుతం ఉన్న 0.20 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.50 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో చర్చించినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిల్వ సామర్థ్యం పెరిగితే ఎత్తిపోతల పథకం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, రెండు పంప్‌హౌస్‌ల మధ్య నీటి లభ్యత స్థిరంగా ఉంటుందని మంత్రి వివరించారు. ఈ ప్రతిపాదనకు నీటిపారుదల శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని, కార్యరూపంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
ఎస్కేప్ రెగ్యులేటర్ల ఏర్పాటుపై చర్చ
సీతారామ ప్రధాన కాలువపై పంప్‌హౌస్-1, 2, 3 మధ్య అవసరమైన చోట్ల ఎస్కేప్ రెగ్యులేటర్ల ఏర్పాటు అంశంపైనా విస్తృతంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలంలో అధిక వరద ప్రవాహం ఏర్పడినప్పుడు కాలువకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఈ రెగ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని మంత్రి వివరించారు. కాలువ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడం, అధిక ప్రవాహాన్ని నియంత్రించడం లక్ష్యంగా అవసరమైన సాంకేతిక పరిశీలనలు చేపట్టాలని అధికారులను ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించినట్లు వివరించారు.
యాతలకుంట సొరంగం పనులు 2026 ఆగస్టు నాటికి పూర్తి
సత్తుపల్లి ట్రంక్ కాలువలోని యాతలకుంట సొరంగం తవ్వకం పూర్తయిందని, ప్రస్తుతం లైనింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2026 ఆగస్టు నాటికి లైనింగ్ పూర్తి చేసి నీటి విడుదలకు సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సొరంగం పూర్తయితే సత్తుపల్లి ప్రాంత రైతాంగానికి సాగునీటి లభ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సొరంగం నిర్మాణ బిల్లుల చెల్లింపులను త్వరగా విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగితే నిర్మాణ సంస్థలు మరింత వేగంగా పనులు కొనసాగించే వీలుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
భూసేకరణ పరిహారం, పైప్ ఇరిగేషన్‌పై సూచనలు
సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పరిహార చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి కోరగా, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. భూసేకరణ పరిహారం అందితే బాధిత రైతులకు ఊరట లభించడంతోపాటు ప్రాజెక్టు పనులు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక భూములు ఆయిల్‌పామ్ సాగులో ఉన్నందున, సంప్రదాయ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు బదులు పైపుల ద్వారా సాగునీటి పంపిణీ (పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్) సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. ఆయిల్‌పామ్ తోటలకు నిరంతరం, నియంత్రిత పద్ధతిలో నీరు అందించేందుకు పైప్డ్ ఇరిగేషన్ విధానం మరింత అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర ప్రతిపాదనలు అత్యవసరంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
జూలూరుపాడు సొరంగం పునఃప్రారంభానికి చర్యలు
సీతారామ ప్రధాన కాలువపై జూలూరుపాడు సొరంగం నిర్మాణం వివిధ కారణాలతో నిలిచిపోయిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పనులను ప్రాధాన్యతతో పునఃప్రారంభించి, పాలేరు జలాశయానికి వీలైనంత త్వరగా నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని కోరగా, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. పాలేరు జలాశయానికి నీరు చేరితే ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీరతాయని మంత్రి పేర్కొన్నారు. మొత్తంమీద సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను సమన్వయంతో పరిష్కరించుకుని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి సాగునీటి ప్రయోజనాలు త్వరితగతిన అందించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఇరువురు మంత్రులు ఈ సమావేశంలో పునరుద్ఘాటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





