– సూపర్ స్పెషాలిటీలో ఓపి సేవల ప్రారంభం వాయిదా
– రెండు నెలలుగా ఊదర గొట్టిన ప్రభుత్వ యంత్రాంగం
– బృందాల వారిగా పరిశీలించిన ఉన్నతాధికారులు
– సాఫ్ట్ లాంచ్ వాయిదా అంటూ కలెక్టర్ ప్రకటన
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఓపి సేవల ప్రారంభానికి మళ్లీ బ్రేక్ పడింది. దసరా పండుగ రోజున సూపర్ స్పెషాలిటీ ‘సాఫ్ట్ లాంచ్’(ట్రయల్‌రన్) జరుగుతుందని, అదే రోజు నుంచి ఓపి సేవలు ప్రజలకు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రకటించారు. సోమవారం రాత్రి వరంగల్ సూపర్ స్పెషాలిటీ సాఫ్ట్‌లాంచ్ ప్రారంభానికి అన్ని శాఖలు నిమగ్నమై ఉన్నందున దసరా రోజున కాకుండా మరో తేదిన జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద డీపీఆర్‌వో వాట్సప్‌లో ప్రకటించారు. దీంతో సూపర్ స్పెషాలిటీ ప్రారంభానికి గ్రహణం వీడలేదని స్పష్టమవుతోంది. ఉత్తర తెలంగాణలో అతి పెద్ద హాస్పిటల్‌గా రూపుదిద్దుకుంటున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీలో మౌలిక సదుపాయాలు పూర్తి చేసి యంత్రాలను అమర్చి త్వరలో ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు రెండు నెలలుగా దాదాపు ప్రతి రోజు హైదరాబాద్ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు బృందాల వారిగా వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 15న మంత్రి పొంగులేటి, మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులు సందర్శించి సూపర్ స్పెషాలిటీ అవరణలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్ ఓపి సేవలు సైతం ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ముందుకు రాకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. హాస్పిటల్‌లో వైద్య పరీక్షల పరికరాలు హాస్పిటల్ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న దానిపై స్పష్టత రాకపోవడంతోనే ప్రారంభం వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఓపి సేవలు ప్రారంభించినా వైద్య సేవలు అందుకునేందుకు ఎంజీఎం హాస్పిటల్ కు వెళ్లాల్సిందే. అందుకే సూపర్ స్పెషాలిటీలో ఉత్తుత్తి సేవలు ప్రారంభం చేస్తున్నారని పలువురు నగరంలో చర్చించుకుంటున్నారు. ఈసేవలను సైతం వాయిదా వేయడం ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల వైఫల్యంగా చెప్పకతప్పదు.
ప్రారంభానికి నిధులు, సిబ్బంది కొరత
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి నిధులతోపాటు వైద్యులు, సిబ్బంది నియామకం పూర్తి స్థాయిలో కాకపోవడమే కారణమని తెలుస్తోంది. ఫర్నిచర్, యంత్ర పరికరాలు , బెడ్స్ ,వస్తువులు ఏర్పాటు చేసేందుకు ఎంజీఎంలోని సిబ్బందినే వినియోగిస్తున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్‌లో పనిగంటల కంటే ఎక్కువ టైం విధులు నిర్వహణ వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. చివరకు సెక్యూరిటీ సిబ్బంది సైతం ఎంజీఎంకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్‌ను అడగగా సేవలు నిలిచిపోయాయని సమాధానం రావడం అశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





