– ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన మంత్రి సురేఖ
– వివాదాల తరువాత తొలిసారి సీఎం ఇంటికి
– సీఎంకు ఆడబిడ్డల ఆశీర్వాదాలు ఉండాలని వ్యాఖ్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రక్షా బంధన్ సందర్భంగా అపూర్వ సన్నివేశం ఆవిష్కృతం అయింది. అదేమిటంటే ఇటీవల వివాదంలో చిక్కుకున్న దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించడం. పరకాల వివాదం తర్వాత సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. సీఎం రేవంత్‌రెడ్డికి బంగారు రాఖీ కట్టిన తర్వాత తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్‌రెడ్డికి మూడోసారి రాఖీ కట్టా.. నేను అందరికీ సోదరినే.. పండగ వాతావరణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయను.. ముఖ్యమంత్రికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి ఆయనకు ఇవ్వాలని దేవుడిని కోరుకున్నాన’ని అన్నారు. సీఎం ఇటీవలి ములుగు, పరకాల కార్యక్రమాల్లో వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి సురేఖ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డిని ఆమె తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తమ వర్గీయులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రేవూరిని భారీ ఆధిక్యతతో గెలిపించాలని పరకాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రేవూరే అభ్యర్థి అన్న సంకేతం ఇచ్చినట్లయింది. ఆ మర్నాడే సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ పరకాల నియోజకవర్గం గీసుకొండలో సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిపై, ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడినుంచి పోటీ చేస్తానని గట్టిగా చెప్పారు. ముఖ్యమంత్రిపై సుష్మిత నేరుగా చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖకు నోటీసు ఇవ్వగా కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలిని అవుతానని సమాధానం ఇచ్చారు. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులివ్వడంతోనే పరిమితం కాక చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీఎం నివాసానికి సురేఖ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





