మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న మోదీ సర్కార్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ‘నీకు నేను రక్ష.. నాకు మీరు రక్ష.. మనమిద్దరం కలిసి దేశానికి, ధర్మానికి రక్ష’ అనేదే రక్షాబంధన్ అసలైన సందేశం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రామచందర్ రావు మాట్లాడుతూ భారతీయ సనాతన సంస్కృతిలో అన్నా-చెల్లెలు, అక్కా-తమ్ముళ్ల పవిత్ర అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని అన్నారు. ప్రాచీన కాలంలో యుద్ధ రంగానికి వెళ్లే సైనికులకు మహిళలు రక్ష కట్టి వారి భద్రతను, విజయాన్ని కాంక్షించే గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉందని గుర్తు చేశారు. నేటికీ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు దేశవ్యాప్తంగా మహిళా సోదరీమణులు రాఖీలు కడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళా సంక్షేమం, సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు. పొగచూరిన వంటిళ్లలో బాధపడుతున్న కోట్లాదిమంది తల్లులు, సోదరీమణుల ఆరోగ్యం కోసం పీఎం ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించారని తెలిపారు. గర్భిణులు, బాలింతల పోషణ, ఆరోగ్య భద్రత కోసం ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా ఆర్థిక భరోసా కల్పించారన్నారు. అంతేకాక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళల రాజకీయ హక్కులను నెరవేరుస్తూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని రూపొందించిందని గుర్తు చేశారు. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సమాజానిదని, కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం నిరంతరం మహిళలను కించపరిచేలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలోని మహిళా లోకానికి బీజేపీ ఎల్లవేళలా రక్షణగా, తోడుగా ఉంటుందన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని, హక్కులను, దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళా మోర్చా నాయకులు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రామచందర్ రావు, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *