తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం

“తెలంగాణ అస్తిత్వంపై సవాళ్లు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పుడు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అవహేళన చేస్తున్నాయి.అమరవీరుల త్యాగాలను చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాయి.తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి.ఇది కేవలం రాజకీయ విభేదాల విషయం కాదు.ఇది అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఒక ప్రాంత ప్రజల స్వాభిమానాన్ని గౌరవించకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడమే..” 

-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
మొబైల్: 9441661192

జూన్ 2, 2014 భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సాధారణ తేదీ కాదు. తెలంగాణ  ఆత్మగౌరవం గెలిచిన రోజు.ప్రజాస్వామ్యం ప్రజల ఆకాంక్షలకు తలవంచిన రోజు. దశాబ్దాల పోరాటాలకు ఫలితం దక్కిన రోజు.తెలంగాణ ప్రజలు తమ చరిత్రను తాము రాసుకున్న రోజు. అణచివేతపై ఆత్మగౌరవం విజయం సాధించిన రోజు. నేటి జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.ఈ సందర్భం కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఉద్యమ లక్ష్యాలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం.అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన చారిత్రక అవసరం. తెలంగాణ అస్తిత్వంపై కొనసాగుతున్న సవాళ్లను అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది.

తెలంగాణ రాష్ట్రం అనేది రాజకీయంగా ఎవరో ఇచ్చిన బిక్ష కాదు.అది పోరాడి సాధించుకున్న హక్కు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటం నుండి మొదలుకొని, 1969 విద్యార్థి ఉద్యమం, 2001 తర్వాత పునరుద్ధరించబడిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు అనేక తరాల పోరాటాల సమాహారం తెలంగాణ.వేలాది మంది ఉద్యమకారులు జైళ్ళు జీవితం అనుభవించారు.వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారు.లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పారు.తెలంగాణ ఉద్యమం వెనుక కేవలం పరిపాలనా విభజన  కోరిక మాత్రమే లేదు. నీళ్లు, నిధులు, నియామకాలపై హక్కు కావాలనే ఆకాంక్ష బలంగా ఉంది.
రాజకీయ స్వయంపాలన కావాలనే సంకల్పం ఉంది.సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తపన ఉంది.దశాబ్దాలుగా కొనసాగిన వివక్షకు ముగింపు పలకాలనే సామూహిక చైతన్యం ఉంది.తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాంత చరిత్రను అర్థం చేసుకోవాలి. ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ప్రజల ఆందోళనలను గుర్తించింది. పెద్దమనుషుల ఒప్పందం తెలంగాణ ప్రయోజనాలను రక్షిస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు. ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది.సాగునీటి విషయంలో వివక్ష జరిగింది.ఆదాయాలు ఇక్కడి నుంచి వెళ్ళాయి. అభివృద్ధి అవకాశాలు ఇతర ప్రాంతాలకు మళ్లాయి.ఈ అనుభవాలే తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాదులు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.తెలంగాణ భాషకు గౌరవం పెరిగింది. బతుకమ్మ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది.స్థానిక చరిత్రపై పరిశోధనలు పెరిగాయి.ప్రాంతీయ ఆత్మవిశ్వాసం బలపడింది.కానీ రాష్ట్రం ఏర్పడిందనే కారణంతో ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నెరవేరిపోయాయని భావించడం పొరపాటు.ఎందుకంటే తెలంగాణ అస్తిత్వంపై సవాళ్లు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పుడు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అవహేళన చేస్తున్నాయి.అమరవీరుల త్యాగాలను చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాయి.తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి.ఇది కేవలం రాజకీయ విభేదాల విషయం కాదు.ఇది అస్తిత్వానికి సంబంధించిన విషయం.
ఒక ప్రాంత ప్రజల స్వాభిమానాన్ని గౌరవించకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడమే.తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం భారత రాజ్యాంగ పరిధిలో జరిగిన ప్రజాస్వామ్య ప్రక్రియ.అలాంటి చారిత్రక నిర్ణయాన్ని అవమానించడం అంటే కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను అవమానించడమే.ప్రత్యేకించి తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడులను తెలంగాణ సమాజం గమనించాలి.భాషను, యాసను, చరిత్రను, సంస్కృతిని అవమానించడం అనేది రాజకీయ ఆధిపత్యం యొక్క మరో రూపం.చరిత్రలో ప్రతి ఆధిపత్య శక్తి ముందుగా ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించింది. వారి సంస్కృతిని తక్కువ చేసి చూపింది.వారి చరిత్రను వక్రీకరించింది.తెలంగాణ ఉద్యమం అలాంటి ఆధిపత్యాన్ని తిరస్కరించిన ఉద్యమం.
ఇటీవలి కాలంలో దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి.సమాఖ్య వ్యవస్థ బలహీనపడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల హక్కులపై చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికార కేంద్రీకరణ పెరుగుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది.ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మూలంలోనే స్వయం పాలన అనే భావన ఉంది.హైదరాబాద్ నగరం విషయంలో కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి.ఈ నగరాన్ని కేవలం పెట్టుబడుల కేంద్రంగా మాత్రమే చూడటం సరైన దృక్పథం కాదు. హైదరాబాద్ తెలంగాణ చరిత్రకు ప్రతీక. తెలంగాణ ఆర్థిక శక్తికి కేంద్రం. తెలంగాణ ప్రజల శ్రమ, తెలివితేటలు, పోరాటాల ఫలితం. అందువల్ల హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను, హక్కులను, చారిత్రక సంబంధాలను గౌరవించాల్సిందే.
జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరో ముఖ్యమైన అంశాన్ని గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం మనకు అధికారాన్ని మాత్రమే ఇవ్వలేదు. ఒక బాధ్యతను కూడా అప్పగించింది. ప్రశ్నించే బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత. వనరులను రక్షించే బాధ్యత.సామాజిక న్యాయాన్ని స్థాపించే బాధ్యత. యువత భవిష్యత్తును నిర్మించే బాధ్యత.
ఈ 12 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు కోరుకున్న విజయాలను తెలంగాణ సాధించలేకపోయింది.నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ రంగాల బలోపేతం, సామాజిక న్యాయం, విద్యా రంగ అభివృద్ధి వంటి అనేక అంశాలలో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉద్యమం కలగన్న తెలంగాణ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం పండుగ కాదు. అది ఒక రాజకీయ, సామాజిక బాధ్యతను గుర్తు చేసే రోజు. అమరవీరుల త్యాగాలను స్మరించుకునే రోజు. ఉద్యమ చరిత్రను కొత్త తరాలకు చెప్పే రోజు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే సంకల్పాన్ని పునరుద్ఘాటించే రోజు..గెలిచి నిలిచిన తెలంగాణను బలహీనపరచాలనుకునే శక్తులు ఉండవచ్చు.తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే రాజకీయాలు కొనసాగవచ్చు. తెలంగాణ సంస్కృతిని కించపరిచే ప్రయత్నాలు జరగవచ్చు. కానీ చరిత్ర ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. తెలంగాణ ప్రజలు మౌనంగా ఉండవచ్చు. కానీ తమ ఆత్మగౌరవంపై దాడి జరిగితే ఎన్నడూ తెలంగాణ ప్రజలు  తలవంచరు.
12 ఏళ్ల తెలంగాణ సందర్భంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతినబునాల్సిన అవసరం ఉన్నది. సందర్భంగా అమరవీరుల ఆశయాలను నిలబెట్టుకుందాం. తెలంగాణ చరిత్రను కాపాడుకుందాం. తెలంగాణ సంస్కృతిని పరిరక్షిద్దాం. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేద్దాం. ఆధిపత్య రాజకీయాలను తిరస్కరిద్దాం.స్వయం పాలన స్ఫూర్తిని సజీవంగా ఉంచుదాం.ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒక విజయం మాత్రమే.తెలంగాణ అస్తిత్వాన్ని తరతరాలకు అందించడం మన అందరి  బాధ్యత.
జై తెలంగాణ… జై జై తెలంగాణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *