ప్రపంచ కల్లోలాల మధ్య శాంతి స్వరం 

“కాలం మారినా, ప్రపంచ పరిస్థితులు మారినా కొన్ని గేయాలు మాత్రం తమ ప్రాసంగికతను కోల్పోవు. అలాంటి ఆలోచింపజేసే గేయాల్లో జి.వై. గిరి రచించిన “శాంతి కావాలి” ఒకటి. ఈ పాట ఆయన రచించిన “శాంతి స్నేహ గీతాలు” సంపుటిలోనిది. ఇది మానవత్వాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతో రాసిన ఒక సామాజిక పిలుపు.జి.వై. గిరి రచనల్లో ఎప్పుడూ సామాన్య మనిషి జీవితమే కేంద్రబిందువుగా ఉంటుంది. సమాజంలో పెరుగుతున్న అసమానతలు, అధికార రాజకీయాల దుష్పరిణామాలు, యుద్ధ వాతావరణం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఆయన ఎంతో సున్నితంగా వ్యక్తీకరించారు. “ప్రపంచ శాంతి కావాలి”, “సుస్థిర శాంతి కావాలి” అనే పంక్తులు ఆయనలోని మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి.”

-గుడికందుల తేజ
యువకవి,జనగామ
మొబైల్ :  7674861727

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని ప్రజాకవి జి.వై.గిరి. ఈయన 1937లో విప్లవాల పురిటిగడ్డగా పేరొందిన జనగామ మండలం, వడ్లకొండ గ్రామంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు గుడికందుల బ్రహ్మయ్య, జగదాంబ. గిరి ప్రాథమిక విద్యతోనే చదువుకు స్వస్తి పలికి, సమాజాన్ని చదవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.‌తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో బాల్యంలోనే బాల సంఘంలో సభ్యుడిగా చేరిన జి.వై.గిరి, వామపక్ష భావజాలాన్ని వంటబట్టించుకున్నారు. 1956లో కష్టజీవుల పార్టీ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)లో చేరారు. గ్రామ శాఖ కార్యదర్శిగా, తాలూకా స్థాయి నాయకుడిగా ప్రజాపక్షాన నిలిచి అనేక ఉద్యమాలను నిర్మించి, ముందుండి నడిపించారు.స్వతహాగా రచయిత, గాయకుడైన జి.వై.గిరి… సిపిఐ ప్రజాసంఘాలైన అభ్యుదయ రచయితల సంఘం (అరసం), ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలిలో రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వర్తించి ప్రత్యేక గుర్తింపు పొందారు. గిరి గారు రాసిన “మారాలి మన సమాజం”, “ఎవరిది ఎక్కువ కులం”, “అక్షరం ముక్క రాకపోతే” వంటి పాటలు నేటికీ ప్రజా బాహుళ్యంలో వినబడుతూనే ఉన్నాయి. సమాజంలోని రుగ్మతలపై ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈయన ప్రదర్శించిన పలు కార్యక్రమాలు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమయ్యాయి.

    రచనలు – చలనచిత్రాలు:జి.వై.గిరి పాటలు, అక్షరం, సంఘం, శాంతి స్నేహ గీతాలు, పిట్టలదోర, బంధనాల్లో బ్రతుకులు, మంత్రాల పేరుతో చిత్రహింసలు, పర్యావరణ పరిరక్షణ, మార్పు కోసం, వీర తెలంగాణ జనగామ జన పోరాటం వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించి ముద్రించారు. వీటితో పాటు ‘ఆశాజ్యోతి’, ‘ధర్మవడ్డి’, ‘దండోరా’, ‘పిల్లలు కాదు పిడుగులు’ వంటి చలనచిత్రాలకు కూడా ఆయన పాటలు రాశారు.‌1979లో ‘క్రాస్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో కల్చరల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. 1985లో జనగామలో “సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధి సేవా సంస్థ” అనే స్వచ్ఛంద కళా సంస్థను ప్రారంభించి, కళా మరియు సాహిత్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. కళా, సాహిత్య రంగాలలో ధ్రువతారగా వెలిగిన జి.వై.గిరి గారు 02 జూన్, 2003న తుదిశ్వాస విడిచారు.
    యుద్దం యుద్ధం… ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. ప్రపంచ రాజకీయాలు యుద్ధాల వైపు పరిగెడుతుంటే, సామాన్య ప్రజలు మాత్రం శాంతిని కోరుకుంటున్నారు. “యుద్ధం చివరికి ఎవరిని కబళిస్తుంది?” అనే ప్రశ్నకు సమాధానం ఎప్పుడూ సామాన్య ప్రజానీకమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయేది కేవలం సైనికుడే కాదు; తన బిడ్డ కోసం ఎదురుచూసే తల్లి, కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారి, నిరాశ్రయుడైన సామాన్యుడు కూడా. ఇలాంటి మానవ విషాదాల మధ్య శాంతి, స్నేహ గీతాలు ఆలపిస్తూ మానవత్వం కోసం పరితపించిన ప్రజాకవి జీ.వై. గిరి గారు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారని ఆయన పాటలే చెప్తాయి.
    కాలం మారినా, ప్రపంచ పరిస్థితులు మారినా కొన్ని గేయాలు మాత్రం తమ ప్రాసంగికతను కోల్పోవు. అలాంటి ఆలోచింపజేసే గేయాల్లో జి.వై. గిరి రచించిన “శాంతి కావాలి” ఒకటి. ఈ పాట ఆయన రచించిన “శాంతి స్నేహ గీతాలు” సంపుటిలోనిది. ఇది మానవత్వాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతో రాసిన ఒక సామాజిక పిలుపు.జి.వై. గిరి రచనల్లో ఎప్పుడూ సామాన్య మనిషి జీవితమే కేంద్రబిందువుగా ఉంటుంది. సమాజంలో పెరుగుతున్న అసమానతలు, అధికార రాజకీయాల దుష్పరిణామాలు, యుద్ధ వాతావరణం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఆయన ఎంతో సున్నితంగా వ్యక్తీకరించారు. “ప్రపంచ శాంతి కావాలి”, “సుస్థిర శాంతి కావాలి” అనే పంక్తులు ఆయనలోని మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి.
    రాబోయే తరాల భవిష్యత్తు కోసం పరితపించే వాక్యాలు ఆయన పాటల్లో కనిపిస్తాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూస్తే ఈ గేయం ఎంత దూరదృష్టితో రాయబడిందో అర్థమవుతుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అనేక కుటుంబాలను విడదీసింది. గాజాలో కొనసాగుతున్న హింస అమాయక ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు, ఉగ్రవాద ఘటనలు, అధికార పోరాటాలు మానవ జీవితాన్ని అస్థిరంగా మారుస్తున్నాయి. ఇలాంటి యుద్ధాల మధ్య శాంతి కపోతాన్ని ఎగరవేయాలని ఈ గేయం పిలుపునిస్తుంది. నేటికీ కొన్ని ప్రాంతాల్లో జీ.వై. గిరి గారి శిష్య బృందం ఈ పాటను పాడుకుంటున్నారు అంటే, ముఖ్యంగా మానవాళిని పట్టిపీడిస్తున్న యుద్ధ విషాద సమయాల్లో ఈ పాట అవసరత ఎంతగానో ఉందో అర్థమవుతుంది.
ఈ పాటలో కవి యుద్ధాన్ని కేవలం దేశాల మధ్య పోరాటంగా మాత్రమే చూడలేదు. మనుషుల మధ్య పెరుగుతున్న ద్వేషాన్ని, ఆధిపత్య భావజాలాన్ని, హింసను కూడా ప్రశ్నించారు. “స్నేహభావాలు నరనరాలోనే” అనే భావవ్యక్తీకరణ ద్వారా పరస్పర విశ్వాసం, మానవ సంబంధాలే నిజమైన శాంతికి పునాది అని గుర్తుచేశారు. ఆయుధాలు కాదు, మనుషుల మనసుల్లో ప్రేమ పెరిగితేనే ప్రపంచం ప్రశాంతంగా మారుతుందని కవి ఆకాంక్షించారు.
     ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని కుదిపేసిన ప్రకృతి విపత్తులు కూడా ఈ గేయాన్ని మరింత సమకాలీనంగా నిలబెడుతున్నాయి. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాలు, లిబియాలో వచ్చిన వరదలు, మన దేశంలో తరచూ ఎదురవుతున్న తుఫానులు ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం ఎంత సున్నితమైనదో తెలియజేస్తున్నాయి. ప్రకృతిని దోచుకుంటూ అభివృద్ధి పేరుతో సాగుతున్న విధ్వంసం చివరకు మానవ జీవితాన్నే సంక్షోభంలోకి నెడుతోందని ఈ గేయ భావం సూచిస్తుంది.
     ఆదివాసీల హక్కులను కాలరాసే పరిస్థితులు, భూమి కోసం జరుగుతున్న పోరాటాలు, అణగారిన వర్గాల ఆవేదనలు.. ఇవన్నీ మానవత్వం ఎంత ప్రమాదంలో ఉందో గుర్తుచేస్తున్నాయి.జి.వై. గిరి దృష్టిలో శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఆకలి లేని సమాజం, దోపిడీ లేని జీవితం, భయం లేని మనిషి, ప్రేమతో నిండిన ప్రపంచం—ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన శాంతి సిద్ధిస్తుంది. అందుకే ఈ గేయం విన్నప్పుడు అది కేవలం ఒక పాటలా కాకుండా, మానవత్వాన్ని కాపాడుకోవాలనే ఆవేదనగా మనసును తాకుతుంది.భాషా పరంగా కూడా ఈ పాట ఎంతో సహజంగా ఉంటుంది. ప్రజల మాటలతోనే ప్రజల భావాలను పలికించే శైలి జి.వై. గిరి రచనల్లోని ప్రత్యేకత.
     నేటి ప్రపంచంలో పెరుగుతున్న హింస, విభేదాలు, మానవ సంబంధాల క్షీణత మధ్య “శాంతి కావాలి” వంటి గేయాలు మరింత అవసరమవుతున్నాయి. ప్రజల మధ్య మానవత్వాన్ని నిలబెట్టాలని, ప్రపంచం శాంతి దిశగా నడవాలని కోరుకున్న జి.వై. గిరి ఆలోచనలు ఈ పాటలో స్పష్టంగా ప్రతిధ్వనిస్తాయి.ప్రజల జీవితాన్ని సాహిత్యానికి కేంద్రంగా చేసుకున్న అభ్యుదయ కవిగా జి.వై. గిరి తెలుగు పాటల సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసే విధంగా సాగిన ఆయన రచనలు నేటి తరం పాటల్లోనూ మార్పు తీసుకురావాలి. “ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులం” అంటూ వివక్షను నిరసించి, ప్రజాదరణ పొందిన ఈ పాటలను సాహితి లోకం ఎన్నటికీ మరువదు.1974లో జరిగిన ప్రపంచ శాంతి మహాసభల్లో ప్రారంభ గీతంగా ఈ పాటను పాడారు. దీనికి సినీ సంగీత దర్శకులు చలపతిరావు  అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. “జి.వై.గిరి 1974లోనే ఈ శాంతి సందేశ గీతాన్ని రాశారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధాలను ఆపాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ఈ పాట నేటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.”
 (2వ తేది జూన్ అభ్యుదయ రచయిత జి.వై.గిరి 24వ వర్ధంతి సందర్భంగా ఈ గీతంపై సమాలోచన)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *