5 లక్షల యువతకు సర్కారు భారీ నజరానా

రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6000 కోట్లు
జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
వెల్లడించిన  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ వీరవనిత చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.  యువత వికాసం గురించి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వివరించారు.‌ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారని వివరించారు.‌

ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షల చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం  తీసుకుందని ఆయన వెల్లడించారు. 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ సంవత్సరం స్వయం ఉపాధి పథకం అందించడానికి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.  స్వయం ఉపాధి పథకం కొరకు ఆన్ లైన్ లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తామని వివరించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు. సామాజిక స్పృహ కలిగిన ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించడం సామాజిక బాధ్యతగా తీసుకుందని అన్నారు.

చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 540 కోట్లు
వీరవనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం రూ.540 కోట్లు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీ గా తీర్చిదిద్దడానికి అద్భుతమైన నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిందని తెలిపారు. యూనివర్సిటీ లో ఉన్న హెరిటేజ్ భవనాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం మూసీ రివర్ ను ఆనుకొని ఉందని మూసి పునర్జీవం అయిన తర్వాత యూనివర్సిటీ ప్రధాన ద్వారా అన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15.5 కోట్లు,  అదేవిధంగా నూతన భవన నిర్మాణాలకు తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. హెరిటేజ్ భవనాలు, పునరుద్ధరణ ప్రణాళికలను అధికారులతో కలిసి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీష్, ఐలమ్మ యూనివర్సిటీ వీసీ సూర్య ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *