నేటి తరానికి ప్రజాస్వామిక విలువలను బోధించాలి

మానవ హక్కుల నేత ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌
‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ ఉద్యమ ప్రస్థానం’ గ్రంథావిష్కరణ
కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న పలువురు వక్తలు  

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : మతోన్మాద ఫాసిజం, సామ్రాజ్యవాద ప్రపంచ సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో నేటి తరానికి ప్రజాస్వామిక విలువలు, లౌకిక సంప్రదాయం ఆవశ్యకతను తెలియజేయాలని మానవ హక్కుల నాయకులు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌  అభిప్రాయపడ్డారు.  ‘‘భారత స్వాతంత్రోద్యమంలోనూ, చారిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ తెలుగు నాట తలెత్తిన సకల సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలలోనూ, నిర్ణయాత్మక పాత్రను నిర్వహించిన మహోద్యమం భారత కమ్యూనిస్టు ఉద్యమం’’ అని పలువురు కమ్యూనిస్టు నాయకులు, ప్రముఖులు అన్నారు. ‘మట్టి మనుషులను మహా నాయకులుగా, సామాన్యులను మాన్యులైన ఉద్యమకారులుగా, ప్రతి ఆద్యము ఎగుడు దిగుడులను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పీడిత ప్రజల పక్షాన నిర్విరామంగా పోరాడుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం’ అని వక్తలు కొనియాడారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకులూ కందిమళ్ళ ప్రతాపరెడ్డి రచించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ ప్రముఖ విప్లవకవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ లో శనివారం జరిగింది. ‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ ఉద్యమ ప్రస్థానం’ గ్రంథాన్ని మానవ హక్కుల నాయకులు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ ఆవిష్కరించారు. ‘విప్లవాల విప్లవం’ గేయ సంపుటిని సుప్రసిద్ధ సాహిత్య పరిశోధకులు, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. కార్యక్రమానికి అతిధులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట రెడ్డి, కలవేణ శంకర్‌, ప్రముఖ కవి విమర్శకులు ఏటుకూరి ప్రసాద్‌, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు నరహరి, మాజీ ఎం ఎల్‌ ఎ మానం ఆంజనేయులు హజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రొపెసర్‌ జి. హరగోపాల్‌ మాట్లాడుతూ మతోన్మాద ఫాసిజం, సామ్రాజ్యవాద ప్రపంచ సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో నేటి తరానికి ప్రజాస్వామిక విలువలు, లౌకిక సంప్రదాయం ఆవశ్యకతను తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఉద్యమాలలో పాటలు నిర్వహించే పాత్రను వివరించిన ప్రతాపరెడ్డిని అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ నిర్వహించిన సభ ప్రారంభంలో ప్రజా నాట్యమండలి గాయకుడు పల్లె నరసింహ గానం చేసిన ప్రతాపరెడ్డి గారి పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. తొలుత నిఖిలేశ్వర్‌ అధ్యక్షపన్యాసం చేస్తూ తొంబై ఏళ్లు పూర్తి చేసుకున్న కందిమళ్ల ప్రతాపరెడ్డి సాహిత్య కృషిని వక్తలు అభినందించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *