సింగ్‌సాబ్‌కు ‘ప్రజాతంత్ర’ సలామ్‌..!

  • తెలంగాణ ఏర్పాటులో ‘మన మోహనుడు’
  • రాష్ట్ర సాధనలో  సానుకూల అడుగులు
  • వ్యూహాత్మక చతురత ప్రదర్శించిన నాటి ప్రధాని

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

ఎన్నో ప్రతిబంధాల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగామంటూ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ తన చివరి ప్రసంగంలో వ్యక్తం చేసిన తీరు.. తెలంగాణ విషయంలో ఆయన ఎన్ని విషమ పరీక్షలను ఎదుర్కున్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. తన పదవీకాలం పూర్తయిన సందర్భంగా లోక్‌ సభలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలోకూడా తెలంగాణను ప్రస్తావించారంటే తెలంగాణ పట్ల ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పడడమన్నది జాతి తీసుకున్న నిర్ణయంగా ఆయన ఆనాడు చెప్పుకొచ్చారు. ఎవరు వ్యతిరేకించినా తమ హామీలను నెరవేర్చడంలో కఠినతర నిర్ణయాలు తీసుకోగలమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అనుకూలంగా వ్యవహరించినప్పటికీ దాన్ని రాజ్యాంగ ప్రక్రియ ద్వారా సానుకూలం చేయడంలో ఆయన చతురతను చాటుకున్నారు. దశాబ్దాలుగా తెలంగాణ అంశం నలుగుతూ వొచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్ననాటి నుంచీ తెలంగాణ ప్రజల ఆక్రందనలను మన్‌మోహన్‌సింగ్‌ వింటూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ ఆవశ్యకతను పలుసార్లు ఆయన ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి వివరించారు. దాన్ని పూర్తిగా ఆకళింపుచేసుకున్న మన్‌మోహన్‌సింగ్‌ ప్రధాని అయిన తర్వాత తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చడంలో, అనంతరం ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ వేయడం, ఆ తర్వాత ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటింపజేయడంతోపాటు ఉభయ సభల ఆమోద ముద్ర వేయించడంలో ఆయన చొరవను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. దీంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటానికి ప్రధానిగా మన్‌మోహన్‌సింగ్‌ ముగింపు పలికినట్ల్కెంది. రాష్ట్ర ఏర్పాటుపట్ల ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వీయ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు, ఎంపీలు, మంత్రులు పలువురు వ్యతిరేకించినా ఏమాత్రం వెనక్కు తగ్గని ధీరోదాత్తుడనిపించుకున్నాడు. ఎందుకంటే ఆనాడు మన్‌మోహన్‌సింగ్‌ది పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వం కాదు. ఒక పక్క కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న సీమాంధ్ర మంత్రుల రాజీనామా బెదిరింపులు, మరోపక్క మిత్రపక్షమైన వామపక్షనేతల నిరసనలను కూడా లెక్కచేయలేదంటే ఆయన ఎంత దృఢచిత్తంతో ఉన్నాడన్నది అర్థమవుతుంది .బిల్లు రాజ్యసభ ఆమోదం పొందే తరుణంలోకూడా బిజెపి నాయకులు అరుణ్‌జట్లీ, వెంకయ్యనాడు లాంటివారు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని పట్టుబట్టారు. అయితే దానికున్న సాంకేతిక కారణాలను వివరించి అప్పటికి వారిని వ్యూహాత్మకంగా మెప్పించి, ఒప్పించి బిల్లును ఆమోదింపజేయటం మన్‌మోహన్‌సింగ్‌కే సాధ్యపడిరది.
పార్లమెంటులో గందరగోళ వాతావరణం ఏర్పడినా, భవిష్యత్‌లో తమ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. తెలంగాణతో మన్‌మోహన్‌సింగ్‌కు ప్రత్యేక అనుబందం ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటిలేదు. ఆయన దేశ 13వ ప్రధానిగా పదేళ్లు (2004`2014)పాటు రెండు విడతలుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ అజాతశత్రువుగా కొనియాడబడ్డారు. మౌనమునిగా, మితభాషిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా భారత్‌ను ప్రపంచంలోనే గౌరవస్థానంలో నిలబెట్టగలిగారు. పివి నరసింహారావు క్యాబినెట్‌లో ఆర్థికశాఖ మంత్రిగా ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థిక సంస్కర్తగా ఆయన దేశ ప్రజల్లోనేకాదు, ప్రపంచం మెచ్చిన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశాయి.
రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా మహిళా బిల్లు, రిజర్వేషన్‌ బిల్లులను ఆమోదింపజేసిన మన్‌మోహన్‌ సింగ్‌ భూ సేకరణ చట్టాన్ని ఆధునీకరించారు. ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతులు, ప్రాజెక్టుల కింద భూములను కోల్పోతున్న బాధితులకు ఆర్థిక సహకారం, పునరావాసం అందించే విషయంలో ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. ఆయన కాలంలోనే ఒక మహిళ ప్రతిభాపాటిల్‌ రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, ఆయన క్యాబినెట్‌లో తెలంగాణ పోరాట యోధుడు కెసిఆర్‌ మంత్రిగా కొనసాగటం లాంటివి కొన్ని జ్ఞాపకాలు మాత్రమే… తెలంగాణలో ఆయన చివరిసారిగా 2014 ఏప్రిల్‌ 26న పర్యటించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భువనగిరిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఆనాడు కూడా ఆయన కాంగ్రెస్‌ లేకుంటే తెలంగాణ వొచ్చేది కాదని సభా ముఖంగా చెప్పడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *