నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు
ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్
రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్ రెడ్డి. అరెస్సెస్‌తో మొదలైన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు..వివాదాలూ, ఓటములు, అవినీతి ఆరోపణలు, సొంత పార్టీ నేతల నుంచి అనేక విమర్శలు ఎదురైనా..మాస్ ఫాలోయింగ్‌తో వాటంన్నింటినీ ఎదుర్కుంటూనే తనదైన దూకుడుతో దూసుకెళ్లారు. జనాకర్షక నేతగా ఎదిగారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగుతున్న పేరు. తెలంగాణ రాజకీయాల్లో పడి లేచిన కెరటం రేవంత్ రెడ్డి 2023 సంవత్సరం ‘చెప్పుకోదగ్గ మనిషి ..’
హైదరాబాద్, డిసెంబర్ 30 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ వేరుపడి తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ ఆయుధాన్ని ఉపయోగించి, ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో 22 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నెలకొల్పి ఉద్యమం తీవ్రస్థాయిలో నడిపి చావునైనా లెక్క చేయనన్న శపథంతో 2014లో కాంగ్రెస్ సమ్మతితో రాష్ట్రం సాధించి దశాబ్దం పాటు పాలనా పగ్గాలు చేతబూని హ్యాట్రిక్ సాధన ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు ఆయన కుటుంబం, పార్టీ అనుచరులు, కన్న కలలు కల్లలు చేసిన ఘనత సాధించారు అనుముల రేవంత్ రెడ్డి. తెరాసను జాతీయ స్థాయిలో విస్తరింప జేస్తూ పార్టీని భారత రాష్ట్ర సమితిగా పునః నామకరణం చేసి రాష్ట్ర స్థాయి నుంచీ జాతీయ స్థాయిలో నాయకునిగా ఎదిగి భారతదేశ పాలనా పగ్గాలు చేబూనడమే ధ్యేయంగా కృషి చేస్తున్నవారి ఆశలను వమ్ము చేసి దశాబ్దంగా జీవచ్ఛవంగా తయారైన కాంగ్రెస్‌కు పునర్జన్మ నిచ్చిన నాయకుడుగా రేవంత్ ఎదగడం అనూహ్యమే.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం హస్తగతమైంది. రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్‌ఎస్ పార్టీపై వ్యతిరేకతో..తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై నమ్మకమో కానీ.. ఈసారి హస్తం పార్టీకే ఓటరు జై కొట్టారు. ఈ సమయంలోనే.. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే సీఎం అభ్యర్థి ఎవరూ అన్న చర్చ జరుగుతుండగా..వినిపించిన పేరు రేవంత్ రెడ్డి. అతడే ఒక సైన్యంగా తయారై కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన – పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి..తెలంగాణలో తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చిన ఘతన కూడా రేవంత్ రెడ్డిదే. అతడే ఒక సైన్యమై..అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి..చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పని అయిపోయిందన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి..అధికారానికి చేరువ చేసిన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని ప్రతిక్షణం..ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా రేవంత్ మారారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున, ప్రాజెక్టుల విషయంలో భూముల కోల్పోయిన నిర్వాసితుల తరపున, మాస్టర్ ప్లాన్ల విషయంలో రైతుల తరపున, పేపర్ లీకేజీ విషయంలో యువత తరపున, కేసీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ఎప్పటికప్పడు నిలదీస్తూ .. అడుగడుగునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ఉద్యమకారుడిగా మారిపోయారు రేవంత్. రాష్ట్రంలో ఏం జరిగినా..ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని..తెలంగాణ సమాజానికి ఓ భరోసాగా నిలవటంలో విజయవంతం అయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన వేసే వ్యూహాత్మకమైన అడుగులతో కేసీఆర్ తర్వాత అంత రేంజ్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
అప్పట్లో ఆయనకు సమైక్యవాదుల్లో గ్లామర్ సంపాదించి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటి నుంచే కేసీఆర్ పైనా ఆయన కుటుంబం పైనా తీవ్రపదజాలంతో విరుచుకుపడే నేతగా రేవంత్‌కి పేరుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేకుల కూడలిగా చెప్పుకోదగిన వారిలో ఆయన ఒకరు. కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబం సభ్యులపై ఆయన పరిధులు దాటి తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. బీఆర్‌ఎస్ అధిపతికి తానే సరిజోడు అనిపించుకునేందుకు ప్రతీకాత్మకంగా ఆయన మీద రేవంత్ స్వయంగా పోటీ చేశారు. కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్‌తోపాటు, కామారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా, రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గం కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీకి దిగారు.
రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపించిన బీఆర్‌ఎస్ పార్టీ అనేక అవినీతి కార్యక్రమాలు చేసిందని..అందులో సింహభాగం కేసీఆర్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి చాలా బలంగా వాదిస్తూ వొస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ మాత్రమేనని గణాంకాలతో సహా వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ధీటుగా ప్రశ్నించటంలోనూ.. వారికి అంతే స్థాయిలో సమాధానం చెప్పటంలోనూ రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు అనే పేరుండగా..రేవంత్ రెడ్డి మాత్రమే ఎలాంటి చీలికలు లేకుండా పార్టీని నడపగలిగారని..ప్రభుత్వాన్ని నడపటంలోనూ పోషిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను గణాంకాలతో సహా వివరిస్తూ గడగడలాడిరచిన దృశ్యాలు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తన గళంగా వినిపించటంలో సక్సెస్ అయిన రేవంత్.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను అధిగమించటంలో, అవినీతి రహిత పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని పదే పదే చెప్తూన్న రేవంత్‌కు ఓ అవకాశమైతే ఇవ్వాలి అన్నది తెలంగాణ వోటర్ల అభిప్రాయం.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆందోళనలు, నిరసనలకు గానూ..రేవంత్‌పై సుమారు 200 కేసులు నమోదయ్యాయి. అవన్ని తనకు వొచ్చిన మెడల్స్‌గా భావిస్తానంటూ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టే ఏకైక, బలమైన లీడర్ రేవంత్ రెడ్డి మాత్రమే అన్న వాదన ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆయన విజయవంతమయ్యారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీయార్‌కు సరితూగే ప్రత్యర్థిని తానేనని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించి, అందులో విజయం సాధించారు. అసమ్మతులకు, వర్గాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ, అందరినీ కలుపుకు పోయే ప్రయత్నాలు చేసి రేవంత్, అటు అధిష్టానానికి కూడా చేరువయ్యారు.