పోక్సో కేసులో 20ఏళ్లు, హత్య కేసులో యావజ్జీవం

– బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో 
– శిక్ష విధించిన సిరిసిల్ల పోక్సో కోర్టు

రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌మైనర్‌ ‌బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్‌ ‌కుమార్‌ (27)‌కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్‌ ‌బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ ‌కథనం ప్రకారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్‌ ‌కుమార్‌కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్‌ ‌బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న ఆమెను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో చందుర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిందితుడిపై చార్జిషీట్‌ ‌దాఖలు చేశారు. అనంతరం 2020 డిసెంబర్‌ 4‌న నిందితుడు బాలికను ఆమె ఇంటి నుంచి అపహరించి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసిన అనంతరం జరిగిన విషయాన్ని బయటపెడుతుందనే భయంతో బాలికకు విషం తాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను నిందితుడు కరీంనగర్‌ ‌హాస్పిట‌ల్‌కు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్‌ ‌పోలీసులు హత్య, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్‌ ‌దాఖలు చేశారు. ఈ రెండు కేసులు సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చాయి. ప్రాసిక్యూషన్‌ ‌తరఫున సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరాలు రుజువైనట్లు నిర్దారించింది. దీంతో పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7,000 జరిమానా, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి డీఎస్పీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్‌ ‌వెంకటేష్‌, ‌కోర్టు కానిస్టేబుళ్లు మహేందర్‌, ‌లతీఫ్‌, ‌నవీన్‌, ‌వెన్నెలను జిల్లా ఎస్పీ మహేష్‌ ‌బి.గితే అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *