రిజ‌ర్వాయ‌ర్ల‌ నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు చర్యలు

– శాస్త్రీయ పద్ధతిలో పూడికతీత‌కు ప్రణాళికలు రూపొందించాలి
– దేశంలోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయండి
– అనువైన పద్దతిని తెలంగాణకు అన్వయించాలి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: తక్షణ అవసరాలను తీర్చడమే కాక దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక తొలగింపు (డీసిల్టేషన్)నకు ఆచరణాత్మక, స్థిరమైన శాస్త్రీయ నమూనాను రూపొందించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో జలాశయాలు, నీటిపారుదల ప్రాజెక్టులలో పూడిక తొలగింపు కార్యక్రమాలపై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాల అసలు నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. జలాశయాల నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల నీటి భద్రత మెరుగుపడటంతోపాటు సాగునీటి విస్తీర్ణం పెరుగుతుందని, వరద ముప్పు కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పూడిక తొలగింపు నమూనాలను సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయగల ఉత్తమ విధానాలను గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతేగాక జలాశయాల్లో పూడిక నిర్వహణ, పూడిక తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ మార్గదర్శకాలు, విధానాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను ప్రస్తావిస్తూ పూడిక తొలగింపు వంటి నివారణ చర్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. గత ఏడాది పంజాబ్‌లో సంభవించిన తీవ్ర వరదల కారణంగా 22 జిల్లాల్లో 16 జిల్లాలు ముంపునకు గురయ్యాయని, నష్టపరిహారం, పునరుద్ధరణ చర్యల కోసం దాదాపు రూ.2,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సకాలంలో పూడిక తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థలు, జలాశయాల నిల్వ సామర్థ్యాల పునరుద్ధరణ వంటి చర్యలు చేపడితే ఆ వ్యయంలో గణనీయమైన భాగాన్ని నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా మంగళం ఆనకట్టలో 2017లో చేపట్టిన పూడిక తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతమైన నమూనాగా మంత్రి ప్రస్తావించారు. శాస్త్రీయ పద్ధతిలో చేపట్టిన ఆ కార్యక్రమం ద్వారా జలాశయంలో పేరుకుపోయిన పూడిక సమస్యను పరిష్కరించడమే కాక తీసిన మట్టిని వినియోగించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధించారని తెలిపారు. అలాంటి విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయగల మార్గాలను పరిశీలించాలని సూచించారు. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సమీక్షించారు. అలాగే లోయర్ మానేరు డ్యామ్ (ఎలఎండీ), మిడ్ మానేరు రిజర్వాయర్ (ఎంఎంఆర్)లలో జరుగుతున్న పూడిక తొలగింపు పనుల పురోగతిని కూడా పరిశీలించారు. పనుల వేగాన్ని పెంచేందుకు, కార్యాచరణలో అడ్డంకులను తొలగించేందుకు ఆచరణాత్మక పరిష్కారాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎసఆరఎస్‌పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల ప్రధాన ఇంజినీర్లు ఆయా ప్రాజెక్టుల్లో పూడిక పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి కోల్పోయిన నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు చేపట్టగల చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలాశయాల నిర్వహణలో శాస్త్రీయ, దీర్ఘకాలిక దృక్పథాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. వరద నియంత్రణ, నీటి సంరక్షణ, సాగునీటి స్థిరత్వం సాధనలో పూడిక తొలగింపును కీలక అంశంగా పరిగణిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. జలాశయాల్లో పూడిక తొలగింపు కార్యక్రమానికి ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) నేతృత్వం వహిస్తారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాU ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, గనుల శాఖ‌ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, నీటిపారుదల శాఖ‌ సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్‌సీ ఒ.రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *