సమస్య ఆర్టీసీ కార్మికులది కాదు, తెలంగాణ సమాజానిది!

“ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నది. అది 2019 సమ్మెలో కూడా ప్రధానమైన డిమాండే. సంస్థ ప్రభుత్వంలో భాగంగా మారితే, సంస్థను, ఉద్యోగులను పట్టి పల్లారుస్తున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి తప్పనిసరి తక్షణ బాధ్యతగా మారుతుందని, అలా సంస్థ భవిష్యత్తుకు హామీ దొరుకుతుందని, కార్మికులు ప్రభుత్వోద్యోగులుగా మారి, ఇతర ఉద్యోగులతో సమాన వేతనాలు పొందుతారని కార్మికులు ఆశిస్తున్నారు..”

ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణార్థం ఏప్రిల్ 30, 2026
ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన మూడో రోజునే ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించి, ప్రధాన డిమాండ్లన్నిటినీ ప్రభుత్వం అంగీకరించి, సమ్మె ముగింపుకు రావడం ప్రయాణికుల, ప్రజల రవాణా అవసరాల దృష్ట్యా ఆహ్వానించదగిన పరిణామం. సమ్మె యాబై రోజుల పాటు నడిచిన 2019 గత ప్రభుత్వ కాలంలో (2019) లాగ కాకుండా మూడో రోజునే సమ్మె ముగిసిపోయినందుకు ప్రభుత్వం కూడా సంతోషించవచ్చు. గత సమ్మెలో దాదాపు 50 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఈసారి ఒక్క ప్రాణనష్టంతోనే సమ్మె ఆగిపోయిందని ప్రచారసాధనాలు లెక్కలు వేయవచ్చు. కాని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగవలసి వచ్చిన సమస్యలు నిజంగా పరిష్కారం అయ్యాయా? మొత్తంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందున్న విశాలమైన, క్లిష్టమైన సవాళ్లకు సమాధానాలు దొరికాయా?

2019 సమ్మె సమయంలో మరొక దినపత్రికలో సాగుతుండిన ఇదే ‘తెలంగాణార్థం’ శీర్షికలో సమ్మె గురించి ఆ యాబై రోజుల్లో నాలుగు వ్యాసాలు రాశాను. ఇప్పుడు అవి మళ్లీ చదువుతుంటే 2019కీ, 2026కూ కార్మికుల ఆకాంక్షలలో గాని, ప్రభుత్వ వాగ్దానాలలో గాని, ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంలో గాని, సమాజపు నిర్లిప్తతలో గాని పెద్ద తేడా కనబడడం లేదు.

ప్రస్తుత సమ్మె 31 డిమాండ్ల సాధన కోసం మొదట యాజమాన్యంతో, ప్రభుత్వంతో సుదీర్ఘమైన చర్చలు జరిగి, ఆ చర్చలు విఫలం కావడం వల్ల గత బుధవారం నుంచి సమ్మె జరపాలని కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు ఇవ్వక తప్పలేదు. సాధారణంగా ఒక కార్మిక సంఘం సమ్మెకు పిలుపు ఇస్తే మరొక సంఘం సమ్మెను విచ్ఛిన్నం చేసి, పనుల్లో పాల్గొనే సంప్రదాయం ఉండగా, ప్రభుత్వాలకు కార్మికులను చీల్చే అలవాటు ఉండగా ఈసారి మాత్రం నలబై వేల మంది కార్మికుల అపూర్వమైన ఐక్యతతో బుధ, గురు వారాలు సమ్మె సంపూర్ణంగా జయప్రదమయింది. శుక్రవారం కార్మిక సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలతో కొంత వెసులుబాటు వచ్చి, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు కార్మిక సంఘ నాయకులు ఆమోదం తెలిపి సమ్మెను విరమించారు.

అయితే, మొత్తం డిమాండ్లలో మూడు ప్రధానమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించిందని వార్తలు వెలువడ్డాయి గాని, వాస్తవం కాస్త భిన్నంగా ఉంది. ఆ మూడు డిమాండ్లలో కూడా ప్రధానమైనదైన ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం’ గురించి మంత్రులతో, అధికారులతో ఒక కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ పరిశీలన తర్వాత జూన్ 2న ప్రకటన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు యూనియన్ కోసం ఎన్నికల నిర్వహణ అంగీకరించడానికి అభ్యంతరం లేదంటూనే, యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కార్మిక నాయకులకు సూచించింది. ఇక మూడో ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉండిపోయిన 2021, 2025 వేతన సవరణల మీద కార్మిక నాయకులు 30 శాతం ఫిట్ మెంట్ కోరగా, ప్రభుత్వం 5 శాతం ఇస్తామనే దగ్గర బేరం ప్రారంభించి 11 శాతం దగ్గర ముగించింది. అంటే, ఇప్పుడు పది వేల రూపాయల బేసిక్ జీతం తెచ్చుకునే ఉద్యోగికి 13,000 కు పెంచమని కార్మిక సంఘాలు అడగగా, 10,500 కు పెంచుతామని బేరం మొదలు పెట్టిన ప్రభుత్వం చివరికి 11,000 దగ్గర స్థిరపడింది. అంటే ప్రధానమైన మూడు డిమాండ్లు కూడా కార్మికులకు అనుకూలంగా పరిష్కారం అయ్యాయని చెప్పడానికి లేదు.

“ఇక ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ అనేది అక్షరాలా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక వాగ్దానమే. రెండున్నర సంవత్సరాల కింద ఎన్నికల ప్రణాళికలో రాసిన ఆ మాటను ఇన్నాళ్లూ మరిచిపోయి, నెరవేర్చకుండా ఉండిపోయి, ఇప్పుడు సమ్మె ఒత్తిడి వల్ల దాన్ని నామమాత్రంగా 11 శాతం ఫిట్ మెంట్ తో పరిష్కరిస్తున్నారు..”

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నది. అది 2019 సమ్మెలో కూడా ప్రధానమైన డిమాండే. సంస్థ ప్రభుత్వంలో భాగంగా మారితే, సంస్థను, ఉద్యోగులను పట్టి పల్లారుస్తున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి తప్పనిసరి తక్షణ బాధ్యతగా మారుతుందని, అలా సంస్థ భవిష్యత్తుకు హామీ దొరుకుతుందని, కార్మికులు ప్రభుత్వోద్యోగులుగా మారి, ఇతర ఉద్యోగులతో సమాన వేతనాలు పొందుతారని కార్మికులు ఆశిస్తున్నారు. సమానమైన సర్వీసు, తక్కువ పని, మెరుగైన పని పరిస్థితులు ఉన్న సమాన స్థాయి ప్రభుత్వోద్యోగులతో పోల్చి చూస్తే ఆర్టీసీ కార్మికుల జీతాలు చాలా తక్కువగా పది, పదిహేను వేల రూపాయలుగా ఉన్నాయి. సమానపనికి సమానవేతనం అనే సహజ న్యాయసూత్రానికి ఇది తీవ్రమైన ఉల్లంఘన. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నిర్ణయాధికారం పూర్తిగా ప్రభుత్వం చేజిక్కుతుంది గనుక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందనీ, తద్వారా సంస్థ పరిరక్షణ సాధ్యమవుతుందనీ కార్మికులు భావిస్తున్నారు.

నిజానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలోనే ఈ డిమాండ్ ముందుకు వచ్చింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆ పని చేస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని 2019 దాకా నెరవేర్చలేదు గనుక అప్పటి సమ్మెలో కూడా అది ప్రధాన డిమాండ్ అయింది. తర్వాతి నాలుగు సంవత్సరాల అధికారంలో వారు ఆ వాగ్దానం నెరవేర్చలేదు. ఇక కాంగ్రెస్ 2018 ఎన్నికల ప్రణాళికలో, 2023 ఎన్నికల ప్రణాళికలో విలీన వాగ్దానం చేసినప్పటికీ, అధికారానికి వచ్చాక ఏదో ఒక వంక చెప్పి తాత్సారం చేస్తూ వస్తున్నది. ఒక కమిటీ వేసి, ఆ కమిటీ నివేదిక ఇంకా రాలేదని సాకు చెపుతున్నది. ఇప్పుడు మరొక కమిటీ వేసి, ఆ కమిటీ పరిశీలన తర్వాత జూన్ 2న ప్రకటిస్తామని అంటున్నది. జూన్ 2 అని వాయిదా పెట్టేట్టయితే మరొక కమిటీ అవసరం లేదు. మరొక కమిటీ పరిశీలన అనేట్టయితే జూన్ 2 ప్రకటన అనే మాటకు అర్థం లేదు. అంటే ప్రస్తుతం సమ్మెలో ఉన్న కార్మికులను మరొకసారి మోసం చేసే ప్రయత్నమే జరిగినట్టు కనబడుతున్నది.

కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు యూనియన్ కోసం ఎన్నికలు డిమాండ్ కూడా అటువంటిదే. విలీనం తర్వాత, ఆర్టీసీ ఒక ప్రభుత్వ శాఖగా మారుతుంది గనుక కార్మిక యూనియన్లకు అవకాశం ఉండదని అంటున్నారు. అప్పుడు దాన్ని ఉద్యోగుల సంఘాలు అనాలని అంటున్నారు. ఉద్యోగుల సంఘాలలో కూడా గుర్తింపు సంఘం ఎన్నికలకు అవకాశం ఉంటుందా అనే చట్టపరమైన చర్చ ఉంది. ఆ చర్చ అలా ఉండగానే యాజమాన్యంతో చర్చించాక తుది నిర్ణయం అని అసందిగ్ధ స్థితిని మిగిల్చారు. ఇక ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ అనేది అక్షరాలా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక వాగ్దానమే. రెండున్నర సంవత్సరాల కింద ఎన్నికల ప్రణాళికలో రాసిన ఆ మాటను ఇన్నాళ్లూ మరిచిపోయి, నెరవేర్చకుండా ఉండిపోయి, ఇప్పుడు సమ్మె ఒత్తిడి వల్ల దాన్ని నామమాత్రంగా 11 శాతం ఫిట్ మెంట్ తో పరిష్కరిస్తున్నారు.

ఇవి కాకుండా మిగిలిన డిమాండ్లలో కూడా ఎన్ని పరిష్కారం కాకుండానే ఉండిపోతాయో, మళ్లీ ఆర్టీసీ కార్మికుల అసంతృప్తి ఎప్పుడు రగులుతుందో తెలియదు. ఉదాహరణకు “కొత్త బస్సులను సంస్థ ద్వారా కొని ఆర్టీసీని అభివృద్ధి పరిచి, ఆధునీకరించాలి” అనేది ఒక డిమాండ్. ఈ డిమాండ్ ను అంగీకరించాలంటే ప్రభుత్వ అభివృద్ధి నమూనానే, ఆలోచనా విధానమే మారాలి. ప్రస్తుతం ఆర్టీసీ నడుపుతున్న 9,300 బస్సులలో 6,300 మాత్రమే సంస్థ సొంతం. మిగిలిన బస్సులు ప్రైవేటు యజమానులవి, ఏలినవారి ఆశ్రితులవి. వాటిని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడుపుతున్నది. మరొకవైపు ఆర్టీసీ సొంత బస్సులలో సగానికి కన్నా ఎక్కువ వయసు ఉడిగినవి. వాటిలో అత్యధికభాగం రహదారుల మీద నడపడానికి అర్హమైనవి కాదు. డ్రైవర్లు ఇబ్బంది పడుతూ నడుపుతున్నవి, ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నవి. కేవలం హైదరాబాద్ లో తిరుగుతున్న బస్సులనే చూస్తే, మొత్తం 2664 బస్సులలో, దాదాపు సగం, 1195 బస్సుల వయసు పన్నెండు సంవత్సరాల కన్నా ఎక్కువ. ఇటీవలి కాలంలో సంస్థ సొంతంగా బస్సులు కొనడం బాగా తగ్గించి, ప్రైవేటు యాజమానుల నుంచి అద్దెకు తీసుకునే బస్సుల శాతాన్ని క్రమక్రమగా పెంచుతున్నది. అటువంటప్పుడు కార్మిక సంఘాలు చేస్తున్న ఈ డిమాండ్ ను అంగీకరిస్తారా తెలియదు.

“2019 సమ్మె కాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తివేయాలి అనేది మరొక డిమాండ్. అంటే తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడినందుకు ఏడు సంవత్సరాలుగా అనేక మంది కార్మికుల తలల మీద కేసుల కత్తులు వేలాడుతూనే ఉన్నాయన్నమాట! మొన్న సమ్మె సందర్భంలో కూడా, లాఠీ ఛార్జీలు, కార్మికుల వంటా వార్పూ పాత్రలు ఎత్తుకుపోవడం, మండుటెండలో నిరసన ప్రదర్శనకు టెంట్ ఇవ్వగూడదని టెంట్ హౌజులకు ఆంక్షలు జారీ చేయడం వగైరా పోలీసుల దౌర్జన్యం యథావిధిగా కొనసాగింది..”

విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి అని మరొక డిమాండ్. ఇవాళ రాష్ట్రంలో ఆర్టీసీ నడుపుతున్న బస్సులలో దాదాపు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీకి చెందినవి. రెండు వేల డీజిల్ బస్సుల యజమానులు ఎందరో ఉన్నారు. నిజానికి ఆర్టీసీ సంస్థ కొన్ని సంవత్సరాలుగా సొంత బస్సులు కొనకుండా, ఇలా ప్రైవేటు సంస్థలు కొన్న బస్సులను అద్దెకు తిప్పుతూ, వాటిని నిర్వహిస్తూ, ఆ యజమానులకు అప్పనంగా అంతులేని ప్రజాధనాన్ని ధారపోస్తున్నది.

అలాగే సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేయాలని, రాయితీల రియింబర్స్ మెంట్ ఎప్పటికప్పుడు చెల్లిస్తూ, సంస్థ అభివృద్ధికి సాలీనా బడ్జెట్ లో 3 శాతం కేటాయించాలని మరొక డిమాండ్ ఉంది. సంస్థకు ప్రస్తుతం రుణభారం రు. 6300 కోట్లు అంటున్నారు. వివిధ వర్గాలకు రవాణా సౌకర్యాలలో పభుత్వం కల్పించిన రాయితీలకు గాను చెల్లించవలసిన రియింబర్స్ మెంట్, సిబ్బందికి చెల్లించవలసిన అనేక బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లిస్తే ఈ రుణభారం తొలగిపోతుంది. కాని ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. అలాగే బడ్జెట్ లో 3 శాతం అంటే దాదాపు పదివేల కోట్ల రూపాయల కేటాయింపు. తాజా బడ్జెట్ లో ప్రభుత్వం ఆర్టీసీకి ప్రత్యేకంగా కేటాయించిన నిధులు లేవు. మొత్తంగా రవాణా రంగానికి లేదా మౌలిక సాధన సంపత్తి రంగానికి కేటాయించిన నిధులలో ఆర్టీసీకి ఎంత వస్తాయో తెలియదు. మహాలక్ష్మి పథకం కింద, ఇతర వర్గాల రాయితీల కింద ఆర్టీసీకి ఇవ్వవలసిన నిధులను కూడా సమయానికి చెల్లించడం లేదు.

2019 సమ్మె కాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తివేయాలి అనేది మరొక డిమాండ్. అంటే తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడినందుకు ఏడు సంవత్సరాలుగా అనేక మంది కార్మికుల తలల మీద కేసుల కత్తులు వేలాడుతూనే ఉన్నాయన్నమాట! మొన్న సమ్మె సందర్భంలో కూడా, లాఠీ ఛార్జీలు, కార్మికుల వంటా వార్పూ పాత్రలు ఎత్తుకుపోవడం, మండుటెండలో నిరసన ప్రదర్శనకు టెంట్ ఇవ్వగూడదని టెంట్ హౌజులకు ఆంక్షలు జారీ చేయడం వగైరా పోలీసుల దౌర్జన్యం యథావిధిగా కొనసాగింది.

మొత్తం మీద ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు చూస్తే కొన్ని పనికి తగిన ప్రతిఫలం డిమాండ్లు, కొన్ని పని స్థలంలో మెరుగైన సౌకర్యాల డిమాండ్లు, కొన్ని ప్రభుత్వ బాధ్యతను చెప్పే డిమాండ్లు, కొన్ని పౌర రవాణా సక్రమంగా సాగడానికి అవసరమైన, అంటే ప్రజా జీవితానికి సంబంధించిన డిమాండ్లు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన రవాణా వ్యవస్థలో, ప్రజా రవాణా రంగంలో ఉన్న అవకతవకలను చూపే డిమాండ్లు. ఆ అవకతవకలను సరి చెయ్యమని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. కాని ఆర్టీసీ కేవలం ఉద్యోగులదీ కార్మికులదీ మాత్రమే కాదు. అది ప్రతి రోజూ ఆర్టీసీ సేవలను వాడుకుంటున్న 60-65 లక్షల మంది ప్రజలది. మొత్తంగా తెలంగాణ సమాజానిది. తన సంపద అయిన ఆర్టీసీ నిర్వహణ ఎలా జరుగుతున్నదో పరిశీలించే, పర్యవేక్షించే బాధ్యత మొత్తంగా తెలంగాణ సమాజానిది. ఆ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత తెలంగాణ సమాజానిది.

ఎన్ వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *