15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

– సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
– 3.42 కోట్ల మంది ఉచితంగా సన్న బియ్యం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,ఆగస్టు 7 : రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడు సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ప్రతి అర్హుడికి ప్రతి నెల 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రతి నెలా సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ప్రారంభించడంతోపాటు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ అదే రోజు ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రతి అర్హులైన‌ కుటుంబానికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన ఆహార భద్రతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో అత్యంత సమర్థవంతమైన ఆహార భద్రతా కార్యక్రమాల్లో ఒకటైన ఈ మహత్తర కార్యక్రమంలో చిన్న పాత్ర పోషించడం ఆనందదాయకంగా ఉందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ స్మార్ట్ రేషన్ కార్డులను పొందేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *