– చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తికావాలి
– మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలి
– సంక్రాంతికి వాహనాల రాకపోకలు సాగాలి
– సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పైౖ చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తిచేయాలని, మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ ఫ్లైఓవర్ల నుండి ఈ సంక్రాంతికి వాహనాల రాకపోకలు సాగాలని అధికారులకు తేల్చి చెప్పారు. నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే వేలమంది తమ ప్రాణాలను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పలు రోడ్లు, ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతోపాటు ఇటీవల జరిగిన పలు ప్రమాదాలపై మంత్రి ఆరా తీశారు. హైదరాబాద్-విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్‌పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్ట్ లైట్స్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై ఇప్పటికే ట్రాఫిక్ అనుమతిస్తుండగా సూర్యాపేట ఫ్లైఓవర్ ట్రాఫిక్ అనుమతికి సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై, కొన్నిచోట్ల రహదారికి రెయిలింగ్ లేని వార్తలపై ఆరా తీసిన మంత్రి ఎన్‌హెచ్ఏఐ అధికారులకు పలు సూచనలు చేశారు. మూగ జీవాలు రహదారిపైకి రాకుండా రెయిలింగ్‌తోపాటు రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యం ప్రమాదాలను నివారించాలంటే ఈ రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలన్నారు. రహదారి విస్తరణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరోసారి నితిన్ గడ్కరీని కలుస్తాం.. అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం అన్నారు. ఎన్‌హెచ్ 65 విస్తరణ పనులతోపాటు బుల్లెట్ ట్రైన్స్, ఇతర ఎన్‌హెచఏఐ ప్రాజెక్ట్స్ త్వరగా చేపట్టాలని కోరతామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సమీక్షలో ఆర్ అండ్ బి ఈఎన్‌సీ లింగారెడ్డి, సీఈలు వసంత్ నాయక్, ధర్మారెడ్డి, పలువురు ఎన్‌హెచ్ఏఐ అధికారులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




