- మెరుపు తీగెలు
“ఇదేంటి మీ వూళ్ళో వొక్క గుడీ లేదు?”
“మమ్మల్ని గుడిలోకి రానివ్వలేదు, అందుకని మా వూళ్ళోకి గుడిని రానివ్వలేదు!”
“మరి మీకు దేవుడు వుండొద్దా?”
“మీకొక దేవుడూ మాకొక దేవుడూ వుండొద్దు!”
“హు… దేవుడు లేని అనాథలైపోరూ?”
“భక్తులు లేని దేవుడు కూడా అనాథే!”
“సరే, మీకు కష్టమొస్తే నష్టమొస్తే యెవరికి చెప్పుకుంటారు?”
“తోటి మనిషికి చెప్పుకుంటాం!”
“అదేంటి?, దేవుడికి చెప్పుకోరా?”
“ఏం?, తోటి మనిషిలో దేవుడు వుండడా?”
“వుంటాడు, ఆ తోటి మనిషికీ కష్టం వస్తుంది కదా?”
“అప్పుడు నాకు చెప్పుకుంటాడు!”
“అయితే, వొకరికొకరు చెప్పుకుంటారు… బావుంది!”
“నీలో వున్న దేవుడు నాలోనూ వుంటాడు కదా?”
“ఔను, అందరిలోనూ దేవుడు వుంటాడు!”
“మొత్తానికి మీరు దేవుడ్ని దర్శించలేదు?”
“అని యెవరన్నారు? విత్తు మట్టిలో పడి మహావృక్షం లేచినప్పుడు ఆ శక్తిని దర్శించాను!”
“ఇంకా?”
“పువ్వులు పింజెలు కాయలు పండ్లు రకరకాల రంగులూ రుచులూ యెన్నని దర్శించాను?!”
“నీకు ప్రయోజనం యిచ్చేదే దైవమా?”
“ప్రయోజనం లేకపోతే మీరే కాదు యెవరయినా దేవుణ్ణి పూజిస్తారా?”
“మనిషికి కోరికలు లేకపోతే దేవుడికి వునికి వుండదు!”
“ఇంతకీ మీ దేవుడ్ని నాకోసారి చూపిస్తావా?”
“మీరు మీ దేవుణ్ణి చూపించలేరేమో గాని, మేం మా దేవుణ్ణి చూపిస్తాం!”
“ఏది? ఎక్కడ?”
“చెట్టులో పుట్టలో. తినే తిండిలో. కట్టే బట్టలో. చేసే పనిలో. సాయంలో. పిల్లల్లో. పెద్దల్లో. ప్రతి మనిషిలో. అణువు అణువులో…”
ప్రశ్నలు వేసిన మనిషి మరొక్క మాట మాటాడకుండా నిశ్శబ్దంగా దండం పెట్టాడు!
జవాబులు చెప్పి పనిలోకి వెళ్ళిపోతున్న మనిషికి తనని అంతవరకూ అడిగింది ఆ దేవుడేనని తెలీదు?!





