పదేళ్లలో 152 పేపర్‌ ‌లీక్‌ ‌కేసులు

– ఒక్క దాంట్లోనూ దోషులను తేల్చలేదు
– ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందే
– ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే
– మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌డిమాండ్‌

‌న్యూదిల్లీ, జూలై 22:  గత ప‌దేళ్ల‌లో 152 పేపర్‌ ‌లీక్‌ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదని అన్నారు. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ఉదంతంపై ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా  బుధవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ మొత్తం రిగ్గింగ్‌ ‌బారిన పడిందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌పనితీరు అసమర్థంగా, అవినీతిమయంగా ఉందని ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన రాజీనామాకు విద్యార్థులు పట్టుబడుతున్నారని, ఇది సరైన డిమాండేనని వ్యాఖ్యానించారు. ఈ దుస్థితికి ప్రతిబింబంగా మారిన ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. గత పదేళ్లల్లో సుమారు 152 పేపర్‌ ‌లీక్‌ ఉదంతాలు వెలుగు చూశాయి. అంటే సగటున వారానికి ఒక పేపర్‌ ‌లీక్‌ ‌జరిగింది.. కోట్లమంది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడింది.. కానీ ఒక్క కేసులో కూడా దోషులెవరో తేలలేదు.. ఇలా ఎందుకు జరిగిందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. ఒకప్పుడు దేశానికి సంపదగా ఉన్న విద్యారంగం ఎన్డీయే పాలనలో ధ్వంసమైందని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య భారంగా మారిందని చెప్పారు. కోచింగ్‌పై నీట్‌ అభ్యర్థుల వార్షిక ఖర్చు రూ.1.32 లక్షల కోట్లని అన్నారు. ఇది విద్యారంగం వార్షిక బ్జడెట్‌ ‌రూ.1.42 లక్షల కోట్లకు దాదాపు సమానమని వ్యాఖ్యానించారు. సంపన్నుల కోసమే ఉద్దేశించిన ఈ వ్యవస్థలో పేదలకు స్థానం లేదని అన్నారు. సోమవారం నిరసనల సందర్భంగా విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సిందేనని రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థుల విషయంలో ఏం జరుగుతోంది. పారదర్శకమైన విద్యా వ్యవస్థ కావాలని యువత కోరుతోంది. కానీ, ఈ ప్రభుత్వం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై లాఠీఛార్జ్ ‌చేయించింది. మధ్యతరగతి కుటుంబాలకు చదువు ఆర్థిక భారంగా మారింది. విద్యపై రూ.1.4లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు కేంద్రం చెబుతోంది. కానీ, గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల పత్రాలు లీక్‌ అయ్యాయి. దీని వల్ల 7.50కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులు ఎంత బాధపడుతున్నా.. ఈ ప్రభుత్వం లెక్కచేయట్లేదు. ఈ పేపర్‌ ‌లీకేజీ ఘటనల్లో ఇప్పటివరకు శిక్షపడిన నేరస్థుల సంఖ్య సున్నా అని రాహుల్‌ ‌విమర్శించారు. దేశ యువతకు ఉద్యోగాలు లేవు. విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. మన దేశంలో చైనా వస్తువుల సంఖ్య పెరిగింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. బ్యాంకులను బడా వ్యాపారులు లూటీ చేస్తున్నారు. ఏఐ వల్ల కార్పొరేట్‌ ‌రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. కేంద్రం విధానాల వల్ల పేదలు, విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులంటే మనకు శత్రువులు కాదు. ఈ దేశ భవిష్యత్తు అన్న విషయం కేంద్రం గుర్తుంచుకోవాలని  మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద ప్రధాన్‌ ‌పూర్తిగా విఫలమయ్యారు. లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని యువత డిమాండ్‌ ‌చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని యువత కోరుకుంటోంది. ఆందోళన చేస్తోన్న యువతపై దాడి చేసిన వారికి శిక్ష పడాలని కోరుతోంది. ఇక, ఈ వైఫల్యాలకు గానూ ప్రధాని క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారు. విద్యార్థుల డిమాండ్లకు మేం పూర్తి మద్దతు ప్రకటించాం అని రాహుల్‌ ‌వెల్లడించారు. విద్యార్థుల ఆందోళనను మేం రాజకీయాలకు వాడుకోవట్లేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం నా బాధ్యత. దీనిపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు కేంద్రం అవకాశం ఇవ్వట్లేదు. అందుకే విద్యార్థులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చాం. నిన్న నిరసనల్లో నా పట్ల జరిగిన దానికి బాధపడటం లేదు. విద్యార్థులకు జరుగుతోన్న నష్టం విషయంలోనే బాధగా ఉంది. పరీక్షల విధానంలో మార్పులు రావాలి. ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తినేందుకైనా నేను సిద్ధం అని కాంగ్రెస్‌ ఎం‌పీ తెలిపారు

సోనమ్‌ ‌జీ.. దీక్ష విరమించండి : అభిజీత్‌ ‌దీప్కే విజ్ఞప్తి

సామాజిక కార్యకర్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ అధినేత అభిజీత్‌ ‌దీప్కే విజ్ఞప్తి చేశారు. దేశానికి వాంగ్‌చుక్‌ అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం దీప్కే తన ‘ఎక్స్’ ‌ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ’సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని కోరుతున్నాము. దేశానికి ఆయన అవసరం ఉంది. ఆయన ప్రాణం చాలా విలువైనది. దాన్ని మరింత ప్రమాదంలో పడేయకూడదు. డిమాండ్లు నెరవేరే వరకు జంతర్‌మంతర్‌ ‌వద్ద శాంతియుత నిరసనలు కొనసాగుతాయి’ అని తెలిపారు. సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ఆరోగ్యం క్షీణించటంతో హైకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసులు కొద్ది రోజుల క్రితం జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నుంచి ఆయననను బలవంతంగా హాస్పిట‌ల్‌కు తరలించారు. మొదట సప్దర్‌జంగ్‌ ‌హాస్పిటల్‌కి తీసుకెళ్లి తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిట‌ల్‌కు మార్చారు. ఐసీయూలో ఉంటూనే డాక్టర్ల బలవంతపు ఫీడింగ్‌ను నిరాకరిస్తూ ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *