– బీఆర్ఎస్ పాలనలో ప్రజల గోడు వినేవారే లేరు
– ప్రతివారం గాంధీ భవన్‌లో ప్రజలతో మంత్రుల ‘ముఖాముఖి’
– క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి
– ప్రధాని మోదీ, విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలి
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పాలకులకు ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఉండేదికాదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రుల కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదని అన్నారు. గాంధీ భవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో బుధవారం పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసూచనల మేరకు ప్రతి వారం క్యాబినెట్‌లో ఒక మంత్రి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తు వీలైనంతవరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు నిర్వహించిన ముఖాముఖిలో చాలా వరకు ఇండ్ల గురించి దరఖాస్తులు వచ్చాయన్నారు. పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ ప్రభుత్వంలోనే తమ సొంతింటి కల నెరవేతుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. వారి ఆశలకు అనుగుణంగా తమ ప్రభుత్వం మొదటి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షలు మొత్తం 7 లక్షల ఇండ్లను మంజూరు చేసిందన్నారు. గడచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం పేదలకు అరకొరగా నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు నిర్మించిందని ఫలితంగా తమ జీవనోపాధి దెబ్బతింటుందన్న ఆందోళనతో పేదలు ఆ ఇళ్లల్లో అడుగుకూడా పెట్టలేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పేదవాడు పుట్టి పెరిగిన చోటే నివాసం కల్పించాలన్న ఆలోచనతో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నిర్మించబోయే ఇండ్ల విలువ 40 నుంచి కోటి రూపాయిల వరకు ఉంటుందని ఇంటి స్దలంలో వాటా కూడా కల్పిస్తున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈ ఇండ్ల కోసం మీ సేవ, వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూములకు సంబంధించిన వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించగలగిన అన్నింటికీ పరిష్కారం చూపిస్తామన్నారు. దేశంలో యువతను దెబ్బతీసిన ‘నీట్లీ’ కేజీపై శాంతియుతంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న యువతపైన, మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జన్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై లాఠీఛార్జి చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక పార్లమెంటును పలుమార్లు వాయిదా వేయడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని ఎత్తిచూపుతుందన్నారు. తక్షణమే ప్రధాని మోదీ, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




