– లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం
– గాంధీభవన్ ముట్టడికి బిజెపి నేతల దూకుడు
– ఇరువర్గాల పరస్పరం దాడులతో ఉద్రిక్తత
– రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
– నగరంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతల అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై22: కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలతో బుధవారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లోక్‌భవన్ ముట్టడికి పిలుపునివ్వగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసనను ఖండిస్తూ బీజేపీ నాయకులు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాలు ముట్టడికి బలయుదేరడంతో పాటు పరస్పర దాడులకు దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న నిరసనలతో నాంపల్లి బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. కాంగ్రెస్ నేతలు రాకుండా బీజేపీ నేతలు కర్రలతో అడ్డుకున్నారు. మరోపక్క.. రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు నాంపల్లి పీఎస్‌కు తరలించారు. కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి నాంపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో కూడా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్ సపంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్ భవన్ ముట్టడికి యత్నించిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ నాయకులను అక్కడే అడ్డుకున్నారు. అలాగే లోక్‌భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఖైరతాబాద్ సర్కిల్ వద్ద నిలువరించారు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కర్రలతో దాడులు జరిగాయని, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు వాహనాలపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ముందస్తు చర్యల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తొలుత కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్‌భవన్‌కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లగా వారిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చేతుల్లో కర్రలతో సంజయ్ ఇంటికి బీజేపీ నేతలు కాపలాగా నిలవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడులకు తెగబడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కరీంనగర్ వీధులు రణరంగాన్ని తలపించాయి. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు లాఠీలకు పనిచెప్పారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఉండగా కాంగ్రెస్ దాడికి నిరసనగా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. అయితే వారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు ప్రధాన పార్టీల సవాల్-ప్రతిసవాల్‌తో కరీంనగర్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




