పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో సుమారు కోటికి పైగా ఉన్న రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. రైతుల మీద, వ్యవసాయ రంగంపైన వల్లమాలిన అభిమానాన్ని కనబరుస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. గత శాసన సభ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ పేర, ఆ తర్వాత తుక్కుగూడలో ఇచ్చిన హామీలను ఆమలుపర్చడంలో విఫలమైందని ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అధికారంలోకి వొచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలన్నిటిని గ్యారంటీగానే అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలుపుకోలేదని ఆ పార్టీలు తూర్పార పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో వర్షభీబత్సానికి వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదంటూ ఆ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ రైతు దీక్షలు చేపడితే, బిఆర్‌ఎస్ నాయకత్వం పొలం బాట పట్టింది. అప్పటికే మండలాలవారీగా దీక్షలు కొనసాగించిన బిజెపి నాయకులు కరువు, రుణమాఫీ, పంటకు అదనంగా ఇస్తానన్న బోనస్ తదితర అంశాలను వెంటనే అమలు చేయాలంటూ అధికారులకు విజ్ఞానపత్రాలనివ్వడం ద్వారా తమ నిరసన తెలిపారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో పంటలు కోతకురావడం, మరో పదిపదిహేను రోజుల్లో చేతికి రానున్న పంటలకు చివరి తడి అందకపోవడంతో చూస్తుండగానే ఎండిపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమంటూ విపక్షాలు అధికార పార్టీని కార్నర్ చేస్తున్నాయి. రాసిపెట్టుకోండి మా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే డిసెంబర్ 9ననే రైతులకు రుణమాఫీ అమలు జరుగుతుంది, రైతులు వెంటనే నూతన అప్పులు తీసుకోవచ్చని బాహటంగా ప్రకటించిన నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి అధికారం చేపట్టి నాలుగు నెలలు దాటుతున్నా మాట నిలుపుకోలేదంటూ రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఘాటుగానే విమర్శిస్తున్నాయి. రైతులకు అండగా నిలువాల్సిన కాంగ్రెస్ ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నదంటూ కరీంనగర్ సిట్టింగ్ ఎంపి, భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొపేందుకే తాము రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు చేపట్టామని చెబుతున్నారు. ఆయన స్వయంగా కరీంనగర్‌లోని పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో దీక్ష చేశారు కూడా. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదేబాటలో నడవడం విచారకరమంటూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల నష్టపరిహారంతో పాటు, గతంలో ఇచ్చిన హామీమేరకు వెంటనే రెండు లక్షల రుణమాఫీపై ఉత్తర్వులు జారీచేయాలంటూ సంజయ్ డిమాండ్ చేస్తున్నాడు.
ఇప్పటికే పొలం బాట పట్టిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఇప్పటికే పలు జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి, పంట నష్టపోయిన రైతులతో పాటు, ఇతర రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను స్వయంగా తెలుకుంటూ వారిని ఓదార్చే కార్యక్రమం చేపట్టారు. కాగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ నెల చివరి వారంలో చేపట్టనున్న బస్సు యాత్రలో భాగంగా ఆయన పొలం బాట కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కేవలం పంటలు నష్టపోయిన పొలాల సందర్శనే కాకుండా చేతికి వొచ్చిన పంటను కళ్ళాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసి, తూకాల కోసం ఎదురుచూస్తున్న వారు ఎదుర్కుంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడం ద్వారా రైతాంగానికి..తద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలను ఏనాడు పట్టించుకోలేదన్న విమర్శ కెసిఆర్‌పై లేకపోలేదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపైన ఆయన విరుచుకుపడుతున్నారు. గత వర్షాకాలం సాధారణం కన్నా 14 శాతం అధిక వర్షాలు పడినప్పటికీ, గత ప్రభుత్వ కాలంలోనే వర్షాభావం ఏర్పడిరదని ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని ఆయన కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ప్రజలకు సాగు, తాగునీరు లోటు లేకుండా అందించే నేర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటూ విమర్శిస్తుండగా, కెసిఆర్ పొలం బాట పట్టగానే వివిధ ప్రాజెక్టుల్లో నీరు విడుదల చేసిన విషయాన్ని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఎత్తిచూపుతున్నారు.
బిఆర్‌ఎస్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ విధానాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా పార్లమెంటు ఎన్నికల అనంతరం సుమారు పదివేల మంది రైతులతో మేడిగడ్డను ముట్టడిస్తామంటూ కెసిఆర్ హెచ్చరించడంపై ఇప్పుడు కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతున్నది. ప్రజలకు తామిచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉన్నామని, ఈలోగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వల్ల కాస్త ఆలస్యం అయిన మాట వాస్తవమేనని పార్లమెంటు అభ్యర్థుల ప్రచార సభల్లో పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతాంగానికి వివరణ ఇస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఆగస్టు 15లోపే మిగతా హామీలను అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయడమవుతుందని, వొచ్చే సీజన్‌లో ధాన్యం క్వింటాలుకు తామిస్తామన్న 500 రూపాయల బోనస్ కూడ చెల్లిస్తామమంటూ ఆయన రైతాంగానికి భరోసా కల్పిస్తున్నారు. అలాగే వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పినట్లు ఏడాదికి ఎకరానికి 15 వేల పెట్టుబడిని, వ్యవసాయ కూలీలకిస్తామన్న 12వేల రూపాయలు లాంటి పలు రైతాంగ పథకాలను ఎన్నికల అనంతరం ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని రేవంత్ హామీ ఇస్తున్నారు. మొత్తం మీద్న రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారమంతా రైతులు, వ్యవసాయం కేంద్రంగానే కొనాసాగిస్తుండడం గమనార్హం.
-మండువ రవీందర్‌రావు, సీనియర్ జర్నలిస్ట్





