ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు!
20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్
25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్
లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం
రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో అతిశయోక్తిలేదు. నిన్నటి వరకు నెంబర్ ఒన్‌గా ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ టూగా మారింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల వేళ అది మూడవ స్థానానికి చేరుకుంటుందన్న చర్చ జరుగుతున్నది. కాగా, పార్లమెంటు ఎన్నికలను గీటురాయిగా పెట్టుకుని, ఈ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ కనుమరుగవుతుందని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, పడిలేచే కెరటంలా విజృంభిస్తామని బిఆర్‌ఎస్ అంటుంది. కాని తెల్లారేవరకు ఎవరు ఏ పార్టీలో ఎప్పటి వరకుంటారన్నది ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రజా నాయకులుగా చలామణి అవుతున్నవారిలో చాలామంది ఇప్పటికే ఒకటి రెండుకు మించి పార్టీలను మార్చినవారే. కొందరు పదవుల కోసం పార్టీ మారితే, మరికొందరు ఉనికి కోసం పార్టీ కండువాలను మార్చుకుం టున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి ఒకటి రోజుకో సంచలనా త్మక ప్రకటనలను చేస్తుండడంతో రాజకీయ వర్గాలనే కాకుండా ప్రజలను కూడా అయోమయంలో పడేస్తున్నాయి.
రాష్ట్రంలో పదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడదోసి కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుండీ ఆ పార్టీ మరెంతో కాలం మనుగడ సాగించలేదన్న వార్తలు వినవస్తున్నాయి. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్, బిజెపిలు తరచు ఇదే విషయాన్ని లేవనెత్తడంతో కాంగ్రెస్ వర్గాలు ఆలోచనలో పడుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితిలో ప్రతిపక్షాలన్నీ ఏకమైన కాంగ్రెస్‌ను గద్దె దింపే సంఖ్యలేదు. అయినప్పటికీ అదిగో బూచి అన్నట్లు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను భయపెడుతున్నాయి. తాజగా బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన పెద్ద సంచలనంగా మారింది. మాటల మాంత్రికుడు, మాయల మరాఠీగా పేరున్న కెసిఆర్ అన్యాపదేశంగా ఇలాంటి ప్రకటన చేయరని, దీని వెనుక తప్పకుండా ఏదో తంత్రం ఉందన్న వాదనలు కూడా వినవస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదని ఆయన బాహాటంగా చేసిన ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల క్రితం సుల్తానాబాద్‌లో బిఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఈ సంచలనాత్మక ప్రకటన చేశారు. గతంలో బిఆర్‌ఎస్ 104 ఎంఎల్యేలను కలిగి, మిత్రపార్టీ ఎంఐఎం ఏడు స్థానాలు కలిపి 111 ఎంఎల్‌ఏల బలం ఉన్నప్పటికీ బిజెపి, తమ ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నించిందని, అలాంటప్పుడు 64 ఎంఎల్‌ఏలున్న కాంగ్రెస్‌ను బిజెపి బతకనిస్తుందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు.
అంతేగాక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులున్నాయని, ఆ పార్టీలోకి కొత్తగా వెళ్ళినవారంతా ఇప్పుడు తల పట్టుకుంటున్నారని, వారంతా త్వరలోనే తిరిగి వొచ్చే ఆలోచనలో ఉన్నారన్నది ఆయన మాటల సారాంశం. ఆ పరిస్థితుల దృష్ట్యా దాదాపుగా ఏడాదిలోపే ఆసెంబ్లీ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు కెసిఆర్. అంతే కాకుండా ఎవరు ఎప్పుడు బిజెపిలో చేరుతారోఅని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారకరామారావు పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ గ్యారంటీగా బిజెపిలోకి వెళ్తాడని తమ పార్టీ ఎన్నికల సభల్లో ఏకరువు పెడుతున్నారు. రేవంత్‌రెడ్డి తనతోపాటు కొందరు ఎంపీ అభ్యర్థులను వెంటబెట్టుకుని బిజెపిలో చేరుతారన్న విషయాన్ని అటు కేసిఆర్ పరోక్షంగా చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మళ్ళీ బిఆర్‌ఎస్సే అధికారంలోకి వొచ్చే అవకావాలున్నాయంటూనే, కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్ళు ఉండాలనే తాను కోరుకుంటున్నానంటున్న కెసిఆర్ అప్పుడే ప్రజలకు ఎవరి పాలనాతీరు ఎలా ఉందన్నది స్పష్టమవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు.
దీనికి కాంగ్రెస్ కూడా ధీటైన సమాధానం చెబుతున్నది. ఇప్పటి వరకు బిఆర్‌ఎస్ నుంచి తమ పార్టీలో చేరినవారు కాకుండా ఇంకా 25 మంది ఎంఎల్‌ఏలు తమ టచ్‌లో ఉన్నారంటుంది కాంగ్రెస్. బిఆర్‌ఎస్ నిజంగానే తమ పార్టీ ఎంఎల్‌ఏలను టచ్‌చేస్తే తాను హై ఓల్ట్ కరెంటులా వారిని కాపాడుకుంటానని, అయినా టచ్‌చేస్తే షాక్‌తో మసైపోతారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. కాగా తమ ఎంఎల్‌ఏలను టచ్ చేస్తే బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ పునాదులు కదులుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ సీటు కూడా బిఆర్‌ఎస్‌కు రాదని, ఈ ఎన్నికలతో బిఆర్‌ఎస్ తెరమరుగు ఖాయమంటున్న రేవంత్‌రెడ్డి, ఎగిసిపడుతున్న బిజెపి కూడా ఒక్క స్థానాన్ని గెలువదని, ఈ రెండు పార్టీలు తోడుదొంగ పార్టీలుగా ఆయన అభివర్ణించారు.
-మండువ రవీందర్‌రావు
సీనియర్ జర్నలిస్ట్





