కాంగ్రెస్‌లో కల్లోలం..! బాహాటంగానే విమర్శలు

“కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్న పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి. విచిత్రమేమంటే ఆయన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కూడా. ఆయన ప్రభుత్వానికి సలహా ఇవ్వడమేమోకాని, తన మాటకే విలువ లేకుండా పోయిందంటూ తెగ బాధపడుతున్నాడు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నడుస్తున్నదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడం ప్రభుత్వ పాలనా తీరుకు అద్దంపడుతున్నది. ఇక్కడ మరో విచిత్రకర విషయమేమంటే శ్రీనివాసరెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. అలాంటి వ్యక్తి తాను ఇరవైసార్లు ఫోన్‌చేసిన పనిజరుగకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు.”

manduva ravindhraకాంగ్రెస్‌లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతున్నది. ఒక్కొక్కరుగా స్వీయపార్టీనే విమర్శిస్తున్నారు. ముఖ్యనేతనే సవాల్‌ ‌చేస్తున్నారు. ప్రధానంగా సీనియర్స్ ‌మానసిక ఒత్తిడులకు లోనవుతున్నారు. అవమానాలను భరించలేక పోతున్నామంటున్నారు.కనీస మర్యాదలు కూడా మంత్రులు పాటించడంలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జీవన్‌రెడ్డి, నేడు పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యనేతల బాటలో మరికొందరు సిద్దమవుతున్నారు.

నలభైరెండు ఏండ్ల కాంగ్రెస్‌ అనుబంధాన్ని మాజీమంత్రి టి. జీవన్‌రెడ్డి వదులుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న తనను ఏనాటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గౌరవిస్తుందనుకున్న జీవన్‌రెడ్డికి నిర్లక్ష్యమే ఎదురైంది. దాన్ని తట్టుకోలేక ఆయన కెసిఆర్‌ ‌నాయకత్వంలోని భారత రాష్ట్రసమితి దరిచేరారు. ఈనెల 20న సాక్షాత్తు కెసిఆర్‌ ‌చేతులమీదుగా గులాబీ కండువ కప్పుకోబోతున్నారు. ఇక్కడ విచిత్రమేమంటే ఆయన అధికార పార్టీని వీడి, ప్రతిపక్ష పార్టీలో చేరడం. నాయకులెవరైన అధికార పార్టీలో ఉండాలనుకుంటారు. భారత రాష్ట్ర సమితి పార్టీ టికట్‌పై గెలిచిన పదిమంది ఎంఎల్యేలు ఆవిధంగానే అధికార కాంగ్రెస్‌బాటపట్టిన విషయం తెలిసిందే. ఇంకా వారు త్రిశంకు స్వర్గంలో ఉండడం వేరే విషయం.
వారిలో ఒకరైన గూడెం మహిపాల్‌రెడ్డి మాత్రం మనస్సుమార్చుకుని మళ్ళీ స్వంత గూటికి చేరుకున్నారు. మిగతావారు కాంగ్రెస్‌ ‌కండువలు కప్పుకున్నా తామింకా బిఆర్‌ఎస్‌లోనే ఉన్నామని ప్రజలను, న్యాయస్థానాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిధానాన్ని  ‌ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వ విధానంపైనే జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాను పార్టీ వీడడానికి అదే కారణమంటున్నారు. పార్టీ వర్గాలు కనీస నైతిక విలువలు పాటించడంలేదన్నది ఆయన ఆరోపణ. అంతేకాదు, ఇతర పార్టీలనుండి వచ్చినవారిని అందలం ఎక్కిస్తూ దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్నవారిని పట్టించుకోవడంలేదంటూ సరాసరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఆయన బాణం ఎక్కుపెట్టారు. అంతేకాదు, ‘రేవంత్‌రెడ్డి పోవాలె.. కెసిఆర్‌ ‌రావాలె..కాంగ్రెస్‌లో మార్పురావాలి..’ అన్న నినాదంగానే ఈ నెల 20న జగిత్యాల లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.
ఇంకా ఈ ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్  ‌పడకముందే మరో సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు తమప్రభుత్వంపై ధ్వజమెత్తడం, ఆపార్టీలో అలజడి లేపుతున్నది. ఆయన ఎవరోకాదు, నిజామాబాద్‌ ‌జిల్లా బాన్స్‌వాడ ఎంఎల్యేగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి గెలిచి, కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్న పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి. విచిత్రమేమంటే ఆయన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కూడా. ఆయన ప్రభుత్వానికి సలహా ఇవ్వడమేమోకాని, తన మాటకే విలువ లేకుండా పోయిందంటూ తెగ బాధపడుతున్నాడు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నడుస్తున్నదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడం ప్రభుత్వ పాలనా తీరుకు అద్దంపడుతున్నది. ఇక్కడ మరో విచిత్రకర విషయమేమంటే శ్రీనివాసరెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు.
అలాంటి వ్యక్తి తాను ఇరవైసార్లు ఫోన్‌చేసిన పనిజరుగకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు. శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్దాపూర్‌ ‌రిజర్వాయర్‌ ‌పనులు నిధులులేక ఆగిపోతున్నాయి. దానితోపాటు ఇతర పనులకు కావాల్సిన నిధులు బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో రాబట్టుకోలేకపోవడంవల్లే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంకూడా నిధులు సమకూర్చకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకుగురైనారు.  సిద్ధాపూర్‌ ‌రిజర్వాయర్‌ ‌వద్దే కుర్చీవేసుకుని కూర్చుని, సంబందిత అధికారులను నిధుల విషయంలో నిలదీశారు. సిఎంకు ఎన్నిసార్లు నివేదించుకున్నా పట్టించుకోడు. మంత్రులు వినరు. కనీసం ఫోన్‌ను కూడా రిసీవ్‌ ‌చేసుకోవడంలేదు. ఈ వయస్సులో ఎవరి కాళ్ళు పట్టుకోవాలి. ఇదెక్కడి దరిద్రపు రాజకీయమంటూ ఆయన ఆవేశం తో కూడిన ఆవేదనను వ్యక్తం చేయడం చూస్తుంటే, ఆయనకూడా జీవన్‌రెడ్డిలా మానిసిక క్షోభకు గురిఅవుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయనకూడా తిరిగి బిఆర్‌ఎస్‌ ‌గూటికిచేరే ఆలోచనేమన్నా చేస్తున్నాడా అన్న అనుమానానికి తావేర్పడుతున్నది.
అదేవిధంగా తాజాగా జరిగిన శాసనమండలి సమావేశంల్లో కాంగ్రెస్‌ ఎంఎల్సీ విజయశాంతి కూడా ఆవేశ ప్రసంగం అధికార పార్టీపై ఉన్న అసంతృప్తిని చెప్పకనే చెబుతున్నది. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధానాలను ఎందుకు నిలుపుకోలేకపోతున్నామంటూ స్వీయ పార్టీనే నిండు సభలో ప్రశ్నించిన తీరు తాను కూడా మానసిక సంఘర్షణకు గురవుతున్నట్లుగా కనిపిస్తున్నది. రైతులకు, మహిళలకు, యువకులకు అనేక వాగ్ధానాలు చేశాం. వాటిని ఎంతవరకు అమలుపర్చామన్నది ఆలోచించుకోవాల్సిన అవసరముందన్నారు.ముఖ్యంగా ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం తనను కలిచివేస్తుందంటూ  బాధపడ్డారు.
చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలను చూస్తుంటే కలిగే బాధ వర్ణనాతీతంగా ఆమె సభలో చెప్పినతీరు నిజంగానే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వీటన్నిటినీ విస్మరించిందికాదా అనిపించేదిగా ఉంది. వారి కుటుంబాలకు ఇస్తామన్న 250 గజాల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు, 10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ‌పెన్షన్‌, ఉద్యోగం ఇవేవీ ఇవ్వకుండానే రెండున్నరేండ్లు గడిచిపోయాయి. నిజానికి వారే ఉద్యమించకుంటే సిఎం, మంత్రిపదవులను మనం అనుభవించేవారమా అన్న ఆమె ప్రశ్న  ఆలోచింప జేసేదిగాఉంది.
ఇదిలా ఉంటే తమ నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజలనుంచి వస్తున్న ఒత్తిడులను తట్టుకోలేక మరికొందరు ఎంఎల్యేలు నలిగిపోతున్న వార్తలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *