ఇప్పుడు సౌత్ ఏంచేయాలి?

“దక్షిణ భారతంలోని విద్యావంతులు, పౌర సమాజం, మీడియా, ప్రవాస భారతీయులు కలిసి ఈ అంశంపై స్పష్టమైన చర్చను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి. ఇది ప్రాంతీయత కాదని, సమర్థ పాలనకు న్యాయం చేయాలన్న ప్రయత్నమని ప్రజలకు తెలియజేయాలి. డేటాతో ఆధారపడి ప్రచారం చేస్తూ, దేశ సంక్షేమానికి దక్షిణ రాష్ట్రాల వాటాను వివరించాలి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చు.”

-పెండ్యాల కొండల్

ఉత్తరాన సీట్ల సంఖ్య డబులవుతుంటే దక్షిణ భారతం కళ్లప్పగించి మౌన సాక్షిగా చూడాల్సిందేనా? ఆంధ్రా పార్టీల డబుల్ స్టాండర్డ్స్ నడుమ ప్రజాస్వామిక ఆలోచనలు గిలగిలాడాల్సిందేనా? రాజకీయ పార్టీలతో పాటు సకలజనం కేంద్రం చర్యలను నిలదీయాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తున్నాది కదా! రాబోయే జనగణన అనంతరం చేపట్టబోయే డిలిమిటేషన్ ప్రక్రియ భారత సమాఖ్య వ్యవస్థను దీర్ఘకాలికంగా ప్రభావితం చేసే కీలక మలుపుగా మారబోతోంది. జనాభా ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న ఈ రాష్ట్రాలు తమ హక్కులను కాపాడుకునే దిశగా సమగ్ర, సమన్విత వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.

డీలిమిటేషన్ లెక్కలు వాస్తవ చిత్రాన్ని స్పష్టంగా ప్రస్పుటం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిపి దేశ జనాభాలో సుమారు 20 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ స్థూల దేశీయోత్పత్తిలో (GDP) దాదాపు 30–31 శాతం వాటా కలిగి ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉండటం వల్ల ఈ రాష్ట్రాల్లో జనన రేటు ఇప్పటికే తగ్గింది. కానీ ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలు ఇంకా అధిక జనాభా వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం జనాభాను ప్రమాణంగా తీసుకుని డిలిమిటేషన్ జరిగితే, దక్షిణ రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గి, పన్నుల పంపిణీ, వనరుల కేటాయింపు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
     దీనిని అధిగమించేందుకు మొదటగా అవసరమైనది రాజకీయ ఐక్యత. పార్టీ భేదాలను పక్కనబెట్టి దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక శాశ్వత వేదికగా “దక్షిణ రాజకీయ వేదిక”ను ఏర్పాటు చేయాలి. ఇది కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా, రాజ్యాంగ సవరణలు, ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు, ముఖ్య చట్టాలపై సమన్వయంతో పనిచేసే కార్యదర్శిత్వాన్ని కలిగి ఉండాలి. ఇదే సమయంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో కూడా అనుసంధానం పెంచుకుని విస్తృత సమాఖ్య కూటమిని నిర్మించాల్సిన అవసరం ఉంది.
   రెండవది, ప్రాతినిధ్యానికి ప్రత్యామ్నాయ ప్రమాణాలపై దక్షిణం గట్టిగా వాదించాలి. కేవలం జనాభాపైనే ఆధారపడటం న్యాయసమ్మతం కాదు. ఆర్థిక అభివృద్ధి, పన్ను చెల్లింపులు, మానవాభివృద్ధి సూచికలను కూడా పరిగణనలోకి తీసుకునే హైబ్రిడ్ విధానం—ఉదాహరణకు 60:40 లేదా 50:50 నిష్పత్తి—సముచితం. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆలోచనపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. జర్మనీ, యూరోపియన్ పార్లమెంట్ వంటి దేశాలు అనుసరిస్తున్న సమతుల్య ప్రాతినిధ్య నమూనాలు ఇందుకు ఉదాహరణలు.
   ఇంక మూడవది, రాజ్యాంగపరమైన సంస్థాగత రక్షణలు కల్పించే ప్రక్రియ. లోక్‌సభ స్థానాలను పెంచుతూ, రాష్ట్రాల ప్రాతినిధ్య శాతాన్ని తాత్కాలికంగా స్థిరంగా ఉంచే చర్యలు తీసుకోవచ్చు. దీర్ఘకాలికంగా రాజ్యసభను నిజమైన సమాఖ్య మండలిగా మార్చి, రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే ఆర్థిక వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి—రాష్ట్రాలకు అధిక పన్ను వాటా, కేంద్ర పథకాల పరిమితి, అధికారాల స్పష్టమైన విభజన వంటి అంశాలు దీనిలో భాగం కావాలి. అవసరమైతే పెద్ద రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వంటి ప్రతిపాదనలు కూడా పరిశీలించవచ్చు.
    నాలుగవది, ప్రజా అవగాహన. దక్షిణ భారతంలోని విద్యావంతులు, పౌర సమాజం, మీడియా, ప్రవాస భారతీయులు కలిసి ఈ అంశంపై స్పష్టమైన చర్చను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి. ఇది ప్రాంతీయత కాదని, సమర్థ పాలనకు న్యాయం చేయాలన్న ప్రయత్నమని ప్రజలకు తెలియజేయాలి. డేటాతో ఆధారపడి ప్రచారం చేస్తూ, దేశ సంక్షేమానికి దక్షిణ రాష్ట్రాల వాటాను వివరించాలి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చు. చివరగా, కేంద్రంతో ఘర్షణ కాకుండా సమాన భాగస్వామ్యంతో చర్చ జరగాలి. కేంద్రం ఇచ్చిన హామీలు చట్టబద్ధమైన హామీలుగా మారేలా చూడాలి. డిలిమిటేషన్ బిల్లుకు ముందు స్పష్టమైన ఒప్పందం కుదిరేలా దక్షిణ రాష్ట్రాలు సమిష్టిగా చర్చలు జరపాలి. ఈ విషయంలో సమయం అత్యంత కీలకం.
    వాస్తవానికి డిలిమిటేషన్ ఒక సవాలే కాదు, ఒక అవకాశమూ. దూరదృష్టి, సమన్వయం, రాజ్యాంగబద్ధతతో ముందుకు సాగితే, ఇది భారత సమాఖ్య వ్యవస్థను మరింత బలపరచగలదు. విద్య, ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధానమే దేశానికి మేలుకలిగిస్తుంది. దక్షిణ భారతం తన హక్కులను కాపాడుకుంటూనే, దేశ సమగ్రతను బలోపేతం చేసే దిశగా ఈ సవాలును స్వీకరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *