“ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఆత్మీయమైన పలకరింపుతో, కఠోరమైన కార్యదీక్షతో జనహృదయాలను సునాయాసంగా గెలుచుకున్న సమ్మోహన శక్తి. భగ భగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా…సుడిగాలి సైతం సిగ్గుపడేలా పర్యటిస్తూ..నిరంతరం ప్రజల కోసం పరితపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నవ్వుల రారాజు…అలుపెరగని బాటసారి. ట్రబుల్ షూటర్, డైనమిక్ లీడర్ హరీష్‌రావు పుట్టినరోజు నేడు.”
అలుపెరగని బాటసారి..రికార్డుల విజేత
కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర మంత్రి దాకా…
‘ప్రజాతంత్ర’ప్రత్యేక కథనం: (ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర సిద్ధిపేట బ్యూరో) : పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం..ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు తన్నీరు హరీష్‌రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు. సిఎం కేసీఆర్ మేనల్లుడిగా తెరపైకి వొచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకున్న యువ నేత. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజా నేత. క్షేత్రస్థాయిలో యువత, శ్రేణులను సమీకరించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగలిగే స్థాయి ఉన్న వ్యూహరచయిత. కేసీఆర్ తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి. మామ అడుగుజాడల్లో నడిచే మహానేత. ఉద్యమం తొలినుంచి మేనమామ •కేసీఆర్ వెంట అడుగువేస్తూ ప్రతిచోట తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న హరీష్‌రావు ఎక్కడ సమస్య ఎదురైనా పరిష్కరించడంలో ముందుంటారు. ప్రజాసేవలోనూ ఎప్పుడూ ప్రత్యేక వైఖరిని అవలంబిస్తూ ప్రజలకు మరింత చేరువవుతారు. కేవలం రాజకీయ విమర్శలను తీవ్రస్థాయిలో గుప్పించడంలో మాత్రమే కాదు. తన సొంత నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయంలోనూ కూడా ఆయన ఇతరులకంటే ముందుండటమే కాకుండా, చాలా యాక్టివ్‌గా ఉంటారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంకల్పం ఉంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి నేతలకు ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ప్రస్తుతం సిద్ధిపేట యావద్దేశానికే ఉదాహరణగా నిలుస్తుంది.
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన సిద్ధిపేట నియోజకవర్గం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీ, స్టేట్‌గా మారింది. ఈ గొప్ప మార్పుకు చరిత్రకు కారణం సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గ సభ్యుడు, రాష్ట్ర మంత్రి హరీష్ రావు కారణభూతులయ్యారు. ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఆత్మీయమైన పలకరింపుతో, కఠోరమైన కార్యదీక్షతో జనహృదయాలను సునాయాసంగా గెలుచుకున్న సమ్మోహన శక్తి. భగ భగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా…సుడిగాలి సైతం సిగ్గుపడేలా పర్యటిస్తూ..నిరంతరం ప్రజల కోసం పరితపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నవ్వుల రారాజు…అలుపెరగని బాటసారి. ట్రబుల్ షూటర్, డైనమిక్ లీడర్ హరీష్‌రావు పుట్టినరోజు నేడు. నేటి(శుక్రవారం)తో 50వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మంత్రి తన్నీరు హరీష్‌రావు రాజకీయ ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల్లో ఆద్యంతం ఆసక్తికరం. కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకమైన నీటిపారుదల, శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ ఎదిగిన వైనం, నమ్మిన సిద్ధాంతం పట్ల చేస్తున్న పని పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
పల్లె నుంచి పట్నం దాకా…కూలీ నుంచి శ్రీమంతుల దాకా అందర్నీ ఒకే రీతిన నవ్వుతూ పలుకరించడం, ఆదరించడం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం హరీష్‌లో మానవీయ కోణానికి తార్కాణం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పడం విశ్వసనీయతకు ఆయన ఏ విధంగా పట్టం కడతారనేదానికి మచ్చు తునక. కోటి ఎకరాలకు సాగు నీరు కోసం ప్రాజెక్టుల వద్దనే బస చేసి…అక్కడే రివ్యూలు చేస్తూ నిర్ణీత సమయంకంటే ముందుగానే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా మిషన్ కాకతీయను పరుగులు పెట్టించిన హరీష్‌రావు…పుట్టుకతో తాను మంత్రిగా పుట్టలేదనీ, మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం వొచ్చినందుకు తాను ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాని తరుచూ అంటుంటారు.
మంత్రి హరీష్‌రావు బర్త్ డే సందర్బంగా ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం…
హరీష్‌రావు ప్రస్థానం ఇలా… రికార్డుల విజేత
సిద్ధిపేటలోని చింతమడకలో హరీష్‌రావు జన్మించారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు.2004 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి టిఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ పార్లమెంట్‌కు వెళడంతో, 32 ఏళ్ల వయసులో 2004లో సిద్ధిపేట నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుంచి ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలుపు హరీష్‌దే. అంతేకాదు, ప్రతీ ఎన్నికల్లోనూ మెజారిటీ రెట్టింపు అవ్వాల్సిందే. అదే హరీష్ ప్రత్యేకత. 2004 ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి, మాజీ మంత్రి ముత్యంరెడ్డిపై 24,827 వోట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో మరోసారి ప్రత్యర్థి బైరి అంజయ్యపై 58,935 వోట్ల మెజార్టీతో గెలిచారు. 2009 సాధారణ ఎన్నికల్లో హరీరావు 64,677 వోట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా ప్రత్యర్థికి డిపాజిట్ దక్కలేదు. 2010 ఉప ఎన్నికల్లోనూ హరీష్‌రావు 95,858వోట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో హరీష్‌రావు 93వేల 328వోట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో హరీష్ రావు మెజారిటీ లక్ష దాటింది. అలాగే ఉమ్మడి ఆంధప్రదేశ్, తెలంగాణ శాసన సభలో 1,20,650 వోట్ల అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు హరీష్ రావు. సిద్ధిపేట నియోజకవర్గంలో పోలైన వోట్లలో 80శాతం వోట్లను హరీష్ రావు సాధించారు. లక్ష 20వేల 650 వోట్ల మెజారిటీతో గెలుపొందారు.
బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న హరీష్…
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడగా 2004లో సిద్ధిపేట అసెంబ్లీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినా…తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు, రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఇప్పుడు తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నారు. మాటకారితనం, వ్యూహాలను రచించడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఆయన చాలా ఈజీగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తుల వేయడంతో హరీష్ తన మేనమామ సిఎం కేసీఆర్ రాజకీయ చతురతను పుణికిపుచ్చుకున్నారు. హరీష్ అనేక అవమానాలు పడ్డా, వొడిదుడుకుల్ని ఎదుర్కున్నా…ఆయన తనంతట తానే దిగమింగుకున్నారే తప్ప…ఎన్నడూ సిఎం కేసీఆర్ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించలేదు. ఇసుమంత మచ్చనూ తేలేదు. ఇదే ఆయనను ప్రజల మనిషిగా, కేసీఆర్ నమ్మిన మనిషిగా చేసింది. హరీష్ ఎత్తులు వేశారంటే ప్రత్యర్థులు చిత్తేనని అనేక సందర్భాల్లో నిరూపితమైంది.
అదే ఆయనకు ఇప్పుడు ఎనలేని ఇమేజీని తెచ్చిపెట్టడమే కాకుండా రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెట్టింది. ఎండనకా, పగలనకా, రాత్రనకా రోజుకు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. మాటలో స్పష్టత, ఆకట్టుకునే చిరునవ్వు, శత్రువును సైతం మంత్రముగ్దులను చేసే రాజకీయ వ్యూహాలు ఆయన అలంకారాలు. అనుకువ తప్ప అహంకారం కనిపించని నైజం ఆయనది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఆయన్ను ఆప్యాయంగా హరీశన్న అని పిలుస్తుంటారు. ఆయనొస్తే.. సొంతమనిషే ఇంటికొచ్చినట్టు భావిస్తారు తెలంగాణ ప్రజలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మేనమామ కేసీఆర్ మాటలను ఒంటబట్టించుకున్నారేమో గానీ.. ఎక్కడ అహం కనిపించని మనిషి హరీష్. ఎంత కష్టం వొచ్చిన చిరునవ్వు చెరగని మనిషి ఆయన. అలసట కనిపించని లీడర్. మునిపంటికింద కష్టాన్ని తొక్కిపెట్టి, ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజం. తెలంగాణ తల్లి దాస్య సృంఖలాలు తెంచుకొని, స్వరాష్ట్రంగా అవతరించిన మరుసటి రోజే ఆయన పుట్టిన రోజు కూడా. ఇలాంటి పుట్టినరోజులు హరీష్‌రావు మరెన్నో జరుపుకోవాలని ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక మనస్పూర్తిగా కొరుకుంటోంది.
హరీష్‌రావు ప్రొఫెల్…
పేరు : తన్నీరు హరీష్‌రావు
జననం : 03-06-1972
తల్లిదండ్రులు : తన్నీరు సత్యనారాయణ, లక్ష్మీబాయి
విద్యార్హతలు : డిప్లమా ఇన్ ఇంజనీరింగ్(పాలిటెక్నిక్)
ప్రస్తుత హోదా : రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి
కుటుంబం : భార్య : శ్రీనిత, కుమారుడు : హరికేష్ మాన్, కూతురు : వైష్ణవి
రాజకీయ ప్రస్థానం : 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి.
సిద్ధిపేట నుంచి వరుసగా 6 పర్యాయాలు శాసనసభ్యుడుగా గెలుపొందారు. 2014 నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేబినెట్‌లో మంత్రిగా పని చేస్తున్నారు.
మంత్రి హరీష్‌రావుపై నీలం మధు అభిమానం అలా….
‘ఏ దేశమేగినా…ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నారు..అందుకు తగ్గట్టుగానే కొందరు తమ తల్లిదండ్రుల సేవలో తరిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తనను కని పెంచిన తల్లిదండ్రుల పేరుతో ఎంతో కొంత తనవంతు సహాయం చేస్తూ తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్నారు. చేయూత అందిస్తున్నారు. ఈ కోవలోకే వొస్తాడు.. ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలంలోని చిట్కూల్ సర్పంచి, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్. రాజకీయంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచిగా స్థిరపడిన నీలం మధు తన తల్లిదండ్రులైన నీలం రాధమ్మ-నిర్మల్ జ్ఞాపకార్థం ఇప్పటకే పటాన్‌చెరులో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తన సొంతూరు, నియోజకవర్గం దాటి సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక మునిసిపల్ పరిధిలోని చేర్వాపూర్‌కు తన సేవా కార్యక్రమాలను విస్తరించాడు. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బర్త్ డే సందర్భంగా నీలం మధు ముదిరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేర్వాపూర్‌కు లక్ష రూపాయల పై చిలుకు విలువ చేసే బెంచీ(30)లను అందజేశారు. మంత్రి హరీష్‌రావు బర్త్ డే సందర్భంగా మధు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బెంచీలను ఇచ్చి తన ఔదర్యాన్ని, మంత్రి హరీష్‌రావుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మధు నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మంత్రి హరీష్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకుని నీలం మధు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నాడు. వీటికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిరుపేదలకు, గ్రామాలకు సహాయం, సేవ చేస్తే సమాజ, దేశ అభివృద్ధికి తోడ్పడినట్లేననీ మధు అన్నారు. ప్రతి మనిషికి నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలంటే ఆపద, కష్టాల్లో ఉన్న తోటి వారికి మనవంతుగా ఎంతో కొంత సహాయం చేయాలని నీలం మధు తెలిపారు.
మధుకు కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి
మంత్రి హరీష్‌రావు బర్త్‌డేను పురస్కరించుకుని తమ వార్డు పరిధిలో అడిగిన వెంటనే 30 బెంచీలను ఇచ్చిన చిట్కూల్ సర్పంచి నీలం మధుకు చేర్వాపూర్ వార్డు కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి-శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మధు సేవా కార్యక్రమాలను కొనసాగించడం, వాటిని రోజు రోజూకూ విస్తరించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోటివారికి సహాయం చేయాలన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న మధును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కౌన్సిలర్ సంధ్యారాణి-శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.