సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ను పట్టించుకోరా?
విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి
తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ తాజాగా మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకటనను విడుదల చేస్తూ…సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ని కేసీఆర్ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదనీ ఆరోపించారు. విద్యార్థులకున్న వసతులు.. ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గురుకులంలోనూ నిర్లక్ష్యమే తాండవం చేస్తోందనీ, తాజాగా నారాయణ్‌ఖేడ్, జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ స్కూల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. అయితే, స్టూడెంట్స్‌కి పాఠశాలలోనే ఎవరికీ తెలియకుండా చికిత్స అందించారన్నారు.
గురువారం రాత్రి చేసిన పప్పునే శుక్రవారం కూడా పెట్టడంతో స్టూడెంట్లకు విరేచనాలు, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరిగాయన్నారు. వారికి మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయనీ, ఏం కేసీఆర్ సారు?… మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నడా?అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతి గురుకులానికీ సరైన వసతులు కల్పించాలని బిజెపి పార్టీ తరపున డిమాండు చేస్తున్నామన్నారు. బంగారం లాంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ విద్యార్థి లోకం తగిన శాస్తి చేయడం ఖాయమనీ ఆ ప్రకటనలో విజయశాంతి హెచ్చరించారు.