కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల సంబురాల్లో పాల్గొన్న టిజెఎస్ అధ్యక్షుడు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సిఎంగా నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ॥ కోదండరామ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలతోనే వారి హక్కులు హరించారని, అట్లా కాకుండా కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని అన్నారు. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య తాను వారధిగా ఉండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు.