ప్రత్యేక దర్భను తెప్పించిన టిటిడి
తిరుమల, సెప్టెంబర్ 24 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం ఊరేగింపుగా శ్రీవారి ఆలయ చెంతకు చేర్చారు. ఈనెల 27న నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగించనున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది.
రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుట్టి దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీశాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేసింది. దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణుదర్భను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించి వాటిని తిరుమలకు తీసుకువచ్చారు. ఎండలో వారం రోజులు ఎండబెట్టి శుభ్రపరచి 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవు తాడు సిద్ధం చేశారు. వీటిని శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు.