అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
న్యూదిల్లీ,మే19 : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ’శివలింగం’ వయసును నిర్ధారించే ప్రక్రియపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. దీనిని శాస్త్రీయంగా నిర్ణయించాలని, కార్బన్ డేటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సర్వేలో ఈ ’శివలింగం’ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఫౌంటెన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది.
జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.’శివలింగం’ వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసానాలనుబట్టి చూసినపుడు, దీనిపై మరింత లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉందని తెలిపింది. హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వారణాసిలోని కాశీ విశ్వనాధుని దేవాలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. ఇక్కడ కాశీ ఆలయాన్ని కూల్చీ మసీదు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి.