- పోలీసు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావు
- ఉద్యోగాలు సంపాదించి జిఎంఆర్‌కు మంచి పేరు తీసుకు రావాలని విజ్ఞప్తి
పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సంగారెడ్డి జిల్లా పోలీసుల అధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పోలీస్ ఉచిత శిక్షణ తరగతులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పటాన్‌చెరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఎమ్మెల్యే జీఎంఆర్ 50 లక్షల రూపాయల స్వంత నిధులు వెచ్చించి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ, బోజన వసతి, స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయం అన్నారు. 90 రోజుల పాటు తల వంచి ఇష్టపడి చదివితే, జీవితాంతం తల ఎత్తుకొని బతకవచ్చని అన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించి ఎమ్మెల్యే జిఎంఆర్‌కు, నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని కోరారు. 2017 సంవత్సరంలోను ఎమ్మెల్యే జీఎంఆర్ 500 మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తే, సుమారు 350 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మోకాళ్ల యాత్ర, పాద యాత్ర చేయడం కాదు, కేంద్రంలో 15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
ఈ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, తెలంగాణకు ఇతర రాష్ట్రాల వారు వొచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగుంటే ఇక్కడికి ఉపాధి, ఉద్యోగం కోసం ఎందుకు వొస్తారని మంత్రి ఎద్దేవా చేశారు. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా, ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ గురించి తెలంగాణ విద్యార్థులు ఎక్కడికక్కడ బీజేపీని నిలదీయండని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం జిల్లా పోలీసుల సహకారంతో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, టిఎస్‌ఎంఐడిఎస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్, మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జడ్పిటిసిలు, ఎంపిపిలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చివరి ధాన్యం గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
సంగారెడ్డి, ఏప్రిల్ 18(ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన చివరి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని, అన్నదాతలకు అండగా ప్రభుత్వం అన్ని విధాల భరోసా ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాసంగి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అధికారులు, మిల్లర్స్ సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. ఏ రోజుకారోజు వడ్లు ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. టార్పాలిన్ కవర్లు కొరత లేకుండా చూడాలని తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనల్ చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వడ్ల కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4700 కోట్లు భారం పడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉన్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణను కేంద్రం ఇబ్బంది పెడుతుందన్నారు. యాసంగిలో భారతదేశంలో అతి ఎక్కువగా వరి ధాన్యం పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమని అన్నారు. యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నామని తెలిపారు. ఒక సంవత్సరంలో 50 వేల కోట్లకు పైగా రైతులపై ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు. రైతులను, ఐకేపీ, ప్యాక్ సెంటర్లను కాపాడిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. కేంద్రం మొండి వైఖరితో పంట జాప్యం అయిందన్నారు. రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు ధాన్యం దించుకోవాలన్నారు. ప్యాడి క్లీనర్స్ బాగుండేలా చూసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి రోజు అన్ని కొనుగోలు కేంద్రాలకు వెళ్లి తిరిగి పర్యవేక్షించాలని తహసీల్దార్లకు సూచించారు.
ఏ గ్యాప్ వొచ్చినా కలెక్టర్, అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకు వొచ్చి పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. మిల్లర్లకు అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. ధాన్యం నిల్వకు సరైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు 1,960, సాధారణ రకం 1,940 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. వొచ్చే వర్షాకాలం కొరకు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని, సోయా పత్తి విత్తనాలను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచాలన్నారు. రైతులను పత్తి, సోయా సాగుకు ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అవసరమైన ఎరువులు బఫర్ స్టాక్ పెట్టాలన్నారు. యాసంగి పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం తగదని, అప్రమత్తతతో బాధ్యతగా ఆయా అధికారులు విధులు నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 36 వేల 256 ఎకరాలలో వరి సాగైందన్నారు. సుమారు 84,614 టన్నుల దిగుబడి వొచ్చే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాలకు 75,600 ధాన్యం వొస్తుందని అంచనా ఉందన్నారు.
జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులెవరు బయట తక్కువ ధరకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. రైతులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. ట్రాన్స్‌పోర్ట్, కూలీల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా బార్డర్‌ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ మంచి జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, సహకార శాఖలు, అనుబంధ శాఖల అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా స్థిరపడాలి
దళిత బందుతో దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన దళిత బంధు కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా దళిత బంధు అందిస్తున్నామన్నారు. అధికారులు సూచనలు మాత్రమే చేస్తున్నారని, లబ్ధిదారులు వారికి వచ్చిన పని ,నచ్చిన పని చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ముందుకు వెళుతుందన్నారు. దళిత బందు కింద 10 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన దళిత బందుతో మరింత ఉన్నతంగా ఎదిగి సీఎం కోరుకున్న కలను నిజం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. దేశంలోని దళితులందరీకి. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఇవ్వాలన్నారు.దళితుల ఉన్నతికి అందరం కలిసి పని చేద్దామని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులందరికీ ఉచిత కరెంటు ఇవ్వాలని, రైతుబంధు 10వేల చొప్పున ఇవ్వాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మూడు ఏళ్లలో పూర్తి చేశామని, రేపో మాపో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి సంగారెడ్డికి గోదావరి నీళ్ళు తీసుకు వస్తామన్నారు.కేంద్రం దళితుల కోసం పెట్టిన బడ్జెట్ ఎంతో చెప్పాలన్నారు. దేశం మొత్తం పెట్టిన దాని కంటే తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు కోసం 17,800 కోట్లు పెట్టిందన్నారు.గుజరాత్, కర్ణాటక, ఆంధప్రదేశ్ లలో పవర్ హాలిడేలు ఉన్నాయని, దేశంలో పవర్ హాలిడే లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయడంతో పాటు రవాణా వాహనాలు, ఇతర యూనిట్లను మంత్రి ప్రారంభించారు. యూనిట్ల ప్రారంభానికి ముందు శాంతి కపోతాలు ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి,మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి , అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.