కష్టసుఖాల కావడి బరువు
సమానంగా పంచుకుంటూ,
ఆలనాపాలనలకు
ఆప్యాయతల దండవేస్తూ,
ఐకమత్యానికి
నిలువెత్తు నిదర్శనంగా నిలిచే
ఉమ్మడి కుటుంబాలు
బంధాల విలువను,బలాన్ని
మరోతరానికిజి
ఆత్మీయంగా బోధించే పాఠశాలలు,
సంస్కృతీ సంప్రదాయాల
శిక్షణాశిబిరాలు.
అవి హృదయాలకొక ప్రశాంతవాటిక
వసుధైక కుటుంబానికి ప్రాతిపదిక
మమతానురాగాల లోగిళ్ళలో
అంతా ఒక గూటి పక్షులై,
అరమరికల్లేని అరకలతో
కుటుంబాల్ని సాగుచేసుకుంటూ,
సహపంక్తి భోజనాలు,
మమకారాల తీపిముద్దలు
బోలెడన్ని ముచ్చట్లతో సాగే
అందమైన బృందావనం,
అనురాగాల పొదరిల్లు,
ఆనందాల హరివిల్లు
ఉమ్మడి కుటుంబం.
మరి నేడో…
ఆత్మీయతలు ఆవిరి
బంధాలకు లేదు విలువ.
నేటి సమాజం మరిచిన
కమ్మని పదం ఉమ్మడి కుటుంబం.
నేడు అన్నీ వ్యష్టి కుటుంబాలే.
ఉమ్మడి కుటుంబాల్ని ప్రోత్సహిద్దాం
ఉమ్మడిగా కుటుంబ సమస్యలు
పరిష్కరించుకుందాం
నేటి పరిస్థితుల్లో
ఇదే ఆవశ్యకమని గుర్తెరుగుదాం.
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం