నష్టాన్ని అంచనా వేస్తున్నాం
బాధితులందరినీ ఆదుకుంటున్నాం
ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందరినీ ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లోని వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అతి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో చాలా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్, ములుగు, నలగొండ జిల్లాల్లో భారీ నష్టం జరిగిందన్నారు. వాగులు, వంకలు పొర్లడం వల్ల రైతులకు అధిక నష్టం వాటిల్లిందని పొంగులేటి అన్నారు. అకస్మాత్తుగా వరదలు పెరిగిపోవడంతో ఇల్లు వదిలేసి కట్టుబట్టలతో ప్రజలు రోడ్డెక్కారన్నారు.
ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇంత ఉధృతంగా వర్షం వరదలు రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, విజయవాడ వరద ఖమ్మం జిల్లా నుంచి వెళుతుందని పొంగులేటి అన్నారు. వరదంతా పంట పొలాల్లో చేరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రైతుల బాధ, ఆవేదన వర్ణాతీతమన్నారు. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఇళ్లకు వెళ్లి మరీ నష్టం ఎంత మేర జరిగిందో ప్రత్యక్షంగా చూసి చలించిపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని ఆ దిశగా ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామన్నారు. దీనిని జాతీయ విపత్తుగా కేంద్రం స్వీకరించి నష్టాన్ని అందజేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు రూ. 5438 కోట్లు అన్ని విధాలా నష్టం జరిగినట్లు కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేశారని పొంగులేటి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి నష్టాన్ని అందజేస్తుందని ఆశిస్తున్నామని పొంగులేటి వెల్లడిరచారు.
ఆంధప్రదేశ్‌లో జరిగిన నష్టానికి ఎలా సహాయం చేయాలనుకుంటుందో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరిగిన విపత్తు కూడా అలానే సహాయం అందించాలన్నారు. ఈ రాష్ట్రంలో నష్టం జరిగిన రైతులు, ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అత్యవసరంగా కొంత సహాయంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకుంటుందని పొంగులేటి తెలిపారు. ఈ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సివిల్ సప్లై అధికారులు తీసుకుని ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రైతులతో పాటు సామాన్య ప్రజానీకానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని.. అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని..ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని పొంగులేటి తెలిపారు.