– రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న స్కూళ్లు
– మళ్లీ రోడ్డెక్కిన బస్సులు, ఆటోలు
– కొన్నిచోట్ల విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: వేసవి సెలవులు ముగియడంతో సోమవారం స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితం అయిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. ఉదయమే మళ్లీ ఆటోలు, బస్సులు రయ్‌మంటూ రోడ్లపైకి వచ్చాయి. స్కూళ్లను ముస్తాబు చేయడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ స్కూళ్లకు చేరారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలలకు తొలిరోజు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారం ఏర్పాటు చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వేసవి సెలవులతో బోసిపోయిన పాఠశాలలు సందడిగా మారాయి. తెలంగాణలో పాఠశాలలు తెరచుకోవడంతో తల్లిదండ్రులు మళ్లీ బిజీ అయ్యారు. కొత్త పుస్తకాలు.. ఏకరూప దుస్తులతో బడులకు వెళ్లే చిన్నారులతో సందడి నెలకొంది. ఈసారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్తగా అల్పాహారాన్ని అందించనున్నారు. తొలి రోజే పాఠశాలల్లో పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో చాలా తక్కువ మంది విద్యార్థులపై హాజరయ్యారు. కొన్ని చోట్ల పదుల సంఖ్యలోనే విద్యార్థులు హాజరవగా. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతానగర్‌లోని బాలికల పాఠశాలలో ఒకే ఒక పదో తరగతి విద్యార్థిని పాఠశాలకు వచ్చింది. తోటి క్లాస్‌మేట్స్ ఎవరూ లేకపోవడంతో ఆ విద్యార్థిని ఒంటరిగానే క్లాస్ రూంలో కూర్చుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పునఃప్రారంభ తేదీ అమావాస్య రోజు రావడంతో కొందరు అశుభంగా భావిస్తున్నారు. ఈ రోజున కొత్త పనులు, చదువులు ప్రారంభించడం మంచిది కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తెల్లవారి పంపుదామంటే మంగళవారం అవుతుండడంతో ఈ రెండు రోజులు పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని వారు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ రోజుల్లో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ముందుగానే అమావాస్యను ఆలోచించి ఈ నెల 17న బుధవారం, 19న శుక్రవారం ప్రారంభించేందుకు నిర్ణయించాయి.
రాజ్‌భవన్ స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్ పథకం ప్రారంభం 
వ్యాప్తంగా బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్ పథకం సోమవారం నుంచే ప్రారంభమైంది. రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన మంత్రి వారికి పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. వారంలో 6 రోజులు బ్రేక్‌ఫాస్ట్ , పాలు, రాగి జావను అందిస్తున్నామని, దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్కూల్లో చదివితేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే రోజులు రానున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు కావాలి కానీ ప్రభుత్వ హాస్పిటల్స్, స్కూల్ వద్దు అనే భావన ఉందన్నారు. దాన్ని తొలగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.