19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

– నిరంతరం అప్రమత్తత అవసరం
– విపత్తుల నిర్వహణ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి
– రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : నైరుతి రుతుపవనాలు రాబోయే మÖడు నుంచి నాలుగు రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని, ముఖ్యంగా ఈ నెల 19నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఊపందుకుని వారం రోజులపాటు కొనసాగవచ్చని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తుగానే ్న అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని మంత్రి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తం చేస్తూ అధికారులతో మంత్రి సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించి జోగులాంబ గద్వాల జిల్లాను ఆవరించగా ప్రస్తుతం హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ఉత్తర సరిహద్దు కొనసాగుతోందన్నారు. 14వ తేదీ నాటికి దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలు, మధ్య తెలంగాణలోని చాలా జిల్లాలను రుతుపవనాలు తాకాయని తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా సుమారు 10 శాతం లోటు ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందితో నిరంతరం సమన్వయం కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు. వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమంటూ ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *