– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : జూరాల ప్రాజెక్టులోని నీటిమట్టాన్ని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు తన నేతృత్వంలోని బీజేపీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆరఎస్, కాంగ్రెస్‌లు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. వరంగల్‌కు చెందిన ఐటీడీఏ ప్రాజెక్టు విశ్రాంత అధికారితోపాటు పలువురు ప్రముఖులకు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలను కాపాడేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకుల మధ్య వివాదాలు, సరైన సమన్వయం లేకపోవడం వల్ల దిగువ ప్రాంత రైతులు నష్టపోతున్నారన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఆలమట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించుకోవాలని కోరారు. ఫామ్‌హౌస్ వివాదాల్లో కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. వినాయక నిమజ్జన ఊరేగింపు ఏర్పాట్లకు పోలీసు బలగాలను ఉపయోగించకుండా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ మోహరించి ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును తీవ్రంగా ఖండించారు. సంప్రదాయం ప్రకారం హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతితోపాటు అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. 70 అడుగుల ఎత్తైన విగ్రహాలు సహా భారీ విగ్రహాలను బ్యాక్‌వాటర్‌కు మళ్లించకుండా ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జనం చేయడానికి అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. 2019 నుంచి బీఆరఎస్ పాలనలో తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు కాకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పంట బీమాను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు సరైన సమయంలో బీమా అందక తీవ్ర నిరాశకు గురవుతున్నారని రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





