యూపిలో రెండు బస్సలు ఢీకొని 8 మంది మృత్యువాత
హిమాచల్‌లో కారు లోయలో పడి 5 గురు దుర్మరణం
లక్నో, జూలై 25 : వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13మంది మృత్యువాత పడ్డారు. యూపి, హిమాచల్‌లో జరిగిన ఈ రెండుప్రమాదాల్లో 13మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రెండు డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 8 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు.ఈ సంఘటన కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్ పూర్ గ్రామ సపంలో జరిగింది.రెండు బస్సులు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు ఢీకొట్టింది. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
చంబా జిల్లాలో కారు లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. చంబా జిల్లాలోని తిస్సా తహసీల్‌లోని సత్రుండి సపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం చంబా మెడికల్ కాలేజీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతులు చంబాకు చెందిన రాకేష్ కుమార్, అమర్ జీత్ సింగ్, మనోహర్, రాజీవ్ శర్మ, హేమ్ సింగ్‌లుగా గుర్తించారు.లోయల ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కారు వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు, పోలీసులు సహాయచర్యలు చేపట్టారు.