– 3న ప్రమాణ స్వీకారానికి పార్టీ నిర్ణయం
– డికెను సిఎల్‌పి నేతగా ప్రతిపాదించిన సిద్దరామయ్య
– నాయకత్వ మార్పు సజావుగా జరిగిందన్న కెసి వేణుగోపాల్
బెంగళూరు,మే30: కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ జూన్ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ తేదీ అధికారికంగా ఖరారైంది. జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ప్రకటించారు. సీఎల్‌పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికైన అనంతరం డియాతో ఆ వివరాలను కేసీ వేణుగోపాల్ పంచుకున్నారు. సీఎల్‌పీ నేతగా డీకే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పారు. డీకే పేరును కాంగ్రెస్ అధిష్టానం సూచించగా, తొలుత సిద్ధరామయ్య, ఆ తర్వాత పరమేశ్వర ఆయన పేరును సీఎల్‌పీ సమావేశంలో ప్రతిపాదించారని, ఏకగ్రీవంగా దీనికి ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారని వివరించారు. ముఖ్యమంత్రి మార్పు కాంగ్రెస్ పార్టీకి సమస్య అవుతుందని అంతా భావించారనీ, అయితే తమదంతా ఒక కుటుంబమని, అంతా ఏకగ్రీవంగా ఈ ఎన్నికను ఆమోదించడం పార్టీకి గర్వకారణమని అన్నారు. 2028లోనూ నాయకులందరికీ సపోర్ట్‌తో కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అదికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో సిద్ధరామయ్య ఈనెల 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇదిలావుంటే అంతకుముందు కర్ణాటకలో నాయకత్వ మార్పు పక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీకేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శివకుమార్ పేరును మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా సీనియర్ నేత పరమేశ్వర బలపరిచినట్లు తెలిసింది. మరోవైపు జూన్ 3న నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకేఎస్.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరనున్నారు. పరిశీలకులుగా కెసి వేణుగోపాల్,జైరాం రమేశ్ హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




