- మానవ మనుగడను శాసించేది రుతుచక్రం
- మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం
- గజ్వేల్‌లో రుతుప్రేమ మెనుస్ట్రువల్ కప్పుల పంపిణీలో మంత్రి హరీష్‌రావు
- రెండు నెలలు ఇష్టపడి చదివితే..మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చు : శిక్షణ పొందుతున్న పోలీసు ఉద్యోగార్థులకు మంత్రి సూచన
సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో / గజ్వేల్, మే 28 (ప్రజాతంత్ర విలేఖరి) : మీరు నిశ్శబ్దం వీడండి. బహిరంగంగా చర్చించండి. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి. రుతుప్రేమ లేకపోతే..జీవనమే లేదు. మానవ మనుగడను శాసించేది రుతుచక్రం. మీ ఆరోగ్యం కాపాడాలి. మీ డబ్బు కాపాడాలి. మీ ఆరోగ్యమే..మా ఆరోగ్యం. మీకు ఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, శాస్త్రీయమైన రుతుచక్రంపై మీకు అవగాహన కల్పించేందుకు ఈ రుతుప్రేమ కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. శనివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో రుతుప్రేమ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంతో పాటు స్వచ్ఛ సిద్ధిపేట జిల్లాకు పాటు పడదామని దిశానిర్దేశం చేశారు.
సిద్ధిపేట జిల్లాలో ఇప్పటికే 3 వేల మందికి రుతుప్రేమ మెనుస్ట్రువల్ కప్పులను అందించినట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఏంలు, మహిళా గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లుగా.. మీరంతా టీమ్ లీడర్లు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. మీరు పట్టుబడితే.. కానిదేమీ లేదు. రుతుప్రేమ విజయవంతం చేసేందుకు మీరంతా నడుం బిగించాలని మంత్రి పిలుపునిచ్చారు. మొదట మీరు ఉపయోగిస్తే.. మీరే మోటీవేటర్లుగా.. అందరిలో స్ఫూర్తిని నింపిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ కస్తూర్భా, రెసిడెన్షియల్ పాఠశాలలలోని మహిళా విద్యార్థినీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడటంతో పాటుగా మీ ఆరోగ్య రక్షణ చేయాలన్నదే మా ధ్యేయమని మంత్రి చెప్పారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, అలాగే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని.. అప్పుడే రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యమ్రంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతారెడ్డి, గజ్వేల్ ఎంపిపి దాసరి అమరావతి శ్యాంమనోహర్, సిద్ధిపేట మునిసిపల్ ఛైర్‌పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించిన ఏకైక సిఎం కేసీఆర్..
రెండు నెలలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే..మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చునని పోలీసు శిక్షణ పొందే ఉద్యోగార్థులకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. గజ్వేల్ పట్టణంలోని ఫంక్షన్ హాల్‌లో పోలీసు కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పారు. మొత్తం 91 వేల ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, వాటిలో పోలీసు శాఖలో 18 వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని, పట్టుదలతో చదివి మీ కుటుంబాన్ని ఆనందమయంలో ముంచాలని, బిడ్డ ప్రయోజకులుగా మారితే తల్లిదండ్రుల ఆనందం వెలకట్టలేనిదని.. గతంలో శిక్షణ పొందిన పలువురు అభ్యర్థుల అనుభవాలను వివరించారు.
ఈ శిక్షణ కేవలం గ్రూప్స్‌కే కాదని, అన్నీ పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రిల్సిమ్స్ తర్వాత మెయిన్స్ కోసం కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తానని, అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా త్వరలోనే ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కుటుంబాలు చేసిన త్యాగం వెలకట్టలేనిదని, మరువలేనిదని, ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన 60మందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. భవిష్యత్తులో ప్రయివేటు సెక్టారులో చాలా అవకాశాలు ఉన్నాయని, అలాగే గజ్వేల్ ఉద్యోగార్థులకు లైబ్రరీలో మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. రాష్ట్ర, జాతీయ ప్రభుత్వ, ప్రయివేటు రంగ ఉద్యోగ-జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.