రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వొస్తాయనుకున్నాం

  • కానీ ప్రఝల ఆశలు అడియాశలయ్యాయి
  • కల్వకుంట్ల కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదు
  • బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌
  • ‌రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న విజయశాంతి

యాదాద్రి, ప్రజాతంత్ర, మే 24 : రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు నియామకాలు వొస్తాయనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కుల్వకుంట్ల కుటుంబం అభివృద్ధే తప్ప ప్రజలు బాగుపలేదన్నారు. అభివృద్ధి జరగలేదనడానికి తుర్కపల్లి మండలమే నిదర్శనమని ఆయన చెప్పారు. రైతులు వరి వేయద్దని హుకుం జారీ చేసిన ఏకైక సీఎం కేసీఆరే అన్నారు. తరుగు పేరుతో రైతులను ఆగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేది రాష్ట్రంలోనేనని చెప్పారు. ఇక్కడి రైతులను గాలికొదిలేసి పంజాబ్‌ ‌రైతులకు సాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల చావులు కేసీఆర్‌కు కనిపిస్తేలేవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రాన్ని కాస్తా కేసీఆర్‌ ఇప్పు‌డు అప్పులమయంగా మార్చేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అప్పు పుట్టకపోతే ప్రభుత్వం ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వ్ ‌బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే ఆవకాశం లేదన్నారు. ‘మూడు రాష్ట్రాలకు మాత్రమే రూ.8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు మొగ్గు చూపింది. అందులో తెలంగాణ పేరు లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ఏప్రిల్‌లో రూ.3 వేల కోట్లు, ఈ నెల 2న రూ.3 వేల కోట్లు అప్పు తీసుకోలేకపోయిన తెలంగాణ..కనీసం మే 17న రూ.2 వేల కోట్లు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ, రిజర్వుబ్యాంకు చేతులెత్తేయడంతో తెలంగాణలో జూన్‌ ‌రెండో వారానికల్లా ఇవ్వాల్సిన రైతుబంధు ఆలస్యం అవుతుంది. రైతుబంధు కోసం రూ.7,600 కోట్లు అవసరమవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే.. ఇప్పటికే రైతు బంధు చెల్లింపు ఆలస్యమవుతుంది. 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి జాప్యం జరుగుతూ వొస్త్తుంది. ఈసారి కూడా మే నెలలో ఇవ్వడం కష్టమే. రాజపక్సలాగే కేసీఆర్‌ ‌కూడా పదవి నుంచి దిగిపోతేనే తెలంగాణ బాగుపడుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా కేటీఆర్‌ ‌పాల్గొన్న ప్రతీ  కార్యక్రమంలోనూ తెలంగాణ సూపర్‌, ‌బంపర్‌ అం‌టూ డబ్బా కొట్టుకోవడం కామన్‌ అయింది. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక…గప్పాలు పోవడం కేసీఆర్‌ ‌సర్కార్‌కే చెల్లింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని విజయశాంతి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page