హనుమకొండ,జూలై12: సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కాకతీయ వైద్య కళాశాలలో ట్రైబ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కే ఎన్ ఆర్ యు హెచ్ ఎస్ రిజిస్ట్రా డాక్టర్ సంధ్య , కెయంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాం కుమార్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేందర్, విశ్రాంత డిఎఫ్‌ఓ పురుషోత్తం , డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్ లతో పాటు వైద్య విద్యార్థులతో కలిసి కేయంసి ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భవిష్యత్తు తరాల మనగడ కోసం కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు గాను విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ఒక యజ్ఞం లా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపు నిచ్చారు.
చెట్లను పెంచడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని వైద్య విద్యార్థులకు సూచించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్లే మూలా ధారమనే విషయాన్ని గుర్తించి ప్రతి పౌరుడు మొక్కలను నాటాలని సూచించారు. కెయంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సవాల్‌గా స్వీకరించి వన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెయంసి జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ అజయ్ కుమార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి అశ్విని నవదీప్, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.