మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ఆరుగురు మహిళలు…ముగ్గురు పురుషులు

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 04 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందగా..వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ స్పెషల్‌ టాక్స్‌ఫోర్స్‌, బోర్డర్‌ సెక్యురిటి సంయుక్తంగా మావోయిస్టులను ఎదుర్కున్నారు. మృతదేహాలను మంగళవారం రాత్రి నుండి వెతకటం ప్రారంభించగా 9 మృతదేహాలను భద్రతా బలగాలు కనుగొన్నాయి. ఈ మృతదేహాలను మీడియాకు తెలియపరిచారు. వీరి వద్ద నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌, 303 రైఫిల్‌, లాంఛర్లు, 12 బోర్‌ రైఫిల్‌, 315 బోర్‌గన్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మెటిరియల్‌ను సంఘటనా స్థలం వద్ద స్వాధీనం చేసుకున్నారు.

 

జనవరి నుండి ఇప్పటి వరకు బస్తర్‌ డివిజన్‌లో 153 మందిని మావోయిస్టులు మృతి చెందారు. అలాగే 669 మందిని అరెస్ట్‌ చేసినట్లు బస్తర్‌ ఐజి తెలిపారు. మావోయిస్టుల కోసం నిత్యం అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నట్లు బస్తర్‌ ఐజి తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులలో కేంద్ర కమిటి సభ్యుడు వరంగల్‌ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెంకు చెందిన రణదేవ్‌ అలియాస్‌ జగన్‌ ఇతనిపై 25 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మాయోయిస్టులు కుమారి శాంతిపై 5 లక్షల రివార్డు, మడకం సుశీలపై 5 లక్షల రివార్డు, గంగి ముసకిపై 5 లక్షల రివార్డు, మల్కన్‌గిరి ఏరియా కమిటి పార్టీ సభ్యుడు కోస మాద్విపై 5 లక్షల రివార్డు, సురక్షా దళ సభ్యురాలు లలితపై 5 లక్షల రివార్డు, కవితపై 5 లక్షల రివార్డు, సురక్షా దళ సభ్యుడు మడకం హిడ్మాపై 2 లక్షల రివారర్డు, బీజాపూర్‌ ప్రాంతానికి చెందిన ప్లాటూన్‌ సభ్యుడు కమలేష్‌పై 2 లక్షల రివార్డు ఉంది. వీరి మృతదేహాలు లభ్యమైనట్లు ఐజి ప్రకటించారు.

మావోయిస్టులు ఆగ్రనేత ఏసోబు అలియాస్‌ రణదేవ్‌ మృతి…25 లక్షలు రివార్డు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటి సభ్యుడి కేంద్రం మిలటరీ ఇన్‌చార్జీ మాచర్ల ఏసోబు అలియాస్‌ జగన్‌(రణదేవ్‌ దాదా) మృతి చెందినట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి. మావోయిస్టుల ఆగ్రనేత ఏసోబుగా గుర్తించారు. పార్టీలో 1980వ సంవత్సరంలో మావోయిస్టుల ఉద్యమంలో చేరారు.

 

అప్పటి నుండి అంచెలంచలుగా ఎదుగుతూ కేంద్ర కమిటి సభ్యుడి స్థాయికి ఎదిగారు. మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడ్డారు. ఏసోబు స్వస్థలం హన్మకొండ జిల్లా కాజిపేట మండలం టేకులగూడెం గ్రామం. ఇతనిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. ఈయన మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయన మృతి చెందిన వార్తను బంధువులకు, కుటుంబ సభ్యులకు తెలియచేయటంతో ఆ ప్రాంతంలో విషాధా ఛాయలు అలుముకున్నాయి. 1980వ సంవత్సరంలో ఉద్యమ బాట పట్టిన ఏసోబు మృతి చెంది తమ దగ్గరకి వొస్తున్నాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page