మహిళల్లో మద్యసేవన అలవాటు పెరుగుతోందా…!

నేటి ఆధునిక డిజిటల్‌ యుగపు మహిళలు క్రమంగా మద్యానికి దగ్గరవుతున్నారని, స్త్రీ పురుషుల మద్య సేవన అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజు వారి ఒత్తిడిని తట్టుకోవడం, పనిలో అలసిపోవడం, అరుదుగా లభించే సంతోష క్షణాలను ఆస్వాదించడం, కుటుంబ సమస్యలు, గృహ వేధింపులు లాంటి కారణాలతో మహిళలు ఆల్కహాల్‌ వైపుకు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషించారు. ఆల్కహాల్‌ సేవన అలవాట్లు పశ్చిమ అభివృద్ధి చెందిన దేశాల మహిళల్లో నానాటికీ పెరుగుతూ దాదాపు పురుషులతో సమానంగా మహిళామణులు కూడా మద్యం మత్తులో తూగుతున్నట్లు తేలింది. కుటుంబ సంస్కృతులు, సామాజిక కట్టుబాట్లు, వ్యక్తిగత విషయాలు, పట్టణాలు, మహానగరాలు, ఉద్యోగాలు చేస్తున్న యువతరం, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న యువత వంటి కారణాలతో స్త్రీలు/యువతులు పెడదారులు పడుతూ ఆల్కహాల్‌ మత్తుకు దగ్గరవుతున్నారని తేలింది.

భారతీయ మహానగరాల్లో మద్యం వెంట మహిళలు భారతీయ సంస్కృతిలో మహిళల మద్య సేవనం ఓ నిషిద్ధ సంప్రదాయంగా భావించబడేది. ఇప్పటికీ కొన్ని జాతుల గ్రామీణ భార త మహిళలు తాటి కల్లు, సారాయి లాంటివి తీసుకో వడం చూసాం, విన్నాం. ఆల్కహాల్‌ను సేవిం చిన మహిళల్ని విచిత్రంగా, వికారంగా, హేళలగా చూసిన రోజులు దాటి వచ్చాం. నేడు మహిళలు బీర్‌, జిన్‌, విస్కీ లాంటి మద్యం రకాలను కూడా రుచి చూస్తూ మత్తులో తూగుతున్నట్లు అర్థం అవుతున్నది.

నేటి యువత, ముఖ్యంగా యువతులు పబ్బాలు, రిసార్టులు లాంటి ఆధునిక హంగుల అందుబాటుతో మద్యం, మాదక ద్రవ్యాలకు దగ్గరవడం గమనిస్తున్నాం. భారతీయ మహిళలు కూడా క్రమంగా మద్యం మజా వైపు ఆకర్షితులు అవుతూ అనారోగ్యాలపాలయ్యే దుస్థితులకు చేరువవుతున్నారని తెలుస్తున్నది. ఢల్లీి మహానగరంలో 37 శాతం మంది మహిళలు మద్యం అలవాట్ల బారిన పడ్డారని అధ్యయనాలు వివరిస్తున్నాయి. మహానగర మహిళలు వివిధ రకాల ఒత్తిడులను తట్టుకోవడానికి మద్యాన్ని ఆశ్రయిస్తున్నట్లు తేల్చారు. మహిళలు ఉన్నత చదువులు చదవడం, ఉద్యోగాలు చేయడం, ఆర్థిక స్వేచ్ఛ లభించడం, పాశ్చాత్య ధోరిణి పెరగడం లాంటి కారణాలతో భారతీయ స్త్రీలు ఫాల్స్‌ ప్రిస్టేజ్‌కు పోయి ఆనందంగా ఆల్కహాల్‌ గ్లాసులతో చీర్స్‌ కొడుతున్నారు.

మహిళల్లో మద్యం దుష్ప్రభావాలు :
మద్యం ప్రభావం పురుషులు, మహిళల్లో వేరు వేరుగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. పురుషుల కన్న మహిళల్లో కొవ్వు అధికంగా, నీటి శాతం తక్కువగా ఉండడంతో మద్యం సేవించిన మహిళల్లో బ్లడ్‌ ఆల్కహాల్‌ శాతం త్వరగా పెరిగి తేలికగా మత్తులోకి దించి ప్రతికూల హాంగ్‌ ఓవర్‌కు దారి తీస్తుందని వివరిస్తున్నారు. మద్యం సేవించే పురుషుల కన్న మహిళల్లో కాలేయ, హృదయ సంబంధ అనారోగ్యాలు, రొమ్ము క్యాన్సర్‌లు, రుతు స్రావ సమస్యలు, గర్భిణి స్త్రీలలో గర్భస్థ శిశువుపై దుష్ప్రభావాలు (గర్భస్రావాలు, అకాల ప్రసవాలు, చివరకు శిశు మరణాలు), శారీరక/మానసిక స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తేలికగా కలుగుతాయని తేలింది. స్వల్ప పరిమాణంలో సేవిస్తో పెద్దగా ప్రమాదం లేనప్పటికీ హద్దులు దాటితే ప్రాణాపాయం కూడా జరుగవచ్చని మహిళామణులు తెలుసుకోవాలి. రోజు రోజుకు మహిళల్లో మద్యం పట్ల ఆదరణ పెరగడంతో ఆల్కహాల్‌ దురలవాట్లు పెరగడం, తీవ్రంగా ఆరోగ్యాలను హరించడం గమనిస్తున్నారు. మద్యం దురలవాట్లతో బాధ్యతల విస్మరణ, తాగి వాహనాలు నడుపుతూ ఆక్సిడెంట్లు, సామాజిక వెలివేత, ఓపిక నశించడం, నియంత్రణ లోపించి అసాధారణంగా ప్రవర్తించడం, మాటలు జారడం, శారీరక నియంత్రణ కోల్పోవడం, ఆల్కహాల్‌ వైపుకు దృష్టి ఆకర్షించబడడం, అకస్మాత్తుగా మద్యం మానితే ప్రతికూల ప్రభావాలు బయట పడడం లాంటివి కలుగుతాయి.

స్త్రీ పురుషుల్లో మద్యం పరిమితులు:
మద్యం అలవాటు లేదా దురలవాటుకు దూరంగా ఉండడానికి ఆరోగ్యకర అలవాట్లు చేసుకోవడం, మంచి అభిరుచులను కలిగి ఉండడం, ప్రతి రోజు ధ్యానం/యోగా చేయడం, సడలింపు పద్దతులు పాటించడం, మిత్రులు/బంధువులతో గడపడం, జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టడం, ఆల్కహాల్‌ దుష్ప్రభావాల పట్ల అవగాహన కలిగి ఉండడం లాంటివి ఆచరించారు. పురుషుల కన్న మహిళల్లో మద్యం దుష్ప్రభావాలు అధికంగా ఉన్నందున నేటి డిజిటల్‌ వనితలు ఆల్కహాల్‌ సేవనానికి దూరంగా ఉండడం లేదా మహిళలకు ఒక పెగ్గు (45 ఎంఎల్‌) వరకు, పురుషులు 2 పెగ్గుల వరకు లేదా వారానికి 3 పెగ్గులు మాత్రమే సేవించడం ఉత్తమం అని తెలుసుకోవాలి. నిత్యం మద్యం తాగే అలవాటు స్త్రీ పురుషులకు ప్రాణాంతకమని, పండుగలు-పబ్బాలు/ సామాజిక సమావేశాలు/శుభకార్యాలు/బంధువులకు చేసే మర్యాదలు లాంటి సందర్భాల్లో మాత్రమే 1 లేదా 2 పెగ్గుల వరకు మాత్రమే పరిమితం చేస్తూ నిగ్రహమనే మానసిక కవచంతో ఆల్మహాల్‌ను దూరం పెట్టడం ఉత్తమమని మరువరాదు.

-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
 కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page