యుద్ధ మేఘాలు.. వర్షాల అనిశ్చితి.. భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమా?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం కూడా కొత్త ప్రమాదం అంచున నిలిచింది. ఒకవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావంతో రుతుపవనాలపై నెలకొన్న అనిశ్చితి భారత ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయి. ఇటీవల భారత రిజర్వ్ బ్యాంక్  పశ్చిమాసియా సంక్షోభాన్ని దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా పేర్కొనగా, భారత వాతావరణ శాఖ  కూడా ఈ ఏడాది వర్షాకాల అంచనాలపై విడుదల చేసిన ప్రకటన  ఆందోళన కలిగించే పరిణామం.

భారతీయ రిజర్వ్ బ్యాంక్  శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణ ప్రపంచ మరియు దేశీయ ఆర్థిక స్థిరత్వానికి ప్రస్తుతం అతిపెద్ద ముప్పుగా మారిందని హెచ్చరించింది. ఈ యుద్ధ పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం పెరగడం, ఇంధన ధరలు అధికమవడం, అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయాలు ఏర్పడటం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి సమస్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, భారత వాతావరణ శాఖ  ఈ ఏడాది నైరుతి రుతుపవనాల అంచనాను 50 ఏళ్ల సగటుతో పోలిస్తే 90 శాతానికి తగ్గే అవకాశముందని అంచనా వేసింది . అలాగే, తీవ్ర ఉష్ణోగ్రతల  నుంచి త్వరలో ఉపశమనం లభించే  అవకాశం లేదనీ , వర్షాలు దేశంలోని అనేక ప్రాంతాలకు చేరుకోవడానికి మరో ఏడు రోజులు పట్టవొచ్చని తెలిపింది.

వాతావరణ శాఖ  చివరిసారిగా తక్కువ వర్షపాత అంచనాను 2015లో ప్రకటించింది. అప్పట్లో వర్షపాతం 88 శాతం ఉంటుందని అంచనా వేయగా, వాస్తవంగా 86 శాతం మాత్రమే నమోదైంది. భారతదేశ చరిత్రలో అత్యల్ప రుతుపవన వర్షపాతం 1972లో నమోదైంది. ఆ ఏడాది కేవలం 77.7 శాతం వర్షపాతం మాత్రమే కురిసింది.

ఈ రెండు హెచ్చరికలు కలిసి చూస్తే, 2026-27 ఆర్థిక సంవత్సరంలో  భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. దిగుమతుల ద్వారా వొచ్చే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడం, వ్యవసాయ ఉత్పత్తి తగ్గే ప్రమాదం, వినియోగదారుల ఖర్చు సామర్థ్యం మరియు డిమాండ్ మందగించడం వంటి అంశాలు ఒకేసారి ప్రభావం చూపవొచ్చని విధాన నిర్ణేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు మరింత పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. దేశ అవసరాల్లో దాదాపు 85 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రరూపం దాల్చితే మొదట ప్రభావం చూపేది ఇంధన ధరల పైనే. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు, సరుకు రవాణా చార్జీలు పెరిగి చివరకు సాధారణ వినియోగదారుడి జేబుపై భారం చూపుతాయి.

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలకు కూడా ఇది సవాలుగా మారుతుంది. ఇప్పటికే ఆహార వస్తువుల ధరల పెరుగుదల సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతుండగా, ఇంధన ధరల పెరుగుదల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గితే పరిశ్రమల ఉత్పత్తి మందగిస్తుంది. దాని ప్రభావం ఉపాధి అవకాశాలపై కూడా పడుతుంది.

ఇక మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగం వర్షాలపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ సాగునీటి వనరులు పూర్తిగా అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతింటుంది. వర్షాభావం ఏర్పడితే వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇది ఆహార భద్రతతో పాటు ధరల పెరుగుదలకు కూడా దారితీస్తుంది.

వర్షాల కొరత వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైతుల ఆదాయం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. దీని ప్రభావం వినియోగ వస్తువుల మార్కెట్‌పై పడుతుంది. ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, నిర్మాణ రంగాలు కూడా మందగమనాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షాల అనిశ్చితి కేవలం వ్యవసాయ సమస్య మాత్రమే కాదు; అది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశం.

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్న అతిపెద్ద బలం అంతర్గత వినియోగ మార్కెట్. అయితే యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరిగి, వర్షాభావం కారణంగా ఆహార ధరలు కూడా పెరిగితే సామాన్య ప్రజల ఖర్చు సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఆర్థిక వృద్ధి రేటును ప్రభావితం చేయవొచ్చు. గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అస్థిరతల మధ్య కూడా భారతదేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేయగలిగింది. కానీ ప్రస్తుతం ఎదురవుతున్న ద్వంద్వ సవాళ్లు మరింత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చమురు నిల్వలను పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ రంగానికి నీటి నిర్వహణలో ఆధునిక పద్ధతులను విస్తరించడం అత్యవసరం. రైతులకు సమయానుకూల సమాచారం, విత్తనాలు, బీమా రక్షణ అందించడం కూడా కీలకం. మరోవైపు ధరల నియంత్రణకు అవసరమైన ఆహార నిల్వలను సిద్ధంగా ఉంచాలి.

పశ్చిమాసియా యుద్ధం మన సరిహద్దుల్లో జరగకపోయినా దాని ప్రభావం భారతదేశంలోని ప్రతి ఇంటికి చేరే అవకాశం ఉంది. అలాగే వర్షాలు కురవకపోతే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పై పడుతుంది. యుద్ధం, వాతావరణ మార్పులు వంటి బాహ్య సవాళ్లను మనం నియంత్రించలేకపోవొచ్చు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించే విధానాలను మాత్రం అమలు చేయవొచ్చు. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే యుద్ధ మేఘాలు, వర్షాల అనిశ్చితి కలిసి భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరత పరచే  ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *