భావోద్దీపనలు…

వేనవేల ఉద్వేగాలను, ఆనందాశ్రువులను, వెలుగు చీకట్ల జీవనగతులను ఒడిసిపట్టి  కొత్త చైత్రాన్ని పూయించి మున్ముందుకు నడిపించే శక్తి ఖచ్చితంగా కవిత్వానికి ఉంది. ఉదయాల్ని దిద్దించే తూర్పుగుండెలా  కాంతిని వెదజల్లుతూ అప్రతిహతంగా దూసుకెళ్లే శబ్దవేదిలా కవిత్వం మనిషికి జ్ఞానదిశను నిర్దేశిస్తుంది. దేశీయత, కవితాత్మకత, మానవతల ముప్పేటహారంలా అల్లుకొన్న అనుభవ పరిమళం లాంటి కవిత్వాన్ని వర్ధమాన కవయిత్రి ఎన్‌ లహరి అక్షర నేత్రాలు పేరుతో సంపుటిగా వెలువరించారు. 54 కవితలున్న ఈ సంపుటికి లోచూపు శీర్షికతో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్‌ గోపి రాసిన ముందు మాటలో చక్కటి వస్తువరణం, చిక్కని మృదువైన శైలి ఈమె కవితల సొత్తు అన్నారు. సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ఆర్థిక చేయూతతో వెలువడిన  ఈ సంపుటిని కవయిత్రి లహరి తన జీవన సహచరుడు ఎన్‌ భగవాన్కు అంకితమిస్తూ ప్రతీ కవితనూ రాయగానే వింటూ, తప్పొప్పులను సరిచేస్తూ, ఎంతో ఉత్సాహంగా చదివే నా తొలి పాఠకుడు అని కృతజ్ఞతలు చెప్పారు.

ఏ జన్మలోనో నేను పారేసుకున్న ముత్యాలు ఈ లోకంలో అక్షరాలై దొరికాయి నాకు, అష్టైశ్వర్యాలు లేవు నాకు ఇష్టమైన అక్షరాలు తప్ప అని కవయిత్రి ఈ సంపుటిలోని నా మాటలో రాసుకున్న మాటలు ఆమెకు కవిత్వంపై ఉన్న మమకారాన్ని, శ్రద్ధను ప్రతిబింబిస్తున్నాయి. స్ఫూర్తి ఈ సంపుటిలోని తొలి కవిత. సమస్యలకు భయపడకు ఉరకలెత్తే ఉత్సాహంతో/ నిన్ను నువ్వే భుజం తట్టుకుని లక్ష్యదిశగా సాగిపో/  విజయ పరంపర నీవెంటే/  నీకు నువ్వే స్ఫూర్తి అన్నారు. తనను తనలా  పరిచయం చేసే ఒక రోజుకై ఆశగా ఎదురు చూడడంలోనే ఆనందముందని చెప్పారు. కష్టాల కడలిని మౌనంగా జయిస్తే ఆకాశం తలవంచదా, నవ చైతన్యం వెల్లివిరియదా అన్నారు. చల్లని స్నేహ హస్తం అందించే ఓ నేస్తం కావాలని ఆకాంక్షించారు. మనస్సులో చెరగని ముద్ర స్నేహానిదని,  దేశభక్తులను కీర్తించి  దేశ ఔన్నత్యాన్ని శిఖరాలపై నిలబెట్టుదామని పిలుపునిచ్చారు. యుగాది నుండి యుద్ధ నినాదమే జీవితాన్ని అగాదంలోకి నెడితే ఉగాది ఎలా జరపను అన్నారు. కర్షకుడిని నింగి చంద్రుడు, నేల జాబిలి, నెల రాజు, నేల రాజుతో పోల్చారు. ఓపిక, సహనంతో మహిళ సాధించిన జీవన ప్రయాణాన్ని  వివరించారు.

ఆత్మ జ్ఞానం కవితలో జీవితం నేర్పే విలువైన పాఠాలు నేర్చుకుంటూ నన్ను నేను మార్చుకుంటున్నాను అన్నారు. చరవాణిని మంచి కోసం వాడితే మధుర వాక్యం/  చెడు కోసం ప్రయత్నిస్తే మరణ కావ్యమని చెప్పారు. మహిళ అసమానతలను అధిగమించి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ధృడంగా కోరుకున్నారు. ఆశలు అడియాశలు చేసి గుండెల్లో బాణాలు దింపి దూరమైపోయిన బంధాన్ని తలపోశారు. పూలు చల్లి నడిపించాలన్నా/  ముళ్ళ దారిలో పరిగెత్తించాలన్నా సామాజిక మాధ్యమానికే సాధ్యమని చెప్పారు. విధాత తలపున విశ్వరూప విన్యాసం చేసిన అక్షర తపస్వి, వెండి తెరకు అక్షరాల వన్నెలద్దిన సిరివెన్నెలకు అక్షర నివాళులు అర్పించారు. పల్లెల సంప్రదాయ బంధం బతుకమ్మను తలిచారు.  ప్రకృతి సందేశాన్ని మనిషికి విడమర్చి చెప్పారు. ఊపిరి ఉన్నంత కాలం బ్రతుకు పోరాటం తప్పదన్నారు. అమ్మది ప్రేమ నిండిన తడి హృదయమని చెప్పారు. వెలుగుదారులు పరిచి నడిపించిన అమ్మ, నాన్న, గురువులను తలచు కొని శిరసా నమామి అని  ప్రణతు లు సమర్పించారు. అణకువతోనే అంతిమ విజయం దక్కుతుందన్నారు. జలనిధిని కాపాడుకోకుంటే తుదకు కన్నీరు కూడా ఇంకిపోతుందని మనిషిని  హెచ్చరించారు. తాను కడలికి పర్యాయపదాన్ని అన్నారు. ఇద్దరిదీ తీరం చేరాలన్న  లక్ష్యమేనని చెప్పారు. యువతను రేపటి భవిత కోసం మేలుకొమ్మన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలని కోరారు. సమతా స్థితిని పాటించడమే గొప్ప నిధి అని చెప్పారు. శాంతి బోధన కోసం బుద్ధుడు మళ్ళీ పుట్టాలని అన్నారు. పద పరిమళాల ఆహ్వానంతో, భాషావనంలోకి చేరి హాయిగా జీవిస్తున్నానని తెలిపారు. వసంతపు కాంతులతో విరజిమ్మే ఇంద్రధనస్సు కోసం మరో అడుగు ముందుకు వేశారు. ప్రపంచాలు వేరైనా ప్రేమను వెలిగించి అక్షర స్ఫూర్తితో విముక్తి గీతాన్ని పాడుదామన్నారు.

సృష్టిలో  అమ్మే గొప్పదని అభివర్ణించారు. అరవిరిసిన విరుల పరిమళంలా నెచ్చెలి ఉంటే ఏమని వర్ణించాలని అన్నారు. ఆత్మన్యూనతను చంపుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని సూచించారు. అంగవైకల్యం దేహానికే కాని మనస్సుకు కాదని నిరూపించమని చెప్పారు. ఓ కవితకు దక్కిన గౌరవం మరో కవితకు తప్పనిసరిగా  ప్రేరణగా మారుతుందని గమనించమన్నారు. సేవలకు ప్రతిరూపమైన పారిశుధ్య కార్మికులను మానవీయ విలువలున్న మహోన్నతులుగా వర్ణించి వారికి శతకోటి వందనాలు చెల్లించారు. కష్టాలను ఎదురొడ్డి నిలిచి గెలిచిన మాతృమూర్తికి మనసారా పాదాభివందనం చేశారు. అనునిత్యం చైతన్యపరుస్తున్న పెద్దనాన్న ఆచార్య గోపికి ప్రేమతో సగౌరవంగా అక్షరాభివందనం సమర్పించారు.
వేణుమాధవుని చిన్ని పాదాలు తన ఇల్లును నందనమయం చేయాలని కోరుకున్నారు. తెరచుకున్న గవాక్షాన్ని ఆభరణం చేసి అలంకరించుకుంటానన్నారు. మనుషులుగా దూరమైనా మనస్సులతో దగ్గరగానే ఉన్నామని ఎడబాటులోని అనుబంధాన్ని అక్షరీకరించారు. విరుల మహారాణి తన ప్రేమను వ్యక్తపరిచే మార్గంలో సదా అగ్రగామి అని వెల్లడిరచారు. సంతోషపు సడి, జలపాతాల సవ్వడిగా నవ్వును వర్ణించారు. రణధీరులైన సైనికులకు వినమ్రంగా జోహార్లు అర్పించారు. నాన్నంటే మాటలకందని అనురాగమని చెప్పారు. ప్లాస్టిక్‌ ఊబిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. కంటికి కానరాని పచ్చదనాన్ని గూర్చి ప్రస్తావిస్తూ పర్యావరణ ప్రమాదాన్ని గుర్తించమన్నారు. యుద్ధం మిగిల్చిన శోకాన్ని  తెలిపి శిథిలమైన జీవితాలపై అది నిరంకుశత్వమని వేదన చెందారు. వసుధైక కుటుంబంగా ప్రజలంతా జీవించాలని అన్నారు.  సరైన తోడుంటే సాధ్యం కానిదంటూ లేదన్నారు. కరోనా వికృత కాలంలో ప్రాణ దాతలుగా మారిన వైద్యుల సేవా నిరతిని కొనియాడారు. ఎండిన ఆకుల మౌన ఘోషను ఆర్ద్ర హృదయంతో గమనించమన్నారు. జీవితాన్ని జాగ్రత్తగా గమనించే దార్శనికుడు బంగారు భవిష్యత్తుకు గొప్ప బాటలు వేస్తాడని చెప్పారు. జీవితమే ఒక నాటకమని, ఆత్మ విశ్వాసమే ముందడుగుకు తిరుగులేని ఆయుధమని తెలిపారు.  అక్షర నేత్రాలను ప్రజ్వలిత జ్ఞాన నేత్రాలుగా అభివర్ణించారు. వస్తువులో, అభివ్యక్తిలో వినూత్నత, చక్కటి పదజాలంతో కూడిన గాఢత, సాంద్రత సంతరించుకున్న ఈ కవిత్వం వైవిధ్యమైన ప్రయత్నానికి ప్రతినిధిత్వంగా నిలుస్తుంది.
      -డా. తిరునగరి శ్రీనివాస్‌
8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page