భారీ వర్షంతో తీవ్ర నష్టం

  • వరద బాధితులకు ఉడతా భక్తి సహాయం
  • బాధితులకు సరకులు పంపిణీ
  • వాహనాలకు జెండా ఊపిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు  

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద బాధితులకు సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నామని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ‌హరీష్‌ ‌రావు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వొచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…సహాయం చేయడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

 

రాష్ట్రంలో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన నడుస్తుందని, ముందుగా ప్రభుత్వం మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని హరీష్‌ ‌రావు చురకలంటించారు. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌ ‌సిల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌ ‌తరహాలో బిజెపి, మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

 

తాము వరద బాధితులకు సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు దాడి చేయడంతో పాటు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. వరద బాధితులు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారని, సిఎం రేవంత్‌ ‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని హరీష్‌ ‌రావు హెచ్చరించారు. బిఆర్‌ఎస్‌కు వొస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ ‌నేతలు దాడులకు తెగపడ్డారని ధ్వజమెత్తారు. బాధితులకు అన్నం, నీళ్లు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇవ్వలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు నీళ్లలో మునిగి పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page