భారత ఆర్థిక వేత్త డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌

భారతరత్నడా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ పేరు వినగానే అందరి కీ వెంటనే స్ఫురించే  విషయం ఏమిటంటే స్వతంత్ర భారతావనికి దిశానిర్దేశం చేయడానికి  అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప రాజ్యాంగ నిర్మాత.  కోట్లాది మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. ఇంకా మరింత ముందుకు వెడితే  ఆయన ఒక  గొప్ప న్యాయ కోవిదుడు.తత్వ వేత్త,రాజకీయ వేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, పరిశోధకుడు  ఇలా అన్నీ  చెప్పిన తరువాత కొసమెరుపుగా అంబేడ్కర్‌ ఒక ఆర్ధికవేత్త కూడా అని ప్రస్తుతించడం పరిపాటిగా మారింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి ఆర్జించిన అంబేడ్కర్‌ వ్యక్తిత్వం విశ్యవ్యాపితం దానిలో సందేహం లేదు.ఎందుకంటే మతం, మానవ వికాసం, సామాజిక శాస్త్రాలు, రాజనీతి శాస్త్రం.. ఇలా అన్నింటిలోనూ ఆయన మేధాశక్తి అపారమైనది. అయితే ఆయన రచనలు, ప్రసంగాలను పరిశీలిస్తే ఆయన హృదయానికి, ఆలోచనలకు దగ్గరగా ఉన్నది ఆర్థికశాస్త్రం మాత్రమేనని ఆర్ధిక విశ్లేషకులు చెబుతారు. దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితంపై  ఆర్థిక సిద్ధాంతాలే,  ఎక్కువ ప్రభావం చూపాయి కూడా. అంతే కాదు ఆయన ఆర్ధిక పరిశోధనలు  ఆలోచనలు సూచనలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శనం చేశాయని కూడా చెప్పవచ్చు. అయితే ఆర్ధిక వేత్తగా ఆయన చేసిన పరిశోధనలకు ఎక్కువ ప్రచారం జరగలేదు అన్నది మాత్రం సత్యం.  అంబేడ్కర్‌ ఆర్ధిక వేత్తగా తక్కువ మందికే తెలుసు. విద్యార్థి దశ నుంచే ఆయనకు ఆర్థిక రంగంపై ఆసక్తి ఉండేది. దేశ చరిత్ర వర్తమానం భవిష్యత్తు చుట్టూ ఆయన ఆలోచనలు తిరుగుతుండేవి.
అంబేడ్కర్‌  27 ఏళ్ల వయసులోనే ఎకనామిక్‌ జర్నల్‌లో ‘థియరీ ఆఫ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌’ అనే వ్యాసంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిపై మార్గనిర్దేశనం చేశాడు. వ్యవసాయం మీదనే ప్రజలు ఆధారపడటం వల్ల ఆ వ్యవస్థ ఒత్తిడికి గురవుతోందనీ,  దేశానికీ, ప్రపంచానికీ మార్గనిర్దేశనం చేశాడు. ఇదే విషయమై పరిశోధన సాగించిన సర్‌ ఆర్థర్‌ లూయీస్‌కు 1954లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. అంతేకాకుండా, 1945లో తాను రాసిన ‘స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌’ అన్న డాక్యుమెంటులో దేశంలోని వనరులను, ముఖ్యంగా భూమినీ, భారీ పరిశ్రమలనూ, బ్యాంక్‌, ఇన్సూరెన్స్‌ సంస్థల వంటి వాటినీ ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉంచకూడదనీ, వాటిని జాతీయం చేయాలనీ ప్రతిపాదించాడు. అంబేడ్కర్‌ కొలంబియా విశ్వ విద్యాలయంలో అర్ధ శాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీతో పాటు డాక్టరేట్‌ కూడా చేశారు.లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ లో అర్ధ శాస్త్రంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ కూడా పూర్తి చేశారు.అంతే కాదు భారత దేశం నుండి విదేశాలకు వెళ్లి అర్ధశాస్త్రంలో డాక్టరేట్‌ పొందిన మొదటి వ్యక్తి డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌. అదే సమయంలో దక్షిణ ఆసియా మొత్తంలో అర్ధశాస్త్రంలో రెండు డాక్టరేట్‌లు పొందిన వారిలో అంబేడ్కర్‌ ప్రధములుగా నిలిచారు. అర్ధశాస్త్రంలో డిగ్రీలు చేతపట్టుకోవడమే కాదు ఆర్ధిక అంశాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు..
పరిశోధనలు చేశారు..ఎన్నో గ్రంధాలు కూడా రచించారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అంబేడ్కర్‌ పరిశోధన చేస్తున్న  సమయంలో ఇంగ్లాండ్‌లోను, ఇండియాలోను రూపాయి మారకం విలువపైనే చర్చలు జరుగుతుండేవి. రూపాయి విలువ తరచూ పడిపోతుండడం, విలువను సుస్థిరంగా ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇందుకు గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ స్టాండర్డ్‌, గోల్డ్‌ కన్వర్టబుల్‌ స్టాండర్డ్‌లో ఏది మంచిది, ఏ విధానాన్ని అనుసరించాలి, కేంద్రీయ బ్యాంకు ఏర్పాటు… తదితర అంశాలపై చర్చలు నడుస్తుండేవి.ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అంబేడ్కర్‌ తన పీహెచ్‌డీ పరిశోధనలో భాగంగా  రూపాయి సమస్యలపై అధ్యయనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆ పరిశోధనల ఫలితమే  తాను రచించిన ‘‘ది ప్రాబ్లమ్‌ ఆఫ్‌ రూపీ ఇట్స్‌ ఆరిజన్‌ అండ్‌ సొల్యూషన్‌’’అనే గ్రంధంగా వెలువడిరది.ఇదే సమయంలో ఆధునిక అర్ధశాస్త్ర పితామహుడు  అయిన జే.ఎం.కీన్స్‌ రూపాయి విలువ స్ధిరంగా ఉంచే విషయంలో మన ఆర్ధిక వ్యవస్ధకు మేలైన కరెన్సీ విధానం గురించి సూచనలు చేశారు.ఆయన సూచన ప్రకారం భారత్‌ వలస దేశం కావడంతో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ స్టాండర్డ్‌ విధానం సరిపోతుందని సూచించారు.కరెన్సీ వ్యవహారాలపై సాధికారికంగా చెప్పేవారిలో ప్రపంచంలోనే ప్రొఫెసర్‌ కీన్స్‌ ప్రథమ స్థానంలో ఉంటారు. ఈ విషయాల్లో ఆయన అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదు. అందుచేత బ్రిటీష్‌ ప్రభుత్వం కూడా కీన్స్‌ సూచనను అంగీకరించింది.అయితే ఈ సూచనను అంబేడ్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.  గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ స్టాండర్డ్‌  విధానం వల్ల రూపాయి మారకం రేటులో స్థిరత్వం రాదని ఆయన వాదించడమే కాకుండా తన వాదనకు మద్దతుగా 1800-1893 మధ్య ఉన్న కరెన్సీ విలువలపై అధ్యయనం చేసి రూపాయి విలువ ఏ విధంగా మార్పులకు లోనయిందో చూపించారు. ప్రత్యేకించి వెనుకబడిన దేశమైన భారత్‌ కు ఇది సరిపోదని  దీని వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది తప్ప ప్రయోజనం లేదని వివరించారు. దీనితో పాటు సంపద కేంద్రీకరణ నివారణకు పదేళ్లకోసారి పెద్ద నోట్లను రద్దు చేయాలని అంబేడ్కర్‌ సూచించారు.
 రిజర్వ్‌ బ్యాంకు ప్రతిపాదన
దేశంలో అన్ని ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఓ కేంద్రీయ బ్యాంకు ఉండాలన్న ప్రతిపాదనకు అంబేడ్కర్‌ ఆలోచనలు, పరిశోధనలే మార్గదర్శనం చేశాయని చెప్పవచ్చును. మన దేశంలో 1921లో ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఏర్పాటైంది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఆవిర్భావానికి పూర్వం  ఇదే మన దేశానికి సెంట్రల్‌ బ్యాంకుగా ఉండేది. అయితే ఇది తన విధులు సక్రమంగా నిర్వహించడంలో విఫలమైంది. దాంతో రూపాయి విలువ దారుణంగా పడిపోవడం మొదలైంది. అయితే ఆ సమయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ క్షీణిస్తున్న రూపాయి విలువ, దాని వల్ల సామాన్యుడి జీవనం ఎలా దుర్భరమవుతుందో, ఆర్థికంగా దేశం ఎలా పతనమవుతుందో బ్రిటీష్‌ వాళ్లకు తెలియచేసారు అంబేడ్కర్‌.  బ్రిటీష్‌ ప్రభుత్వం రూపాయి విలువ పడిపోకుండా పరిష్కార మార్గాలను అంబేడ్కర్‌ రాసిన పుస్తకాన్ని రాయల్‌ కమిషన్‌కు, ఆన్‌ కరెన్సీ ఆఫ్‌ ఇండియన్‌ రూపీ ఆఫ్‌ ఫైనాన్స్‌ పుస్తకాన్ని హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌కు ఇచ్చారు. అలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 1927లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఈ బాధ్యతను దానికి అప్పగించింది. 1932 వరకు మూడు సార్లు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి రిజర్వ్‌బ్యాంక్‌ అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎట్టకేలకు1935 ఏప్రిల్‌ 1న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ నిరంతరాయంగా తన విధులు నిర్వహిస్తూనే ఉంది.భారతీయ కరెన్సీపై ఆయన చేసిన సైద్ధాంతిక, ఆచరణాత్మక విశ్లేషణ రిజర్వు బ్యాంకు స్థాపనలో నిర్ణయాత్మక పాత్ర పోషించినట్టు చెప్పవచ్చును. ప్రపంచీకరణతో అనుసంధానమైన దేశ ఆర్థిక వ్యవస్థలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు బాధ్యతలను పరిశీలించినప్పుడు అంబేడ్కర్‌ ఆలోచనలు నేటికి కూడా మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఈ కారణం చేతనే మన కరెన్సీ నోటుపై అంబేడ్కర్‌ ఫోటో ఉండాలనే డిమాండ్‌ చాలా కాలంగా వినిపిస్తూ ఉంది.
 కేంద్ర రాష్ట్ర ఆర్ధిక సంబంధాలు
సమాఖ్య ప్రభుత్వాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలలో ఆర్ధిక సంబంధాలు కీలక భూమిక వహిస్తాయి.ఈ తరహా ఆర్ధిక సంబంధాలకు సంబంధించి 1917 సంలోనే ‘‘ది ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రొవిన్షియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటీష్‌ ఇండియా’’ అనే పరిశోధనా పత్రాన్ని కొలంబియా విశ్వ విద్యాలయానికి అంబేడ్కర్‌ సమర్పించడం జరిగింది.దీనిలో ప్రభుత్వ విత్తానికి చెందిన అనేక అంశాలు మరియ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్ధిక సంబంధాలు వాటి విషయంలో ఏర్పడే తగాదాలు ఏర్పడినప్పుడు పరిష్కారం చేసుకోదగ్గ సూచనలు ఎన్నో వివరణాత్మకంగాఅంబేడ్కర్‌ సూచించారు.ఆ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే ఆర్ధిక సంబంధాలను ఇంత విపులంగా వివరించిన తీరును ఎందరో ఆర్ధిక వేత్తలు ప్రశంసించారు.. కొలంబియా విశ్వవిద్యాలయం ఈ పరిశోధనను ఎంతగానో ప్రశంసిం చింది కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్ధిక సంబంధాలు నిధుల పంపిణీకి మన దేశంలో ప్రణాళికా సంఘం ఏర్పాటు అనేది కేవలం అంబేడ్కర్‌ చొరవ వల్లనే జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలంటే పారిశ్రామికీకరణ మరియు వ్యవసాయ వృద్ధి  సాధించాలని ముఖ్యంగా ప్రాధమిక రంగమైన వ్యవసాయంలో పెట్టుబడి అధికం చేయాలని అంబేడ్కర్‌ అభిప్రాయ పడ్డారు.
గ్రామీణ స్వయం పోషక, ఆర్థిక వ్యవస్థకు కుల వ్యవస్థే మూలమైనందువల్ల వెనుకబడిన ఉత్పత్తి విధానం మారాలని, పట్టణీకరణ పారిశ్రామికీకరణ పెరగాలని కోరుకున్నారు. పన్నులు చెల్లించే వారికి కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అంటూ ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని చెప్పారు. అల్పాదాయ వర్గాలపై పన్నులు విధింపు లేకుండా చూస్తే పరోక్షంగా వారి శ్రేయస్సును కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు అంబేడ్కర్‌. ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం కావాలి అంటే విద్యుత్‌ కొరత లేకుండా సాగు నీరు త్రాగు నీటి కొరత లేకుండా చేయాలని సూచించారు.. ఈ సమస్య పరిష్కారానికి బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణమే పరిష్కారంగా అంబేడ్కర్‌ భావించారు. దీనిలో భాగంగానే పలు బహుళార్ధక సాధక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు.వరదనీరు సముద్రం పాలు కాకుండా ఉండాలంటే దక్షిణ భారత దేశంలోని నదుల అనుసంధానం జరగాలని ప్రతిపాదన చేశారు.పేదరికం..ఆదాయ అసమానతలు రూపు మాపాలంటే ఆర్థికాభివృద్ధి సాధనే సత్వర పరిష్కారం అని ఏనాడో అంబేడ్కర్‌ చెప్పారు. భారీ పరిశ్రమలు జాతీయం చేయాలని సూచనలు చేశారు.ప్రాంతీయ సమానత సాధించాలి అంటే చిన్న రాష్ట్రాలు శ్రేయస్కరం అంటూ తన వాదనను వినిపించారు.
అంబేడ్కర్‌ రాజ్య సభ సభ్యుడిగా ఉండే సమయంలో అయితే ఆర్ధిక వ్యవస్ధ దాని పురోభివృద్ధి కి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు.అంబేడ్కర్‌ ఆర్ధిక విషయాలపై రచించిన గ్రంధాలు పరిశోధనలు అధ్యయనం చేస్తే ఆయనలో ఒక దీర్ఘ దృష్టి కార్యాచరణ గల గొప్ప ఆర్ధిక వేత్త దర్శనం ఇస్తాడు. కుల వ్యవస్థ లాంటి సామాజిక సమస్యలను ఆర్ధిక కోణంలో చూపిన గొప్ప ఆర్ధిక మేధావి అంబేడ్కర్‌్‌. నేడు దేశం ఎదుర్కొంటున్న పలు ఆర్ధిక సమస్యలకు ఆనాటి కాలంలో అంబేడ్కర్‌ ఆలోచనలు సూచనలు నేటికీ కూడా ఆమోద యోగ్యంగా ఉన్నాయి అంటే ఆర్థిక విషయాల పట్ల ఆయనకు ఉన్న అవగాహన మరియు ఆయన ముందుచూపును మనం అర్ధం చేసుకోవచ్చు.ఆర్దిక రంగంలో అంబేడ్కర్‌ దార్శనికత నేటికీ కూడా ఆచరణీయమే. భారత ఆర్థిక రంగం ఇప్పడు సంపూర్ణంగా మారిపోయింది. కానీ అంబేడ్కర్‌ ఇచ్చిన ప్రధాన సందేశం మాత్రం కాలానికి అతీతంగా నిలిచింది. కరెన్సీని విడుదల చేయడానికి విచక్షణాధికారాలు ఉన్న వ్యవస్థను నియంత్రించడానికి ఓ ఏర్పాటు ఉండాలని ఆయన చెబుతుండేవారు. అది ఇప్పటికీ వర్తిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఆర్ధిక విషయాలలో అంబేడ్కర్‌ దార్శనికతను పరిశీలిస్తే ఆయన రాజ్యాంగ పితామహుడే కాదు గొప్ప ఆర్థికవేత్త కూడా అని నిస్సందేహంగా చెప్పవచ్చును. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అంబేడ్కర్‌ ఆర్ధిక పరిశోధనలు ఆయన రచించిన ఆర్ధిక గ్రంధాలపై మరింత పరిశోధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంబేడ్కర్‌ జయంతి మరియు వర్దంతి రోజున ఒక పూల మాల వేసో,2 నిముషాలు మౌనం వహిస్తేనో సరిపెడితే చాలదు.ఆయన ఆశయాలను ఆచరించగలిగినప్పుడే మనం ఆయనకు వారసులం కాగలం. ఆనాడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అంబేడ్కర్‌ ఒకరి సొత్తు కాదు.. భరతమాత ముద్దు బిడ్డ.. ఆయన భారత జాతి ఆస్తి.. అంబేడ్కర్‌… కొందరివాడు కాదు అంబేడ్కర్‌..అందరివాడు.
-రుద్రరాజు శ్రీనివాసరాజు
9431239578

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page