భారతదేశం గర్వించదగ్గ తెలుగుతేజం పీవీ

 (భారతరత్న పొందిన సందర్భంగా…)

దేశంలోనే తొలిసారి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి…రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడిన వ్యక్తిగా గుర్తింపు. మైనార్టీ సర్కారును సమర్థవంతంగా నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించిన పివి. పివి హయంలో విదేశాలతో సంబంధాలు ,ఆర్థిక సంస్కరణలతో దేశ పరిస్థితిని చక్క దిద్దారు. కేవలం దేశం ప్రత్యేకత గురించి మాత్రమే ఆలోచించిన వ్యక్తిగా గుర్తింపు. ఆర్థిక సంస్కరణల పేరు చెప్తే ముందుగా గుర్తు వచ్చే వ్యక్తి పేరు పీవీ నరసింహారావు. ప్రధాని పీఠం  దిగిన తర్వాత సాధారణ జీవితం గడిపాడు. …17 భాషలలో దిట్ట .రచయితగా గొప్ప ప్రావీణ్యం ఉంది. వ్యాసాలు అనువాద రచనలు సొంత పేరు, మారుపేరులతో  వచ్చాయి.

కరీంనగర్‌ జిల్లా వంగరలో పెరిగాడు. హనుమకొండలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసాడు.దేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి దేశ పురోగతికి పునాదులు వేసినటువంటి వ్యక్తి పీవీ నరసింహారావు గారు. భారతదేశం లోకి ప్రపంచ మార్కెట్ను ప్రోత్సహించడం, భారతదేశ విధానములో విదేశీ విధానంలో, విద్యా రంగంలో ప్రత్యక్షంగా మార్పులు తీసుకురావడానికి అనేక నిర్ణయాలు తీసుకురావడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితికి పంపడం వారి యొక్క గొప్ప ఆలోచన విధానానికి మచ్చు తునక. ఒక జాతీయవాదిగా వారు చేసినటువంటి సేవలకు ఆలోచనలకు ఈరోజు  గుర్తింపు లభించింది.కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ,భారతదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తి పీవీ నరసింహారావు గారు. జీవితాంతం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ పార్టీకి సాధారణ కార్యకర్త నుంచి దేశ ప్రధాని వారికి కూడా అనేక బాధ్యతలు నిర్వర్తించిన గొప్ప రాజ నీతిజ్ఞుడు .

పివి పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని మౌనంగా ఉంటారని ,అభిప్రాయాలే తప్ప, ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శ రాకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం. గతాన్ని రాబోయే భవిష్యత్తును ఏమాత్రం ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి ప్రజలకు మేలు జరుగుతుందనే అజెండాతో పీవీ ముందుకు వెళ్లే వారనీ ఆయన సన్నిహితులు, దగ్గర నుంచి చూసినవారు చెబుతున్నారు. మార్పు వల్ల సమాజంలో మంచి జరగాలని ఆయన కోరుకునేవారు. అయితే పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవి నుంచి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయనను వెంటాడినవి. కానీ ఈ ఆరోపణలని న్యాయస్థానాల్లో వీగిపోయాయి. చివరికి అతను మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు కేసులు అన్ని న్యాయస్థానంలో  వీగిపోయినవి.

తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హై కమాండు విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలన పగ్గాలు అప్పగించారు .1971 సెప్టెంబర్‌ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసా గారు .ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. నాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీవ్‌ మరణం తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ప్రధాన బాధ్యతలు చేపట్టిన పీవీ దేశమత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పాలన  చేపట్టి స్థిరత్వం లేని ప్రభుత్వం, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ ను  గాడిలో పెట్టాడు. పీవీ తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని దీటుగా ఎదుర్కొన్నారు. ప్రభుత్వాన్ని  ఒక వైపు నడిపిస్తూనే , మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లోపెట్టిన చరిత్ర పీవీ గారిది.

రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు నడిపించగలిగాడు.  విదేశాలతో సంబంధాలను మెరుగుపరిచారు.  అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కటి మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ నాయకులు ఏ పని చేసిన సుదీర్ఘకాలం పాటు తన పేరు ఉండాలని భావిస్తారు .కానీ పీవీ అలా కాదు. దేశం ప్రజల గురించి మాత్రమే ఆలోచించే  వారనీ సన్నిహితులు చెబుతారు. గోండు భాష నుంచి స్పానిష్‌ వరకు, సొంత పేరుతో మారుపేరులతో కాలమిస్ట్‌ గా ఎన్నో వ్యాసాలు రాశారు. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్న, అవసరానికి మించి మాట్లాడకపోవడం పివికి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు  మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సరైన గౌరవం ఇచ్చింది. ఇది తెలుగు వారందరికీ లభించిన అరుదైన గౌరవంగా భావించవచ్చు.
-యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌
సిద్దిపేట, 9441762105

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page