పుచుక్… పుచుక్…

·        మెరుపు తీగెలు

 -బమ్మిడి జగదీశ్వరరావు

తెల్లచొక్కా యెర్రగా మారిపోయివుంది, యేదో పెయింట్ వేసినట్టు. బ్లడ్‌తో తడిచినట్టే వుంది. చూస్తే అతడికి గాయం వున్నట్టు నాకేమీ కనిపించలేదు. ఎక్కడ తగిలిందో దెబ్బ అనుకున్నాను. కాని ఆ తెల్లని అదే యెర్రని చొక్కా కుర్రాడు నొప్పి వొక్కరవ్వా ఫీలవడం లేదు. ఆవేశంతో వున్నాడు. ఎగిరి అవతలి వ్యక్తిని వొక్క తన్ను తన్నాడు. ఆ వ్యక్తి బండి మీంచి పడ్డాడు. అతని మీదికి దూకి కొడుతున్నాడు. దెబ్బలు కాస్తున్న వాడి నోరు కూడా యెర్రగా వుంది. నోటి మీద కొట్టాడా?

జనాలకి యీ అనుమానాలతో సంబంధం లేదేమో, వొకరూ వొకరూ వచ్చి చేరారు. గుంపయ్యారు. ఎవరూ ఆగడం లేదు, అంతా చేతికొచ్చిన దెబ్బ కొడుతున్నారు. నేనూ వొక దెబ్బ వేద్దామని చేతిదాక వచ్చిన తీటని బలవంతంమీద ఆపుకున్నాను.

“ఏం చేశాడు?” ఆపి అడిగాను. ఎవరూ సమాధానం యివ్వలేదు. నిష్ఠగా దేహశుద్ధి చేసేపనిలో వుంది మూక.

“ఎందుకు కొడుతున్నారు?” కొడుతున్న వాళ్ళలో వొకడిని మళ్ళీ అడిగాను. అలిసి ఆగాడు తప్ప, నా ప్రశ్నకు మాత్రం కాదు. జవాబివ్వలేదు.

పూరణము లేని బూరె, కారణము లేని యుద్ధం బాగోవు అని మళ్ళీ అడిగిందే అడిగాను.

“ఎందుకు కొడుతున్నారు?”

“నాక్కూడా తెలీదు!” అన్నాడు. అని మళ్ళీ కొట్టడంలో పడ్డాడు. నేను అవాక్కయి చూస్తే, ‘రండి మీరూ వొక చెయ్య వేయండి’ అన్నట్టు చూశాడు.

నాకు నోట మాట రాలేదు.

“అయినా కిల్లీ తిని యెక్కడకక్కడ ‘పుచుక్ పుచుక్’ వుమ్మడం అలవాటైపోయింది, బస్సులోంచి వెళ్తున్నవాడు బండిమీద వెళ్తున్నవాడిమీద వుమ్మాడు…” అని వొకడు అంటే, “ట్రాఫిక్ ఆగిపోవడానికి పెద్ద కారణం అక్కర్లేదు” అని మరొకడు అంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.

అన్నిటికీ కారణాలు తెలుసుకోకూడదు అని వొక్క క్షణం అనిపించింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *