Take a fresh look at your lifestyle.

భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదు

  • అధికారంలోకి వొస్తే పేద బ్రాహ్మణులను ఆదుకుంటాం
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌

‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 18 : భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. వైకుంఠదామాలకు భగవద్గీత పెడితే అడ్డుకుంటామన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రజా సంగ్రామ యాత్ర శిరం వద్దకు బ్రాహ్మణ ప్రతినిధులు వొచ్చి బండి సంజయ్‌కు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తాము ఎదుర్కుంటున్న సమస్యలు, హిందు మతంపై జరుగుతున్న దాడులను బ్రాహ్మణులు సంజయ్‌కు వివరించారు. బ్రాహ్మణులలో కడు పేదవారున్నారని, రూ.1000 కోట్లతో బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుని పాదయాత్ర ప్రారంబించానని, తమకు కష్టాలు వొస్తే మీకు చెప్పుకుంటామని, మీకే కష్టాలు వొస్తే తమకు చెప్పుకునే పరిస్దితి రావడం చాలా బాధాకరమన్నారు.

రానురాను కంప్యూటర్లు పెట్టుకుని పూజలు చేసుకునే పరిస్దితి వొస్తుందేమోనన్నారు. రాష్ట్రంలో వేద పాఠశాలల ఏర్పాటు కొరకు తన వంతు సహాయం చేస్తానన్నారు. తెలంగాణలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కొంత మంది హిందు ధర్మాన్ని నాశనం చేయాలని రామాయణం, భగవద్గీతలను కించపరుస్తున్నారని అలాంటి వారిని అడ్డుకుంటామన్నారు. బిజెపి అంటే సనాతన ధర్మాన్ని, హిందు ధర్మాన్ని రక్షించే పార్టీ అని, తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్‌ అర్చకులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రతి పురాతన దేవాలయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలన్నారు. బ్రాహ్మణులకు బిజెపి అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో హిందువులందరిని ఏకతాటిపై తీసుకొచ్చి, హిందూ వ్యతిరేక శక్తులను బొందపెడతామన్నారు. బిజెపికి ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

Leave a Reply